
నీనా గుప్తా
హాలీవుడ్‌లో హీరోయిన్ పాత్రలు చేయాలంటే వయసుతో సంబంధం లేదు. యాభై, అరవై ఏళ్లు దాటినవాళ్లు కూడా అక్కడ హీరోయిన్లుగా చేస్తుంటారు. కానీ భారతీయ సినిమా సీన్ వేరు. ఒకప్పుడు 30 ఏళ్లు దాటితే కెరీర్ ముగిసినట్లే. ఇప్పుడు ఒక 35–40 వరకూ ఓకే అనే పరిస్థితి. ఆ తర్వాత మాత్రం నో చాన్స్. ఇండస్ట్రీలో కొనసాగాలంటే అక్క, వదిన పాత్రలకు మారక తప్పదు. ఇదే విషయం గురించి బాలీవుడ్ నటి నీనా గుప్తా మాట్లాడుతూ –‘‘దాదాపు 30 ఏళ్లు నేను సినిమాలు చేశాను. కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన ‘బదాయి హో’ (2018) తెచ్చిపెట్టినంత పాపులార్టీ నాకు అంతకు ముందు రాలేదు.
నేను అమితాబ్ బచ్చన్‌ని కాదని నాకు తెలుసు. మహిళలకు చాలా అరుదుగా పవర్‌ఫుల్ పాత్రలు రాస్తారు. నా వయసున్న (నీనా వయసు 61) మగవాళ్లు హీరోలుగా చేస్తున్నారు. కానీ స్త్రీలు చేయకూడదు. నా వయసువారి కోసం పాత్రలు రాయడం అనేది చాలా చాలా అరుదుగా జరుగుతుంది’’ అన్నారు. అలాగే మహిళలకు ఓ సలహా ఇచ్చారు నీనా. ‘‘మహిళలకు ప్లాన్ బి ఉండాలి. ప్రతి స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. ఆ విషయంలో ఎవరి మీదా ఆధారపడకూడదు. మన దగ్గర డబ్బుంటే ఎలాంటి సమస్యని అయినా పరిష్కరించుకోవచ్చు. అందుకే ప్రతి మహిళకు సొంత డబ్బు ఉండాలి. అదే ప్లాన్ బి’’ అన్నారు నీనా గుప్తా.
Comments
Please login to add a commentAdd a comment