ఆస్ట్రేలియాలో సముద్రపు దొంగగా మారిపోయారు ప్రియాంకా చోప్రా. న్యూజిల్యాండ్ యాక్టర్ కర్ల్ అర్బన్, ప్రియాంకా చోప్రా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న హాలీవుడ్ ఫిల్మ్ ‘ది బ్లఫ్’. ఫ్రాంక్ ఈ ఫ్లవర్స్–జో బల్లారిని ద్వయం దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు ఆరంభం అయ్యాయని తెలియజేస్తూ, తన ఇన్‌స్టా స్టేటస్‌లో ‘ఇట్ బిగిన్స్’ అంటూ ‘ది బ్లఫ్’ సినిమా స్క్రిప్ట్ చదువుతున్నట్లు ఓ పేజీని షేర్ చేశారు ప్రియాంకా చోప్రా. ఈ చిత్రంలో కానర్ అనే పాత్రలో కర్ల్, ఎర్సెల్ అనే పాత్రలో ప్రియాంకా చోప్రా నటిస్తున్నారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ సినిమా చిత్రీకరణలోనే ఉన్నారు ప్రియాంకా చోప్రా.
ఇక 19వ శతాబ్దంలో ఎర్సెల్ అనే ఓ సముద్రపు దొంగ జీవితం నేపథ్యంతో ‘ది బ్లఫ్’ సినిమా కథనం సాగుతుంది. కొన్ని కారణాల వల్ల ఎర్సెల్ అనే యువతి సముద్రపు దొంగతనాలు మానేసి, సాధారణ జీవితం గడుపుతుంటుంది. కానీ ఎర్సెల్ సముద్రపు దొంగగా ఉన్న సమయంలో చేసిన పనులు, ఆమె ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేశాయి? ఆ సమస్యల నుంచి ఎర్సెల్ ఎలా బయటపడింది? అనే అంశాల నేపథ్యంలో ‘ది బ్లఫ్’ కథనం సాగుతుందని హాలీవుడ్ టాక్. ఇక ప్రియాంకా చోప్రా ఓ లీడ్ రోల్‌లో నటించిన మరో హాలీవుడ్ ఫిల్మ్ ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’ రిలీజ్‌కు రెడీ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment