టైటిల్: లస్ట్ స్టోరీస్ 2
నటీనటులు: తమన్నా, విజయ్ వర్మ, మృణాల్ ఠాకుర్, కాజోల్ తదితరులు
నిర్మాణ సంస్థ: RSVP & ఫ్లయింగ్ యూనికార్న్ ఎంటర్ టైన్‌మెంట్
నిర్మాత: ఆషీ దువా, రోనీ స్క్రూవాలా
దర్శకత్వం: ఆర్. బాల్కీ, సుజోయ్ ఘోష్, అమిత్ రవీంద్రనాథ్, కొంకణ్ సేన్ శర్మ
సినిమాటోగ్రఫీ: ఆనంద్ బన్సాల్
ఎడిటర్: సన్యుక్త కజా
ఓటీటీ: నెట్‌ఫ్లిక్స్
విడుదల తేదీ: 29 జూన్ 2023
ఓటీటీలు వచ్చిన కొత్తలో 'లస్ట్ స్టోరీస్' ఓ సెన్సేషన్. ఎంతలా అంటే ఈ ఆంథాలజీ దెబ్బకు కియారా అడ్వాణీ తెగ ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా 'లస్ట్ స్టోరీస్ 2' తీసుకొచ్చారు. గత కొన్నిరోజుల నుంచి ప‍్రమోషన్స్ లో తమన్నా చేస్తున్న హడావుడి, ట్రైలర్‌లో ఆమె సీన్స్ వల్ల.. ఈ మూవీపై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ చిత్రం... అంచనాల్ని అందుకుందా? ఫస్ట్ పార్ట్ కంటే మెప్పించిందా? లేదా అనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం.
(ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ)
కథేంటి?
ఇందులో నాలుగు కథలుంటాయి. మొదట దానిలో వేద(మృణాల్ ఠాకుర్), అర్జున్ (అంగద్ బేడీ) పెళ్లి చేసుకోవాలనుకుంటారు. పెళ్లి పనుల్లో పెద్దలు బిజీగా ఉంటారు. వేద బామ్మ (నీనా గుప్తా) మాత్రం.. జీవితాంతం సుఖంగా ఉండాలంటే పెళ్లికి ముందు శృంగారంలో పాల్గొనాలని వేద, అర్జున్ కి సలహా ఇస్తుంది. రెండో దానిలో ఇషిత (తిలోత‍్తమ షోమీ) ముంబయిలో జాబ్ చేస్తూ ఫ్లాట్ లో ఒంటరిగా ఉంటుంది. ఓ రోజు కాస్త త్వరగా ఇంటికొచ్చేసరికి.. తన బెడ్ పై పనిమనిషి సీమ(అమృత సుభాష్) తన భర్తతో కలిసి బెడ్ పై శృంగారంలో బిజీగా ఉంటుంది.
మూడో దానిలో విజయ్ చౌహాన్ (విజయ్ వర్మ)కు మహిళలంటే తెగ మోజు. ఓ రోజు లవర్ తో వీడియో కాల్ మాట‍్లాడుతూ కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అవుతుంది. దగ్గరలోని ఓ ఊరికి వెళ‍్తే అక్కడ తన మాజీ ప్రేయసి శాంతి (తమన్నా) కనిపిస్తుంది. నాలుగో దానిలో బిజోక్‌పుర్ అనే ఊరిలో రాజకుటుంబీకుడు (కుముద్ మిశ్రా).. భార్య దేవయాని(కాజోల్), కొడుకు అంకుర్ (జీషాన్ నదఫ్)తో కలిసి జీవిస్తుంటాడు. ఈయన కూడా ఆడవాళ్లని చూస్తే అస్సలు కంట్రోల్ చేసుకోలేడు. ఈ నాలుగు స్టోరీల్లోనూ చివరకు ఏమైందనేదే మెయిన్ స్టోరీ.
ఎలా ఉందంటే?
బామ్మ.. పెళ్లీడుకు వచ్చిన తన మనవరాలిని దగ్గర కూర్చోబెట్టుకుని, శృంగారం గురించి చాలా ఓపెన్ గా చెబుతుంటుంది. 'మీ తాతగారిని దేవుడు తీసుకెళ్లిపోయాడు. లేకపోయింటే ఈ గది తలుపులకు ఈ పాటికే గొళ్లెం పెట్టి ఉండేవి' అని అంటుంది. ఈ సీన్ లో ఆ మనవరాలు నవ్వుతూ ఉంటుంది గానీ చూస్తున్న ప్రేక్షకులకు మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఎందుకంటే నిజ జీవితంలో ఇలా జరుగుతుందా లేదా అనేది పక్కనబెడితే.. బోల్డ్‌నెస్ లో మరీ హద్దులు దాటేశారు బాబోయ్ అనిపిస్తుంది. ఇదే కాదు 'లస్ట్ స్టోరీస్ 2'లో ఇలాంటి సన్నివేశాలు చాలా ఉన్నాయి.
'మేడ్ ఫర్ ఈచ్ అదర్' టైటిల్ తో తీసిన తొలి స్టోరీలో 'సీతారామం' ఫేమ్ మృణాల్ ఠాకుర్ నటించింది. పెళ్లికి ముందు శృంగారం అనే షాకింగ్ కాన్సెప్ట్ తో దీన్ని తెరకెక్కించారు. ఇది నిజంగా భారతీయ సంస్కృతిలో వర్కౌట్ కాదు. ఈ ఎపిసోడ్ అంతా బామ్మ పాత్ర చుట్టూనే ఉంటుంది. ఆమె మాటలు విన్న అర్జున్, వేద ఏం చేశారనేది స్టోరీ. చాలా సింపుల్, ఫ్లాట్ గా దీన్ని తీశారు. యూత్ ని ఆకట్టుకోవడం తప్పితే పెద్దగా ఏం లేదు.
'ద మిర్రర్' పేరుతో తీసిన రెండో స్టోరీ ఓ శృంగార నవల చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో చూపించిన పాయింట్.. ప్రస్తుతం సమాజంలో ఒంటరి మహిళలు లేదా అమ్మాయిల జీవితాలని ప్రతిబింబించేలా అనిపిస్తుంది! ఇందులో పదేపదే 'ఆ' సీన్సే చూపిస్తుంటారు. దీని వల్ల కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. నిడివి కూడా కాస్త ఎక్కువే. అసలు విషయం బయటపడిన తర్వాత మనుషుల మనస‍్తత‍్వాలు ఎలా మారిపోతాయి అనే పాయింట్ కూడా ఇందులో చూపించారు.
(ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ)
'సె*క్స్ విత్ ఎక్స్' పేరుతో తీసిన మూడో స్టోరీలో రియల్ లైఫ్ కపుల్ తమన్నా, విజయ్ వర్మ జంటగా కనిపించారు. ఈ ఎపిసోడ్ మొదటంతా రొమాంటిక్ వేలో వెళ్తుంది. చివరకొచ్చేసరికి మిస్టరీ తరహాలో మారిపోతుంది. తమన్నా అయితే రెచ్చిపోయి మరీ అలాంటి సీన్స్ చేసింది. యూత్ ని టార్గెట్ చేయడం కోసం ఈ ఎపిసోడ్ లో ముద్దు, శృంగారం సన్నివేశాల గాఢత పెంచిన ఫీలింగ్ కలుగుతుంది. చివరి సీన్ మాత్రం మనల్ని అవాక్కయ్యేలా చేస్తుంది.
'టిల్‌చట్టా(బొద్దింక)' పేరుతో నాలుగో ఎపిసోడ్.. పైవాటితో పోలిస్తే చాలా నిదానంగా సాగుతుంది. చివరి సీన్ కి వస్తే గానీ అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాదు. క్లైమాక్స్ పాయింట్ బాగున్నప్పటికీ.. దానికోసం ఎపిసోడ్ ని అరగంటపాటు సాగదీయడం బోర్ కొట‍్టిస్తుంది. ఇందులో కాజోల్ లాంటి స్టార్ యాక్టర్ ఉన్నప్పటికీ ఆమె పాత్రని సరిగా డిజైన్ చేయలేదు.
మొత్తంగా చూసుకుంటే 'లస్ట్ స్టోరీస్' చిత్రంలో విభిన్న వ‍్యక్తుల భావోద్వేగాలని చూపిస్తే... ఇప్పుడీ సీక్వెల్ లో శృంగారమే ప్రధానం అన్నట్లు తీశారు. కథ కన్నా 'కామం' అనే పాయింట్ నే హైలెట్ చేశారు. దీంతో ఇది సినిమాలా కాకుండా ఓటీటీ కోసం తీసిన సెమీ బూతు చిత్రంలా అనిపిస్తుంది. ఫ్యామిలీ ప్రేక్షకులు.. ఈ ఆంథాలజీ చిత్రాన్ని పొరపాటున కూడా ఓపెన్ చేయొద‍్దు.
ఎవరెలా చేశారు?
మృణాల్ ఠాకుర్.. డిఫరెంట్ గా కనిపించింది. తిలోత్తమ షోమీ కూడా ఉన్నంతలో పర్లేదు. తమన్నా, విజయ్ వర్మ అయితే రెచ్చిపోయి నటించారు. ముద్దు, శృంగారం సన్నివేశాల్లో హద్దులు దాటేశారు. కాజోల్ తనకిచ్చిన పాత్రకు న్యాయం చేసింది. సీనియర్ నటి నీనా గుప్తా అయితే ప్రతిఒక్కరినీ తన యాక్టింగ్, డైలాగ్స్ తో ఆశ్చర్యపరిచింది. చెప్పాలంటే ఈమె రోల్ అందరికీ పెద్ద షాక్. టెక్నికల్ గా నిర్మాణ విలువలు బాగున్నప్పటికీ.. స్టోరీ, మిగతా విషయాల్లో దర్శకనిర్మాతలు ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయారు.
-చందు, సాక్షి వెబ్ డెస్క్
(ఇదీ చదవండి: 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ)
Comments
Please login to add a commentAdd a comment