ఒకే నెలలో మూడు సినిమాలు!!
గడిచిన సంవత్సరంలో హీరో నాని నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. చిట్టచివరిసారిగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన 'ఈగ' మాత్రమే విడుదలైంది. అది బ్రహ్మాండమైన బ్లాక్బస్టర్గా నిలిచింది. సాధారణంగా రాజమౌళి సినిమాలో చేసిన హీరోలకు తర్వాత వచ్చే సినిమాలు అంతగా అచ్చిరావన్న సెంటిమెంటు ఒకటుంది. నానికైతే అసలు ఆ తర్వాత ఏడాది మొత్తం ఒక్క సినిమా కూడా రాలేదు. ఆ లోటు తీర్చడానికా అన్నట్లు ఫిబ్రవరి నెలలో ఒకేసారి ఈ యువహీరో నటించిన మూడు సినిమాలు విడుదలై ఒకదాంతో ఒకటి పోటీ పడనున్నాయి. పైసా, జెండాపై కపిరాజు, ఆహా కళ్యాణం.. ఈ మూడు సినిమాల్లోనూ నానీయే హీరో. ఈ మూడూ కూడా ఫిబ్రవరిలోనే విడుదల అవుతుండటం విశేషం.
వీటిలో కళాత్మక దర్శకుడు కృష్ణవంశీ డైరెక్షన్లో వస్తున్న పైసా ఫిబ్రవరి 7న విడుదలవుతోంది. వాస్తవానికి ఇది గత సంవత్సరం చివర్లోనే విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాలతో ఆలస్యం అయ్యింది. దాని కారణాలేంటో చర్చించదలుచుకోలేదు గానీ.. ఫిబ్రవరి 7న తమ సినిమా విడుదల అవుతోందని కృష్ణవంశీ చెప్పారు. ఇక సముద్రకన్ని దర్శకత్వం వహించిన జెండాపై కపిరాజు ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 14న విడుదల అవుతోంది. వేలంటైన్స్డే బహుమతిగా తమ సినిమాను అందిసు్తన్నట్లు నిర్మాత రాజా పార్థసారథి తెలిపారు. ఇక హిందీలో సూపర్ హిట్గా నిలిచిన బ్యాండ్ బాజా బారాత్ సినిమాను 'ఆహా కళ్యాణం' పేరుతో రీమేక్ చేశారు. దీన్ని కూడా ఫిబ్రవరి 7నే విడుదల చేయాల్సి ఉన్నా.. ఇప్పుడు మాత్రం 21వ తేదీకి వాయిదా వేశారు. దీంతో వరుసపెట్టి మూడు శుక్రవారాల్లో నాని సినిమాలు మూడు విడుదలవుతున్నాయన్న మాట.