
నివిన్‌బాలీతో నయన్ రొమాన్స్
తమిళసినిమా: అగ్రనాయకి నయనతార మాలీవుడ్ యువ నటుడు నివిన్ బాలీతో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతున్నారన్నది తాజా సమాచారం. నటి నయనతార తన బాణీ మార్చుకున్నారా లేక అవకాశాలే అలా వస్తున్నాయా అన్నది పక్కన పెడితే ఈ బ్యూటీ కోలీవుడ్‌లో ఇప్పుడు యువ కుర్ర హీరోలతోనే జతకడుతున్నారు. అగ్ర హీరోలతో ఒక్క చిత్రం కూడా లేదన్నది నిజం.
ఆ మధ్య విజయ్‌సేతుపతికి జంటగా నటించిన నానుం రౌడీదాన్ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఆ తరువాత ఆరితో నటించిన మాయ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా శివకార్తికేయన్‌కు జంటగా వేలైక్కారన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇక నటుడు అధర్వ హీరోగా నటిస్తున్న ఇమైకా నోడిగళ్ చిత్రంలో ప్రధాన పాత్రలోనూ, అరం అనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రంలోనూ నటిస్తున్నారు. తాజాగా మలయాళ యువ నటుడు నివిన్ బాలీతో రొమాన్స్‌కు సిద్ధం అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల సమాచారం. మలయాళంలో పలు చిత్రాల్లో సహ నటుడిగా నటించి పలు ఆవార్డులను గెలుచుకున్న దయాన్ శ్రీనివాసన్ అక్కడ ప్రముఖ దర్శకుడు కూడా.
ఆయన దర్శకత్వం వహించనున్న తాజాగా చిత్రంలో నివిన్ బాలీ హీరోగా నటించనున్నారు.ఆయనకు జంటగా నయనతారను నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సినీ వర్గాల సమాచారం. నయనతార కూడా ఈ చిత్రంలో నటించడానికి సంసిద్ధత వ్యక్తం చేశారని, ఒప్పంద పత్రాలపై సంతకం చేయడమే తరువాయి అని తెలిసింది. కాగా నివిన్ బాలి తమిళ ప్రేక్షకులకు సుపరిచితమే ప్రస్తుతం ఆయన నటిస్తున్న తమిళ చిత్రం రుషీ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధం అవుతోంది. దీంతో నివిన్‌బాలి,నయనతార కలిసి నటించే చిత్రాన్ని తమిళంలోనూ ఏకకాలంలో నిర్మించాలన్న ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.