ఒకటి..రెండు..మూడు.. ఇప్పుదిదే టాలీవుడ్‌ ట్రెండ్‌! | Do You Know These Tollywood Star Heroes Movies Ready To Go For Part 3, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

ఒకటి..రెండు..మూడు.. ఇప్పుదిదే టాలీవుడ్‌ ట్రెండ్‌!

Published Sun, Sep 29 2024 11:11 AM | Last Updated on Sun, Sep 29 2024 12:31 PM

These Tollywood Star Heroes Movies Ready To Part 3

ఒకటో సారి... రెండో సారి... మూడోసారి... అంటూ వేలం పాట నిర్వహించడం చూస్తుంటాం. అయితే ఇప్పుడు చిత్ర పరిశ్రమలో ఒకటో భాగం.. రెండో భాగం... మూడో భాగం... ఇలా సీక్వెల్స్‌ ట్రెండ్‌ నడుస్తోంది. కొన్ని సినిమాలు మొదటి భాగం హిట్‌ అయితే రెండో భాగం తీస్తున్నారు. సెకండ్‌ పార్ట్‌ కూడా సూపర్‌ హిట్‌ అయ్యిందంటే మూడో భాగం రూపొందిస్తున్నారు. మరికొన్నేమో రెండో భాగం షూటింగ్‌ దశలో ఉండగానే ముందుంది మూడో భాగం అంటూ 
ప్రకటించేస్తున్నారు. మూడో భాగం సీక్వెల్స్‌ విశేషాల్లోకి వెళదాం...  

పుష్ప: ది రోర్‌ 
‘తగ్గేదే లే..’ అంటూ ‘పుష్ప: ది రైజ్‌’ చిత్రంలో హీరో అల్లు అర్జున్‌ చెప్పిన డైలాగ్‌ ప్రేక్షకుల మనసుల్లో నాటుకుపోయింది. తాము కూడా తగ్గేదే లే అంటూ ఆ సినిమాకి పాన్‌ ఇండియా హిట్‌ని అందించారు ఆడియన్స్‌. సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన చిత్రం ‘పుష్ప: ది రైజ్‌’. రష్మికా మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సునీల్, అనసూయ, ఫాహద్‌ ఫాజిల్‌ వంటివారు కీలక పాత్రలు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం 2021 డిసెంబరు 17న విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

 ‘పుష్ప: ది రైజ్‌’ సూపర్‌ హిట్‌ కావడంతో సేమ్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘పుష్ప: ది రూల్‌’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్టే సినిమాని పక్కాగా తీసుకురావాలని అల్లు అర్జున్, సుకుమార్‌ అండ్‌ టీమ్‌ కష్టపడుతున్నారు. లేటుగా వచ్చినా బ్లాక్‌బస్టర్‌ కొట్టాలనే ఆలోచనతో పని చేస్తోంది టీమ్‌. ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా డిసెంబరు 6న విడుదల కానుంది. 

అయితే ఈ సినిమాకి మూడో భాగం ఉంటుందని, ‘పుష్ప: ది రోర్‌’ అనే టైటిల్‌ని కూడా ఖరారు చేశారనే వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే... ఈ ఏడాది ఫిబ్రవరి 15 నుంచి ఫిబ్రవరి 25వరకు జర్మనీలో జరిగిన 74వ బెర్లిన్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో హీరో అల్లు అర్జున్‌ పాల్గొన్నారు. అక్కడ ‘పుష్ప: ది రైజ్‌’ని ప్రదర్శించారు.  అనంతరం అల్లు అర్జున్‌ మాట్లాడుతూ– ‘‘అన్నీ అనుకూలంగా ఉంటే ‘పుష్ప’ మూడో భాగం తీసే అవకాశాలున్నాయి. ఈ సినిమాను ఒక ఫ్రాంచైజీలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం’’ అన్నారు. ఇలా మూడో భాగంపై ఆయన ఓ స్పష్టత ఇచ్చారు. అయితే ‘పుష్ప 2: ది రూల్‌’ తర్వాత ఇటు అల్లు అర్జున్‌ అటు సుకుమార్‌ ఇతర ప్రాజెక్టులు చేశాక ‘పుష్ప’ మూడో భాగం చేస్తారని, ఇందుకు చాలా టైమ్‌ పట్టవచ్చని టాక్‌.  

