కొత్త సినిమాలు గురూ!
భయ మయూరి
ఇప్పటివరకూ అగ్ర హీరోలతో ఆడిపాడి త న అందచందాలతో అభిమానులను అలరించిన నయనతార తొలిసారిగా తన రూట్ మార్చి నటించిన హారర్ చిత్రం ఇది. ఇందులో ఆమె ద్విపాత్రాభినయం చేయడం మరో ప్రత్యేకత. అశ్విన్ శరవణన్ అనే నూతన దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను పూర్తి స్థాయిలో భయపెట్టిందా? అసలు మాయ ఎవరు? మయూరి ఎవరు? తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ: మాయ (నయనతార), అర్జున్ (ఆరి) ఇద్దరికీ సినిమాలంటే ప్యాషన్. మాయ అప్పటికే జూనియర్ ఆర్టిస్ట్‌గా కొన్ని సినిమాల్లో యాక్ట్ చేస్తుంటుంది. అర్జున్‌కి దర్శకుడు కావాలని కోరిక. సినిమాల పట్ల ఉన్న ఈ కామన్ ఇంట్రెస్ట్ ఇద్దర్నీ దగ్గర చేస్తుంది. ప్రేమలో పడి, పెళ్లి చేసుకుంటారు. కాపురం హాయిగా సాగుతుంది. మాయ ప్రెగ్నెంట్ అవుతుంది. అయితే, ఇక్కడే చిన్న ట్విస్ట్. మాయను కొన్ని సినిమాల్లో లీడ్ రోల్స్ చేయించి, డబ్బులు సంపాదించాలనే ఆశతో ఉన్న అర్జున్‌కు ఇది రుచించదు. అబార్షన్ చేయించుకోమని ఆమెను ఒత్తిడి చేస్తాడు. ఈ విషయంపై ఇద్దరూ గొడవపడి విడిపో తారు. అలా ఓ ఆసరా కోల్పోయి, డబ్బుల్లేక నానా అవస్థలు పడుతుంది మాయ. ఇంతలో ఆమె స్నేహితురాలు స్వాతి ‘చీకటి’ అనే సినిమా తీస్తుంది.
ఈ సినిమాని ఒంటరిగా చూసి భయపడని వారికి 5 లక్షల రూపాయలు బహుమతి అని ప్రకటిస్తారు ఆ చిత్ర నిర్మాతలు. మాయ ఆ సినిమా చూడటానికి సిద్ధపడుతుంది. ఈ సినిమాలోనే మాయ తన జీవితానికి సంబంధించిన కొన్ని నిజాలు తెలుసుకుంటుంది. అ నిజాలేంటో తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. కేవలం 35 రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. సత్యం సూర్యన్ కెమెరా పనితనం ఈ సినిమాకు ప్లస్. ఈ సినిమాలో ఎక్కువ భాగం నెట్ మోడ్‌లో సాగుతుంది. ఓ చోట కలర్... మరో చోట బ్లాక్ అండ్ వైట్ వేరియేషన్స్‌తో ఈ సినిమాకు కొత్త అందం తీసుకొచ్చారు.. ఈ మధ్య వచ్చిన హారర్ సినిమాల తరహాలో కామెడీని ఎక్కడా చొప్పించకుండా మొత్తం హారర్ కంటెంట్ మీదే దర్శకుడు దృష్టిపెట్టాడు. కథలో ఎన్ని లోటుపాట్లున్నా దర్శకుడు అశ్విన్ భయపెట్టడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు.