
నెంజముందు నేర్మైయుండు ఓడు రాజా చిత్రాన్ని స్నేహితుల కోసమే నిర్మించినట్లు నటుడు శివకార్తికేయన్ పేర్కొన్నారు. హీరోగా బిజీగా ఉన్న ఈయన ఎస్‌కే.ప్రొడక్షన్స్ పేరుతో చిత్ర నిర్మాణం చేపట్టి తొలి ప్రయత్నంగా కనా చిత్రాన్ని నిర్మించి సక్సెస్ అయ్యారు. ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించిన నటి ఐశ్వర్యరాజేశ్ హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల నాయకి గా దూసుకుపోతున్నారు . ఆ చిత్రం ద్వారా తన చిరకాల మిత్రుడు అరుణ్‌రాజా కామరాజ్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు.
కాగా మలి ప్రయత్నంగా నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రాన్ని నిర్మించారు. ఇందులో తన స్నేహితులైన యూ ట్యూబ్ టీమ్‌ను వెండితెరకు పరిచయం చేశారు. బుల్లితెర నటుడు రియోను హీరోగా పరిచయం చేశారు. షిరిన్ కంచ్వాలా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఆర్‌జే.విఘ్నేశ్, రాధారవి, నాంజిల్ సంపత్ ప్రధాన పాత్రల్లో నటించారు. కార్తీక్ వేణుగోపాల్ దర్శకత్వం వహించాడు. షబ్బీర్ సంగీతం, యుకే.సెంథిల్‌కుమార్ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం జూన్ 14న విడుదలై మంచి ప్రేక్షకాదరణను పొందింది.
దీంతో చిత్ర యూనిట్ ఆదివారం సాయంత్రం చెన్నైలోని ఓ హోటల్‌లో సక్సెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత శివకార్తికేయన్ మాట్లాడుతూ.. నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రం విశేష ప్రేక్షకాదరణను పొందడం సంతోషాన్నిచ్చిందన్నారు. తన స్నేహితులను ప్రోత్సహించేందుకే ఈ చిత్రాన్ని నిర్మించినట్టు తెలిపారు. చిత్రం విడుదలైన తరువాత తామంతా థియేటర్లకు వెళ్లి అక్కడ ప్రేక్షకుల స్పందనను చూసి చాలా ఆనందించామన్నారు.
చిత్రం చూసిన నటుడు రియో తండ్రి బాగుందంటూ కొడుకుని కౌగిలించుకున్నప్పుడు ఆయన కంటి నుంచి ఆనంద భాష్పాలు కురిశాయన్నారు. అప్పుడు తనకు తన తండ్రి కళ్ల ముందు నిలిచారని శివకార్తికేయన్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం తన నిర్మాణంలో వాళ్ అనే చిత్రం రూపొందుతోందని వెల్లడించారు.
Sticky for cinema
Comments
Please login to add a commentAdd a comment