త్వరలో నంది అవార్డుల పేరు మార్పు
రాష్ట్ర ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే 'నంది' పురస్కారాల పేరు మారనుంది. తెలంగాణ ప్రభుత్వం సరికొత్త పేరుతో సినీ అవార్డులను ప్రదానం చేయనుంది. త్వరలో నంది అవార్డుల పేరు మార్చనున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్ఫష్టం చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఏడాదే నంది అవార్డుల పేరు మారుస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఈ విషయమై రమణాచారి నేతృత్వంలో కమిటీ ఏర్పాటయ్యిందని, అవార్డుల పేరు మార్పుపై రమణాచారి కమిటీదే నిర్ణయమని అన్నారు.
తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు,ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 వ సంవత్సరంలో ప్రారంభమైంది. మొదట్లో బంగారు, రజత, కాంస్య నంది అనే 3 బహుమతులు, కథకు 2 బహుమతులు.. మొత్తము 5 పురస్కారాలు మాత్రమే ఉండేవి. చిత్ర నిర్మాణములో ఉన్న శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ప్రస్తుతం అన్ని విభాగాలకు నంది పురస్కారాలను అందజేస్తున్నారు. ఇక నుంచి ఈ నంది పురస్కారాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందించే అవార్డులుగా మాత్రమే కొనసాగుతాయి.