వంగవీటి రత్నకుమారిగా నైనా
రామ్గోపాల్ వర్మ స్టోరీ సెలక్షన్లోనే కాదు పాత్రల ఎంపిక లోనూ తన మార్క్ ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలను తెరకెక్కించే వర్మ, వారి జీవితాలలోని భావోద్వేగాలను పలికించగలిగే నటులనే ఎంపిక చేసుకుంటారు. అందుకే అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలను రక్త చరిత్రగా తెరకెక్కించిన సమయంలో వివేక్ ఒబెరాయ్, సూర్యలను తరువాత కిల్లింగ్ వీరప్పన్ కోసం సందీప్ భరద్వాజ్ను తీసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో వంగవీటి సినిమాలో కీలక పాత్ర కోసం నైనా గంగూలిని ఎంపిక చేశాడు.
విజయవాడ నాయకులు వద్దంటున్నా వంగవీటి సినిమా తెరకెక్కించాలనే నిర్ణయించుకున్న వర్మ, ఇప్పటికే ఓ పాటతో పాటు రాధ, రంగ పాత్రదారులను కూడా పరిచయం చేశాడు. తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర అయిన వంగవీటి రత్నకుమారి పాత్రధారిని కూడా ప్రకటించాడు. రంగ మరణం తరువాతే ప్రపంచానికి పరిచయం అయిన రత్నకుమారి అంతకు ముందు ఎలాంటి భావోద్వేగాలను అనుభవించిందో నైనా గంగూలి అద్భుతంగా చూపించగలదంటున్నాడు వర్మ. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వంగవీటి సినిమా, రిలీజ్ లోపు ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి.