టైటిల్ : పెద్దన్న
నటీనటులు : రజనీకాంత్, నయనతార, కీర్తి సురేశ్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, మీనా, ఖుష్బు తదితరులు
నిర్మాణ సంస్థ: సన్ పిక్చర్స్
దర్శకత్వం : శివ
సంగీతం : డి. ఇమాన్
సినిమాటోగ్రఫీ : వెట్రీ
విడుదల తేది : నవంబర్ 4,2021
సూపర్‌స్టార్ రజనీకాంత్ తనదైన స్టైల్లో బాక్సాఫీస్ వద్ద దీపావళి సంబరాలను ప్రారంభించాడు. ‘అన్నాత్తే’ సినిమాతో బాక్సాఫీస్ బరిలోకి దిగాడు. ఈ సినిమాను తెలుగులో ‘పెద్దన్న’ పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో రజనీకాంత్‌కు ఉన్నఛరిష్మా, స్టామినాను చూసుకుంటే ‘పెద్దన్న’ పెద్ద సినిమాగానే పరిగణించాలి. గతంలో దర్బార్, కబాలి, కాలా, 2.0, పెట్టా వంటి సినిమాలతో తెలుగువారిని పలుకరించిన ఈ సూపర్‌స్టార్ తన స్టామినాకు తగ్గ హిట్‌ను అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ దర్శకత్వంలో తొలిసారి రజనీకాంత్ నటిస్తున్న సినిమా కావడం.. ఈ సినిమాలో కీర్తి సురేశ్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తుండటంతో ‘పెద్దన్న’హైప్ క్రియేట్ అయింది. ఎన్నో అంచనాల మధ్య గురువారం(నవంబర్ 4)న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘పెద్దన్న’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారో రివ్యూలో చూద్దాం.
‘పెద్దన్న’కథేంటంటే?
తూర్పు గోదావరి జిల్లా రాజోలుకు చెందిన వీరన్న(రజనీకాంత్)కు చెల్లి కనకమహాలక్ష్మీ అలియాస్ కనకమ్(కీర్తి సురేశ్) అంటే అమితమైన ప్రేమ. చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో చెల్లిని గారాబంగా పెంచాడు. చెల్లి సంతోషం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా, తీయడానికైనా వెనకాడడు. అంత ప్రేమగా చూసుకునే అన్నయ్య చూసిన పెళ్లి సంబంధం కాదని.. కనకమహాలక్ష్మీ కలకత్తాకు పారిపోతుంది. అసలు కనకమహాలక్ష్మీ అన్న నిర్ణయాన్ని వ్యతిరేకించి ఎందుకు పారిపోయింది? కలకత్తాలో ఆమెకు ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? మరికొద్ది గంటల్లో పెళ్లి ఉండగా పారిపోయిన చెల్లి విషయంలో వీరన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? చెల్లికి వచ్చిన సమస్యలను ఎలా తీర్చాడు? చివరకు ఈ అన్నా చెల్లెళ్లు ఎలా కలిశారు అనేదే ‘పెద్దన్న’కథ.
ఎవరెలా చేశారు?
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వయసు పెరుగుతున్నా.. స్టామినా మాత్రం తగ్గడంలేదు. తనదైన స్టైల్, యాక్టింగ్‌తో ఇప్పటికీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూనే ఉన్నాడు. తాజా సినిమా ‘పెద్దన్న’కూడా పూర్తిగా రజనీకాంత్ జనీ స్టైల్, మ్యానరిజమ్స్, పంచ్ డైలాగుల మీద ఆధారపడింది. గ్రామపెద్ద వీరన్న పాత్రలో ఆయన అద్భుతంగా నటించాడు. తనదైన పంచ్ డైలాగ్స్, యాక్టింగ్‌తో సినిమా భారాన్ని మొత్తం తనపై వేసుకొని నడిపించాడు. తనదైన కామెడీతో నవ్వించే ప్రయత్నం కూడా చేశాడు. ఇక వీరన్న చెల్లెలు కనకమహాలక్ష్మీ పాత్రలో కీర్తి సురేశ్ అద్భుతంగా నటించింది. ఈ సినిమాలో ఆమె పాత్రే కీలకం. కథను మలుపుతిప్పే కనకమ్ పాత్రలో కీర్తి పరకాయప్రవేశం చేసింది. ఎమోషనల్ సీన్స్‌లో అద్భుత నటనను కనబర్చింది. ఇక లాయర్ పార్వతిగా నయనతార తన పాత్రకు న్యాయం చేసింది. విలన్స్‌గా జగపతిబాబు, అభిమన్యు సింగ్ ఆకట్టుకున్నారు. మీనా, ఖుష్బూలతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.
ఎలా ఉందంటే..
‘పెద్దన్న’కథను పక్కా రజనీకాంత్ ఇమేజ్‌కి సరితూగే విధంగా రాసుకున్నాడు దర్శకుడు శివ. రొటీన్ కథనే కాస్త విభిన్నంగా తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. ఫస్టాఫ్ అంతా రజనీ అభిమానులు అశించే డైలాగ్స్, ఫైట్స్, స్టైల్‌తో ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో కూడా కథలో ఎలాంటి ట్విస్ట్‌లు లేకుండా సింపుల్‌గా సాగుతుంది. ఎన్నో సినిమాల్లో చూసిన చెల్లెలు సెంటిమెంట్ సీన్స్‌తో సెకండాఫ్‌ని నెట్టుకొచ్చాడు. కథలో ఎమోషనల్ సీన్స్ పండించడానికి స్కోప్ ఉన్నా.. దర్శకుడు ఆ దిశగా కసరత్తు చేయలేదనే అభిప్రాయం కలుగుతుంది. అలాగే మీనా, ఖుష్బుల పాత్రలు కూడా పేలవంగా అనిపిస్తాయి.రజనీకాంత్ సినిమా కాబట్టే వాళ్లు ఆ పాత్రలు చేయడానికి ముందుకొచ్చారేమోనని అనిపిస్తుంది.
సినిమా ముగుస్తుందనే సమయంలో విలన్స్‌గా జగపతిబాబు, అభిమన్యు సింగ్ పాత్రలను పరిచయం చేసి కథను సాగదీశాడనే అభిప్రాయం కలుగుతుంది. ఇక క్లైమాక్స్ ఫైట్ సీన్స్‌లో కీర్తిసురేశ్ తనను కాపాడుతున్న దెవరో తెలియక అయోమయంగా ముఖం పెట్టడం.. చెల్లికి కనిపించకుండా విలన్స్‌ని అన్న కొట్టడం... ఇవన్నీ రొటీన్ సీన్స్‌లాగానే అనిపిస్తాయి. ఇక కమర్షియల్ సినిమా ఎండింగ్ స్టైల్లోనే ఈ సినిమా కూడా ముగించాడు దర్శకుడు. స్క్రీన్‌ప్లే కూడా రొటీన్‌గా ఉంటుంది. ఇక టెక్నికల్ విషయాలకొస్తే.. ఇమాన్ సంగీతం పర్వాలేదనిపిస్తుంది. హాలీ హాలీ.. సాంగ్ మినహా మిగతా పాటలేవి ఆకట్టుకోలేకపోయినా.. నేపథ్య సంగీతం మాత్రం అదిరిపోయింది. తనదైన బీజీఎంతో కొన్ని సన్నీవేశాలకు ప్రాణం పోశాడు. వెట్రీ సినిమాటోగ్రఫి బాగుంది. యాక్షన్ సన్నివేశాలను తెరపై చాలా బాగా చూపించాడు. ఎడిటర్ రెబెన్ తన కత్తెరకు చాలా పని చెప్పాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment