జీవితంలో ఎవరికీ తలవంచను : హరికృష్ణ
‘‘నా అరవై ఏళ్ల జీవితంలో ఎవరూ పొందలేని, అనుభవించలేని ఆనంద సమయాలు చూశా. మా నాన్న నందమూరి తారక రామారావుగారి దగ్గర 30 ఏళ్లు పనిచేశా. ఆయనతో నా అనుభవాలు హిమాలయ పర్వతాలను మించిపోయాయి. ఆయన మాకు వీరాభిమానులను ఇచ్చారు. అభిమానాన్ని ఎవరూ దొంగలించలేరు’’ అని నటులు హరికృష్ణ అన్నారు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై కల్యాణ్‌రామ్ హీరోగా నటించి, నిర్మించిన చిత్రం ‘ఇజం’. అదితీ ఆర్య హీరోయిన్. అనూప్ రూబెన్స్ స్వర పరచిన ఈ చిత్రం పాటల సీడీని హరికృష్ణ విడుదల చేసి చిన్న ఎన్టీఆర్‌కు ఇచ్చారు.
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ- ‘‘నేనెప్పుడూ మనసులో అనిపించినది బయటకు చెప్పేస్తా. దాచుకోలేను. ఎన్ని దెబ్బలు తగిలినా జీవితంలో ఎవరికీ తలవంచను.. వంచే ప్రశ్నే లేదు. తల వంచేవాడినైతే ఎన్టీఆర్ కడుపున పుట్టేవాణ్ణే కాదు. ఆయన మాకు జీవితం ఇచ్చింది తలవంచి బ్రతకమని కాదు. కృషి చెయ్. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. ఆ బాటలో నా బిడ్డలు వెళుతున్నందుకు సంతోషంగా ఉంది’’ అని చెప్పారు. ‘‘ ‘ఇజం’ టీజర్ హరికృష్ణగారికి నచ్చడంతో నాకు రెండు పావురాలు బహుమానంగా ఇచ్చారు.
ఈ చిత్రం కోసం మూడు నెలల్లో కల్యాణ్ రామ్ 13 కిలోలు బరువు తగ్గాడు. ఇందులో కోర్టు సీన్ హైలెట్’’ అని పూరి జగన్నాథ్ అన్నారు. కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ- ‘‘నేను ఇప్పటి వరకూ పనిచేసిన వాళ్లలో ‘ఇజం’ టీమ్ బెస్ట్. నా కెరీర్‌లో బెస్ట్ డెరైక్టర్ పూరీనే. ఆయన గురించి సినిమా విడుదల రోజు ఓ గంట మాట్లాడతా. మరోసారి ఇదే టీమ్‌తో పని చేయాలని ఉంది’’ అన్నారు. ‘‘ ‘టెంపర్’ టైమ్‌లో అన్నయ్యతో(కల్యాణ్ రామ్) ఓ చిత్రం చేయాలనుకుంటున్నట్లు పూరీ భయ్యా నాతో అన్నప్పుడు సంతోషపడ్డా.
వెంటనే ఫోన్ చేసి అన్నయ్యకు చెప్పా. ‘టెంపర్’ తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. అన్నయ్య నాకు ఫిలాసఫర్, గైడ్.. ఒక్కోసారి గర్ల్‌ఫ్రెండ్ కూడా. ‘ఇజం’ కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది’’ అని ఎన్టీఆర్ పేర్కొన్నారు. ఈ వేడుకలో అదితీ ఆర్య, అనూప్ రూబెన్స్, నందమూరి రామకృష్ణ, నిర్మాతలు బీవీఎస్‌ఎన్ ప్రసాద్, ‘దిల్’ రాజు, నటులు తనికెళ్ల భరణి, ప్రకాశ్‌రాజ్, అలీ, పాటల రచయిత భాస్కరభట్ల, కెమెరామేన్ ముఖేష్, ‘ఆదిత్య’ నిరంజన్, దర్శకుడు హేమంత్ మధుకర్ తదితరులు పాల్గొన్నారు.