నో డూప్.. ఆల్ రియల్!
చారిత్రక అంశాలతో సినిమాల రూపకల్పన కత్తిమీద సామే. ప్రతి సన్నివేశం ఆ కాలాన్ని ప్రతిబింబించేలా ఉండాలి. అది మాత్రమే కాదు, నటీనటుల వేషధారణ కూడా అప్పటిలా ఉండాలి. చారిత్రాత్మక కథతో రూపొందుతున్న బాలకృష్ణ వందో చిత్రం ‘గౌతమిపుత్ర శాతక ర్ణి’ కోసం దర్శకుడు క్రిష్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ కాస్ట్యూమ్ డిజైనర్ నీతా లుల్లా పని చేస్తుంటడం విశేషం. కాస్ట్యూమ్స్ తయారీ కోసం శాతవాహనుల కాలం నాటి వే షధారణను నీతా లుల్లా అధ్యయనం చేశారు. అప్పటి సంస్కృతిని అనుసరిస్తూనే రాజసం ఉట్టిపడేలా దుస్తులను డిజైన్ చేస్తున్నారు. నీతా లుల్లా మాట్లాడుతూ - ‘‘చాలా పరిశోధన తర్వాత ప్రతి క్యారెక్టర్‌కు తగిన దుస్తులు సిద్ధం చేస్తున్నాం. రాజుల నుంచి యుద్ధ వీరుల వరకు అందరి దుస్తులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నా’’ అన్నారు.
‘దేవదాసు’, ‘జోథా అక్బర్’ వంటి హిందీ చిత్రాలతో పాటు తెలుగు చిత్రం ‘రుద్రమదేవి’కి నీతా లుల్లా అద్భుతమైన కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ షూటింగ్ జార్జియాలో జరుగుతోంది. క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణలో బాలకృష్ణ, కబీర్ బేడీ తదితరులు పాల్గొంటున్నారు. డూప్ లేకుండా బాలకృష్ణ క్లైమాక్స్ పోరాటాలు చేయడం యూనిట్‌కు ఉత్సాహాన్నిస్తోంది. ఈ నెల 20 వరకూ అక్కడ చిత్రీకరణ జరుగుతుంది.