 

ఆర్య 3 
అల్లు అర్జున్, సుకుమార్‌ల కాంబినేషన్‌లో వచ్చిన మొదటి చిత్రం ‘ఆర్య’ (2004) హిట్‌ అయింది. వారి కాంబినేషన్‌లో ఆ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ‘ఆర్య 2’ (2009) కూడా విజయం అందుకుంది. ఈ సినిమాకి మూడో భాగం కూడా రానుంది. ఓ సందర్భంలో సుకుమార్‌ మాట్లాడుతూ– ‘‘ఆర్య 3’ సినిమా ఉంటుంది... అయితే ఎప్పుడు సెట్స్‌కి వెళుతుందనేది చెప్పలేను’’ అని పేర్కొన్నారు.  



నాలుగింతల వినోదం 
వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ హీరోలుగా అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఎఫ్‌ 2– ఫన్‌ అండ్‌ ఫ్రస్టేషన్‌’. ఇందులో తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటించారు. ‘దిల్‌’ రాజు నిర్మించిన ఈ సినిమా 2019 జనవరి 12న విడుదలై, సూపర్‌ హిట్‌గా నిలిచింది. సేమ్‌ కాంబినేషన్‌లో ఈ మూవీకి సీక్వెల్‌గా రెండో భాగం ‘ఎఫ్‌ 3’ని తెరకెక్కించారు. 2022 మే 27న రిలీజైన ఈ సినిమా కూడా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తింది. ‘ఎఫ్‌–3’కి కొనసాగింపుగా ‘ఎఫ్‌– 4’ ఉంటుందని మేకర్స్‌ స్పష్టం చేశారు. 

ఈ నేపథ్యంలో ఈ మూవీ ఎప్పుడు పట్టాలెక్కుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. కాగా వెంకటేశ్‌ హీరోగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్‌’ రాజు నిర్మాతగా ఓ సినిమా ప్రకటన ‘వెంకీఅనిల్‌03’ (వర్కింగ్‌ టైటిల్‌) రావడంతో అందరూ ‘ఎఫ్‌–4’ అనుకున్నారు. అయితే ఇది ‘ఎఫ్‌–4’ కాదని చిత్రయూనిట్‌ స్పష్టత ఇచ్చింది. 

క్రైమ్‌ డ్రామాగా రూపొందుతోన్న ‘వెంకీఅనిల్‌03’ సినిమా 2025 సంక్రాంతికి విడుదల కానుంది. ఈ సినిమా తర్వాతే ‘ఎఫ్‌ 4’ సెట్స్‌కి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో వెంకటేశ్, వరుణ్‌ తేజ్‌ పాటు మరో అగ్ర హీరో కూడా నటిస్తారని ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ‘ఎఫ్‌–2’, ‘ఎఫ్‌–3’తో పోలిస్తే ‘ఎఫ్‌–4’ లో వినోదం నాలుగింతలు ఉంటుందని మేకర్స్‌ ప్రకటించారు.  



మూడో కేసు ఆరంభం  
‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’ (2020), ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’(2022) వంటి చిత్రాల తర్వాత ఆ ఫ్రాంచైజీలో రూపొందుతున్న మూడో చిత్రం ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’. ‘హిట్‌’ ఫ్రాంచైజీలో తొలి రెండు చిత్రాలకు దర్శకత్వం వహించిన శైలేష్‌ కొలను ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’ని కూడా తెరకెక్కిస్తున్నారు. అయితే ‘హిట్‌: ది ఫస్ట్‌ కేస్‌’లో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించగా, ‘హిట్‌: ది సెకండ్‌ కేస్‌’లో అడివి శేష్‌ కథానాయకుడిగా నటించారు. 

