ముస్తాబవుతున్న మహిళా వర్సిటీ
- రేపు స్నాతకోత్సవం
- జోరందుకున్న ఏర్పాట్లు
యూనివర్సిటి క్యాంపస్ : దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత బుధవారం జరుగనున్న స్నాతకోత్సవానికి మహిళావర్సిటి సిద్ధం అవుతోంది. ప్రస్తుత వీసీ రత్నకుమారి పదవి చేపట్టాక జరుగుతున్న తొలి స్నాతకోత్సవం, నాలుగు సంవత్సరాల తర్వాత జరుగుతున్నది కావడంతో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంజనీరింగ్ విభాగం పర్యవేక్షణలో ఏర్పాట్లు సాగుతున్నాయి.
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో చివరిసారిగా 2010 సెప్టెంబర్17న స్నాతకోత్సవం నిర్వహించారు. తర్వాత యేడాదిపాటు రెగ్యులర్ వీసీని నియమించక పోవడం, రత్నకుమారిని వీసీగా నియమించినప్పటి నుంచి సమైక్యాంధ్ర ఉద్యమాలు చోటు చేసుకోవడం వల్ల 15వ స్నాతకోత్సవానికి ముహూర్తం కుదరలేదు. నాలుగేళ్ల తర్వాత ఎట్టకేలకు స్నాతకోత్సవం నిర్వహిస్తున్నారు. స్నాతకోత్సవం కోసం మూడురోజులుగా పనులు చురుగ్గా సాగుతున్నాయి. అందులో భాగంగా ఇందిరా ప్రియద ర్శిని ఆడిటోరియంకు రంగులు వేస్తున్నారు. వర్సిటీలోని రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారు.
లక్ష్మీకాంతంకు గౌరవ డాక్టరేట్
బుధవారం జరిగే స్నాతకోత్సవంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (హైదరాబాద్) డెరైక్టర్ ఎం.లక్ష్మీకాంతంకు గౌరవ డాక్టరేట్ ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా 1948 మందికి డిగ్రీలు ఇవ్వనున్నారు. గవర్నర్ నరసింహన్ హాజరై డిగ్రీలను ప్రదానం చేస్తారు. 14వ స్నాతకోత్సవంలో ముగ్గురికి గౌరవ డాక్టరేట్ల్ ఇవ్వగా ప్రస్తుతం ఒకరికి మాత్రమే ఇస్తున్నారు.