Ratna Kumari
-
వంగవీటి సినిమాలో ఆ డైలాగ్ కట్ చేశారు
విజయవాడ రౌడీయిజం నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం వంగవీటి. ఈ శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా.. ముందునుంచి ఉన్న హైప్ కారణంగా మంచి వసూళ్లను సాధిస్తోంది. అయితే రిలీజ్‌కు ముందు నుంచే ఎన్నో వివాదాలను సృష్టించిన వంగవీటి సినిమాపై రిలీజ్ తరువాత కూడా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా వంగవీటి కుటుంబ సభ్యులు సినిమాలో పలు అభ్యంతరకర సన్నివేశాలు, డైలాగ్‌లు ఉన్నాయంటూ ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. గతంలో ఏ సినిమా విషయంలో కూడా వెనక్కి తగ్గని వర్మ, వంగవీటి విషయంలో మాత్రం కాస్త తగ్గేందుకు ఓకే చెప్పాడు. సినిమా రిలీజ్‌కు ముందే కమ్మ.. కాపు అనే పాటను తీసేసిన వర్మ.. తాజాగా సినిమాలో వంగవీటి రత్నకుమారి చెప్పే 'చంపేయ్ రంగా' అనే డైలాగ్‌ను కట్ చేసేందుకు అంగీకరించాడు. ఆదివారం నుంచి థియేటర్లలో ఈ డైలాగ్ వినిపించదు. ప్రస్తుతానికి ప్రశాంతంగానే కనిపిస్తున్నా.., వర్మ సృష్టించిన వంగవీటి వివాదం ఎటు దారి తీస్తుందో అని సినీ, రాజకీయా వర్గాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. -
వంగవీటి రత్నకుమారిగా నైనా
రామ్‌గోపాల్ వర్మ స్టోరీ సెలక్షన్‌లోనే కాదు పాత్రల ఎంపిక లోనూ తన మార్క్ ఉండేలా చూసుకుంటారు. ముఖ్యంగా నిజ జీవిత కథల ఆధారంగా సినిమాలను తెరకెక్కించే వర్మ, వారి జీవితాలలోని భావోద్వేగాలను పలికించగలిగే నటులనే ఎంపిక చేసుకుంటారు. అందుకే అనంతపురం ఫ్యాక్షన్ రాజకీయాలను రక్త చరిత్రగా తెరకెక్కించిన సమయంలో వివేక్ ఒబెరాయ్, సూర్యలను తరువాత కిల్లింగ్ వీరప్పన్ కోసం సందీప్ భరద్వాజ్‌ను తీసుకున్నాడు. ఇప్పుడు అదే బాటలో వంగవీటి సినిమాలో కీలక పాత్ర కోసం నైనా గంగూలిని ఎంపిక చేశాడు. విజయవాడ నాయకులు వద్దంటున్నా వంగవీటి సినిమా తెరకెక్కించాలనే నిర్ణయించుకున్న వర్మ, ఇప్పటికే ఓ పాటతో పాటు రాధ, రంగ పాత్రదారులను కూడా పరిచయం చేశాడు. తాజాగా ఈ సినిమాలో మరో కీలక పాత్ర అయిన వంగవీటి రత్నకుమారి పాత్రధారిని కూడా ప్రకటించాడు. రంగ మరణం తరువాతే ప్రపంచానికి పరిచయం అయిన రత్నకుమారి అంతకు ముందు ఎలాంటి భావోద్వేగాలను అనుభవించిందో నైనా గంగూలి అద్భుతంగా చూపించగలదంటున్నాడు వర్మ. ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న వంగవీటి సినిమా, రిలీజ్ లోపు ఇంకెన్ని వివాదాలకు దారి తీస్తుందో చూడాలి. -
వైఎస్ తరహాలో పథకాలను అందించాలి
జన్మభూమిలో ప్రొటోకాల్ ఉల్లంఘన తగదు మంత్రి, కలెక్టర్లను ప్రశ్నించిన ఎంపీపీ పచ్చల రత్నకుమారి కాజ (మంగళగిరి రూరల్) : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో రాజకీయాలకు అతీతంగా పేదలకు సంక్షేమ పథకాలు అందించారని, ప్రస్తుత ప్రభుత్వం కూడా అదే మాదిరి సంక్షేమ పథకాలను పేదలకు అందించేందుకు కృషి చేయాలని ఎంపీపీ పచ్చల రత్నకుమారి సూచించారు. మండలంలోని కాజ పంచాయతీ కార్యాలయం ఎదుట ఆదివారం నిర్వహించిన జన్మభూమి - మా ఊరు గ్రామ సభలో పాల్గొన్న ఆమె పాలకులు, అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలకు అతీతంగా మహానేత వైఎస్ సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రజల మన్ననలను పొందారని ఆమె చెప్పారు. నేటి పాలకులు మాత్రం జన్మభూమి కమిటీల పేరుతో వారి అనుయాయులకే పథకాలు అందించేలా వ్యవహరించడం మంచిది కాదని అన్నారు. అధికారులు, మంత్రులు ప్రభుత్వ పథకాలను పేదలందరికీ అందించడంతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అనంతరం కార్యక్రమం ముగింపు సమయంలో ప్రొటోకాల్ ఉల్లంఘనపై కలెక్టర్ కాంతిలాల్ దండేను నిలదీశారు. జన్మభూమి కార్యక్రమంలో అధికారులు ప్రొటోకాల్ పాటించకుండా స్థానిక ఎంపీటీసీ సభ్యులు, ప్రజా ప్రతినిధులను కనీసం సభా వేదికపై కూర్చోవడానికి కూడా అవకాశం కల్పించడం లేదని ఫిర్యాదు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘన జరుగకుండా అన్ని పార్టీల ప్రజా ప్రతినిధులను గౌరవించాలని ఆమె సూచించారు. అయితే కలెక్టర్ కాంతిలాల్ దండే మాత్రం ఇక నుంచి జరిగే సమావేశాల్లో తామంతా వెనుకకు వెళ్లి కూర్చుంటామని హేళనగా మాట్లాడటం వేదికపై వున్న ప్రజా ప్రతినిధులను ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో కలెక్టర్ తీరుపై వైఎస్సార్ సీపీ నాయకులతో పాటు అధికార పార్టీ నేతలు కూడా రుసరుసలాడారు. ఇదే సందర్భంగా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని నివశిస్తున్న పేదలకు వ్యక్తిగత మరుగుదొడ్లు మంజూరు చేయడం లేదని ఎంపీపీ రత్నకుమారి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ జానీమూన్, మండల ఉపాధ్యక్షులు మొసలి పకీరయ్య, ఎంపీటీసీలు చిలకలపూడి భాస్కర్, ఈదా ప్రతాపరెడ్డి, అప్పికట్ల శేషమ్మ, వైఎస్సార్ సీపీ నాయకులు పచ్చల శ్యామ్‌బాబు, దొంతా వెంకటరావు, గుర్రం అజయ్‌కుమార్, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. -
ముస్తాబవుతున్న మహిళా వర్సిటీ
రేపు స్నాతకోత్సవం జోరందుకున్న ఏర్పాట్లు యూనివర్సిటి క్యాంపస్ : దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత బుధవారం జరుగనున్న స్నాతకోత్సవానికి మహిళావర్సిటి సిద్ధం అవుతోంది. ప్రస్తుత వీసీ రత్నకుమారి పదవి చేపట్టాక జరుగుతున్న తొలి స్నాతకోత్సవం, నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్నది కావడంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఏర్పాట్లు సాగుతున్నాయి. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చివరిసారిగా 2010 సెప్టెంబర్17న స్నాతకోత్సవం నిర్వహించారు. తర్వాత యేడాదిపాటు రెగ్యులర్ వీసీని నియమించక పోవడం, రత్నకుమారిని వీసీగా నియమించినప్పటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాలు చోటు చేసుకోవడం వల్ల 15వ స్నాతకోత్సవానికి ముహూర్తం కుదరలేదు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు. స్నాతకోత్సవం కోసం మూడురోజులుగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. అందులో భాగంగా ఇందిరా ప్రియద ర్శిని ఆడిటోరియంకు రంగులు వేస్తున్నారు. వర్సిటీలోని రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు. లక్ష్మీకాంతంకు గౌరవ డాక్టరేట్ బుధవారం జరిగే స్నాతకోత్సవంలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం.లక్ష్మీకాంతంకు గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 1948 మందికి డిగ్రీలు ఇవ్వనున్నారు. గవర్నర్ నరసింహన్ హాజరై డిగ్రీలను ప్రదానం చేస్తారు. 14వ స్నాతకోత్సవంలో ముగ్గురికి గౌరవ డాక్టరేట్ల్ ఇవ్వగా ప్రస్తుతం ఒకరికి మాత్రమే ఇస్తున్నారు.