తొలి రెండు భాగాలను వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై నిర్మించిన హీరో నాని ‘హిట్‌: ది థర్డ్‌ కేస్‌’లో తానే లీడ్‌ రోల్‌లో నటిస్తున్నారు. యునానిమస్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్‌ పోస్టర్‌ సినిమా పతాకంపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఆఫీసర్‌ అర్జున్‌ సర్కార్‌గా కనిపించబోతున్నారు నాని. 2025 మే 1న ఈ  సినిమాని విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ‘హిట్‌’ ఫ్రాంచైజీలో మొత్తం 7 భాగాలు ఉంటాయని శైలేష్‌ కొలను స్పష్టం చేశారు.   

వేసవిలో భారతీయుడు  
కమల్‌హాసన్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఇండియన్‌ 3’ (‘భారతీయుడు). కమల్‌హాసన్, దర్శకుడు శంకర్‌ కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఈ మూవీకి సీక్వెల్‌గా వీరిద్దరి కాంబినేషన్‌లో తాజాగా వచ్చిన ‘భారతీయుడు 2’ సినిమా జూలై 12న విడుదలైంది. అయితే తొలి భాగం అందుకున్న విజయాన్ని మలి భాగం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే రెండో భాగం సమయంలోనే ‘భారతీయుడు 3’ చిత్రీకరణ కూడా దాదాపు పూర్తి చేసిందట యూనిట్‌. 2025 వేసవిలో ఈ సినిమాని పాన్‌ ఇండియా రేంజ్‌లో రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.

కేజీఎఫ్‌  
యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’ (2018) సినిమా పాన్‌ ఇండియా హిట్‌ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ మూవీ చివర్లో రెండో భాగం ఉంటుందని ముందే ప్రక టించింది యూనిట్‌. యశ్‌– ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌లోనే వచ్చిన ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ 2022లో విడుదలై భారీ వసూళ్లు రాబట్టింది. అయితే ‘కేజీఎఫ్‌’ ఫ్రాంచైజీలో ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 3’ కూడా ఉంటుందని మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. ఈ మూవీ ప్రీ ్ర΄÷డక్షన్‌ పనుల్ని దాదాపు పూర్తి చేశారట ప్రశాంత్‌ నీల్‌. ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 1’, ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 2’ సినిమాలు బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో ‘కేజీఎఫ్‌: చాప్టర్‌ 3’ పై కర్నాటకలోనే కాదు... పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. 



అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ 
హీరో నిఖిల్‌ సిద్ధార్థ్, దర్శకుడు చందు మొండేటిలది సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌. వీరిద్దరి కలయికలో వచ్చిన తొలి చిత్రం ‘కార్తికేయ’ (2014) సూపర్‌ హిట్‌గా నిలవడంతో సెకండ్‌ పార్ట్‌ ‘కార్తికేయ 2’ సినిమాపై ఫుల్‌ క్రేజ్‌ నెలకొంది. 2022 ఆగస్టు 13న విడుదలైన ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో బ్లాక్‌ బస్టర్‌ అయింది. రూ. వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పాటు 70వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో ఉత్తమ తెలుగు చిత్రంగా నిలిచింది. ‘కార్తికేయ, కార్తికేయ 2’ సూపర్‌ హిట్స్‌ కావడంతో నిఖిల్, చందు కలయికలో రానున్న ‘కార్తికేయ 3’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 

‘కార్తికేయ 3’ ఉంటుందంటూ ఈ ఏడాది మార్చి 16న సోషల్‌ మీడియా వేదికగా స్పష్టత ఇచ్చారు నిఖిల్‌. ‘‘చందు మొండేటి అడ్వెంచరస్‌ థ్రిల్లర్‌ మూడవ ఫ్రాంచైజీ (‘కార్తికేయ 3’) సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌పై పని చేస్తున్నారు. స్పాన్, స్కేల్‌ పరంగా ‘కార్తికేయ 3’ చాలా పెద్దగా ఉండబోతోంది. డా. కార్తికేయ సరికొత్త సాహసం త్వరలోనే ప్రారంభం కానుంది’’ అంటూ మేకర్స్‌ ప్రకటించారు. కాగా ప్రస్తుతం నిఖిల్‌ హీరోగా ‘స్వయంభూ’ సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు నాగచైతన్య హీరోగా ‘తండేల్‌’ మూవీ తీస్తున్నారు చందు మొండేటి. అటు నిఖిల్‌ ‘స్వయంభూ’, ఇటు చందు ‘తండేల్‌’ పూర్తయ్యాక ‘కార్తికేయ 3’  రెగ్యులర్‌ షూటింగ్‌ పట్టాలెక్కే అవకాశం ఉంది.  '



