కొత్త దర్శకులతో సినిమాలు తీస్తా... పూరి జగన్నాథ్
శిష్యుడి కోసం... తను రాసుకున్న ‘రోమియో’ కథ ఇచ్చిన పూరి జగన్నాథ్, మరోవైపు వక్కంతం వంశీ కథతో ఎన్టీఆర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తన సోదరుడు సాయిరామ్‌శంకర్ హీరోగా రూపొందిన ‘రోమియో’ చిత్రం గురించి పూరి మీడియాతో ముచ్చటించారు.నాలుగేళ్ల క్రితమే: వెనీస్‌లో రోమియో, జూలియట్ నివసించిన ప్రాంతాన్ని చూసి ప్రేరణ పొంది నాలుగేళ్ల క్రితమే ఈ కథ రాశాను. నిజమైన ప్రేమకథకు ఉండాల్సిన లక్షణాలన్నీ ఉన్న కథ ఇది. ఎమోషన్స్‌తో పాటు వినోదం కూడా మెండుగా ఉంటుంది.
అన్నయ్యగా రవితేజ చేశాడు: సాయి కోసమే ఈ కథ రాశాను. సినిమా చేయడానికి నేనేమో బిజీ. అప్పుడే గోపీ దర్శకుడు కావాలని ప్రయత్నిస్తుండడంతో అతనికి ఈ కథ ఇచ్చాను. నా తొలి సినిమా కంటే.. వందరెట్లు గొప్పగా తీశాడు తను. ఇందులో కథకు కీలకమైన సాయి అన్నయ్య పాత్రను రవితేజ పోషించాడు. కాసేపే కనిపించినా కావల్సినంత వినోదాన్ని పంచాడు. ఆయన చెప్పింది అక్షర సత్యం: 16మంది టీమ్‌తో రోమ్, స్విట్జర్లాండ్, వైజాగ్‌ల్లో అనుకున్న టైమ్‌కి ఈ సినిమాను పూర్తి చేశారు. ఇలా తక్కువ టైమ్‌లో చిన్న సినిమాలు తీయడమంటే నాకిష్టం. మొదట్లో అలాగే తీసేవాణ్ణి. ఓ సారి దాసరిగారన్నారు.
‘ఎప్పుడూ పెద్ద సినిమాలే కాదు... చిన్న సినిమాలు కూడా తీయ్. పెద్ద హీరోలు నీకు అవకాశం ఇవ్వని సందర్భం ఏదో ఒకరోజు రావచ్చు. అప్పుడు చిన్న సినిమాలు నీకు కొత్త కాకూడదు. వంద చిన్న సినిమాల వల్ల పరిశ్రమ బాగుపడుతుంది కానీ... పది పెద్ద సినిమాల వల్ల కాదు’ అని. ఆయన చెప్పింది అక్షర సత్యం. అందుకే నేను తీయడంతో పాటు, కొత్త రచయితలను, దర్శకులను పరిచయం చేస్తూ ప్రొడక్షన్ మొదలుపెట్టబోతున్నాను. ముందు స్టోరీలైన్‌తో వస్తే దాన్ని బట్టి ఛాన్స్ ఇస్తాను. వచ్చే ఏడాది ఈ ప్రక్రియ మొదలౌతుంది. వక్కంతం వంశీ కథతో చేస్తోంది అందుకే: ఎన్టీఆర్ సినిమా విషయానికొస్తే.. ముందు ఎన్టీఆర్‌కు ఓ కథ చెప్పాను. ఎన్టీఆరేమో వక్కంతం వంశీ రాసిన పోలీస్ స్టోరీ లైన్ వినిపించాడు.
నా కథకంటే అదే బావుంది. డెవలప్ చేసి షూటింగ్ మొదలుపెట్టాం. రాత్రింబవళ్లూ షూటింగ్ చేస్తున్నాం. జనవరి 9న సినిమా విడుదల చేస్తాం. టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. మహేశ్‌కి ఓ కథ రెడీ చేశాను. రానాతో కూడా ఓ సినిమా ఉంటుంది.