
నానికి షాక్ ఇచ్చిన అల్లు అర్జున్
వరుస సక్సెస్లతో సూపర్ ఫాంలో ఉన్న నాని హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా నిన్ను కోరి. శివ నిర్మాణ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న ఈ సినిమా సమ్మర్లోనే రిలీజ్ అవుతుందని భావించారు. అయితే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి కాకపోవటంతో పాటు భారీ చిత్రాలు వరుసగా రిలీజ్ అవుతుండటంతో నిన్నుకోరి రిలీజ్కు సరైన సమయం దొరకటం లేదు.
ముందుగా ఈ సినిమాను మే నెలలోనే రిలీజ్ చేయాలని భావించారు. అయితే అప్పటికి అన్ని కార్యక్రమాలు పూర్తి కావన్న ఆలోచనతో మహేష్ కాలీ చేసిన జూన్ 23న రిలీజ్ అంటూ ప్రకటించారు. కానీ కొద్ది గంటల్లోనే మరోసారి నాని సినిమా వాయిదా వేయక తప్పలేదు. అదే రోజు అల్లు అర్జున్ డీజే దువ్వాడ జగన్నాథమ్ రిలీజ్ అవుతున్నట్టుగా ప్రకటించటంతో నాని తన సినిమాను మరోసారి వాయిదా వేశాడు.
నాని సరసన నివేద థామస్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను మరో రెండు వారాలపాటు వాయిదా వేసి జూలై 7న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సరైనోడు సినిమాతో విలన్గా ఆకట్టుకున్న తమిళ నటుడు ఆది ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుండగా గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై డివివి దానయ్య నిర్మిస్తున్నాడు.