నవ్వులు త్రిబుల్‌  
సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ‘డీజే టిల్లు’ (2022) సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విమల్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నేహా శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాకి సీక్వెల్‌గా వచ్చిన రెండో భాగం ‘టిల్లు స్క్వేర్‌’ ఈ ఏడాది మార్చి 29న రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 

మల్లిక్‌ రామ్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో అనుపమా పరమేశ్వరన్‌ హీరోయిన్‌. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ మూవీ దాదాపు రూ. 125 కోట్ల వసూళ్లు సాధించి సిద్ధు కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఈ రెండు చిత్రాలకు కొనసాగింపుగా ‘టిల్లు క్యూబ్‌’ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ మాట్లాడుతూ– ‘‘టిల్లు పాత్రపై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ‘టిల్లు క్యూబ్‌’లో టిల్లు పాత్రను సూపర్‌ హీరోగా చూపిద్దామనే ఆలోచనలో ఉన్నాం’’ అన్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డకి జోడీగా పూజా హెగ్డేను ఎంపిక చేసినట్లు ఫిల్మ్‌నగర్‌ టాక్‌. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.  


 
మత్తు కొనసాగుతుంది
శ్రీ సింహా కోడూరి, నరేశ్‌ అగస్త్య, సత్య లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘మత్తు వదలరా’. రితేష్‌ రానా దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2019లో విడుదలై, హిట్‌గా నిలిచింది. దాదాపు ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్‌గా రూపొందిన చిత్రం ‘మత్తు వదలరా 2’. శ్రీ సింహా కోడూరి, ఫరియా అబ్దుల్లా, సత్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి కూడా రితేష్‌ రానా దర్శకత్వం వహించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సమర్పణలో క్లాప్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచింది. మొదటి, ద్వితీయ భాగాలు ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తాయి. ‘మత్తు వదలరా’ ఫ్రాంచైజీలో ‘మత్తు వదలరా 3’ సినిమా కూడా ఉంటుందని ప్రకటించారు మేకర్స్‌. అటు ఇంటర్వ్యూలో, ఇటు సక్సెస్‌ మీట్‌లో పాల్గొన్న డైరెక్టర్‌ రితేష్‌ రానా ‘మత్తు వదలరా 3’ ఉంటుందని స్పష్టత ఇచ్చారు. 



పొలిమేరలో ట్విస్టులు
‘సత్యం’ రాజేష్‌ కీలక పాత్రలో నటించిన ‘పొలిమేర’ (2021), ‘మా ఊరి పొలిమేర 2’ (2023) సినిమాలు హిట్‌గా నిలవడంతో ‘పొలిమేర 3’కి శ్రీకారం చుట్టారు మేకర్స్‌. ‘సత్యం’ రాజేష్, బాలాదిత్య, కామాక్షీ భాస్కర్ల, గెటప్‌ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, ‘చిత్రం’ శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘పొలిమేర 3’. మొదటి రెండు భాగాలకి దర్శకత్వం వహించిన అనిల్‌ విశ్వనాథ్‌ మూడో భాగాన్ని కూడా తెరకెక్కిస్తున్నారు. 

వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై నిర్మాత భోగేంద్ర గుప్తాతో కలిసి వంశీ నందిపాటి ఈ మూవీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో చేతబడితో పాటు ప్రస్తుతం సమాజంలోని ఓ బర్నింగ్‌ ఇష్యూని టచ్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. క్రేజీ థ్రిల్లర్‌గా రూపొందిన తొలి రెండు భాగాలతో పోలిస్తే ‘పొలిమేర 3’లో ప్రేక్షకుల ఊహకందని ట్విస్టులు ఉంటాయని ‘సత్యం’ రాజేష్‌ తెలిపారు. 
– డేరంగుల జగన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement