తూచ్... నేనలా అనలేదు!
దీపికా పదుకొనె, ప్రియాంకా చోప్రా, దిశా పాట్నీ, అమైరా దస్తూర్... తాజాగా హ్యూమా ఖురేషి... ఈ మధ్య హాలీవుడ్ ఫ్లైట్ టికెట్ (సినిమా ఛాన్స్) తీసుకుంటున్న బాలీవుడ్ భామల జాబితా పెరుగుతూనే ఉంది. అదేంటి... హిందీ హీరోయిన్లే హాలీవుడ్ వెళ్తున్నారు. హీరోలెందుకు ఇంగ్లీష్ సినిమాల్లో నటించడం లేదనే సందేహం కొందరికి వచ్చింది! ప్రియాంకా చోప్రాని ఇదే విషయం అడగ్గా... ‘‘హాలీవుడ్‌లో అదృష్టం పరీక్షించుకోవాలంటే గట్స్ (దమ్ము) కావాలి’’ అని చెప్పినట్టు ముంబయ్ మీడియాలో కొందరు రాశారు. సదరు వార్తలు చదివిన ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు నేను ‘గట్స్’ అనే పదం వాడలేదని స్పష్టం చేశారు.
ఈ వివాదంపై ప్రియాంక మాట్లాడుతూ –‘‘హిందీ నటులు హాలీవుడ్‌లో ఎందుకు నటించడం లేదని అడిగితే – ‘బహుశా... వాళ్లు అక్కడ నటించాలని ప్రయత్నించడం లేదనుకుంట’ అని చెప్పా. ‘గట్స్’ అనే పదం ఎక్కణ్ణుంచి వచ్చిందో నాకు తెలీదు. ఎప్పటిలా నా మాటల్ని వక్రీకరించారు. అనిల్ కపూర్, ఇర్ఫాన్‌ఖాన్ హాలీవుడ్‌లో నటిస్తున్నారు. మిగతావాళ్లూ ట్రై చేస్తే విజయం సాధించే అవకాశాలున్నాయి’’ అన్నారు. ముంబయ్ మీడియా మాత్రం ప్రియాంక మాట మార్చిందని చెబుతోంది. ఆ సంగతలా ఉంచితే, ‘‘ప్రయత్నించు.. ప్రయత్నిస్తూనే ఉండు. ఏదో రోజు విజయం సాధిస్తావ్. ప్రయత్నమే చేయకుంటే విజయం అనేది ఉండదు – నా సిద్ధాంతం ఇదే’’ అని ప్రియాంక సెలవిచ్చారు.