నివేదా థామస్
‘‘ఫలానా హీరోయిన్ కంటే బాగా చేశారు? అని బాగా నటించినప్పుడు ఇతర హీరోయిన్లతో పోలిక పెడుతుంటారు. మరి.. హీరోతో ఎందుకు పెట్టరు? ఎప్పుడూ హీరోయిన్లతోనే పోటీ పెడుతుంటారు. నేనెవర్నీ పోటీగా ఫీల్ అవ్వను. నాకు నేనే పోటీగా ఫీల్ అవుతాను. స్వీయ పరిశీలన చేసుకుంటాను. నాకు నేను సవాల్ విసురుకుంటా’’ అని నివేదా థామస్ అన్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.వి గుహన్ దర్శకునిగా పరిచయం అవుతున్న చిత్రం ‘118’. కల్యాణ్‌రామ్, నివేదా థామస్, షాలీని పాండే హీరోహీరోయన్లు మహేశ్ కోనేరు నిర్మించారు. శుక్రవారం చిత్రం రిలీజ్ కానున్న సందర్భంగా నివేదా చెప్పిన విశేషాలు.
► పదే పదే వచ్చే ఒక కలను ఫాలో అయ్యే ఓ హీరో కథే ఈ చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్. మిస్టరీ ఉంటుంది. హీరో ఆ కల గురించి లోతుగా అన్వేషణ చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అన్న అంశాల ఆధారంగా స్క్రీన్‌ప్లే ఉంటుంది. సినిమా నిడివి చాలా తక్కువ. చివరి 20 నిమిషాలు సినిమా హైలైట్‌గా ఉంటుంది. గుహన్‌గారి లైఫ్‌లోని కొన్ని ఇన్సిడెంట్స్ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. కొంచెం ఫిక్షన్ కూడా ఉంది. సినిమా కాబట్టి కొంచెం లిబర్టీ తీసుకునే వీలు ఉంటుంది.
► నాకు వచ్చిన కలే మళ్లీ మళ్లీ రాదు. ఏదైనా కొత్త ప్లేస్‌లోకి వచ్చినప్పుడు ఇంతకుముందు ఏమైనా వచ్చానా? అనే ఫీలింగ్ మాత్రం కలుగుతుంది అప్పుడప్పుడు. కానీ అది కొన్ని సెకన్లపాటే ఉంటుంది. ఒక అమ్మాయి ఓ సమస్యలో పడినప్పుడు ఏం చేస్తుందో ఈ సినిమాలో నా పాత్ర అదే చేస్తుంది. నా పాత్ర గురించి ఇప్పుడు పెద్దగా చెప్పను. ఎందుకంటే సినిమాలో కీలకమైన పార్ట్ అది. ఫస్ట్‌టైమ్ నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకున్న సినిమా ఇది.
► ఈ సినిమా ప్రీ–రిలీజ్ వేడుకలో తారక్ వంటి మంచి నటుడు నాకు అప్రిషియేషన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే నా పెర్ఫార్మెన్స్‌ను ఆడియన్స్ కూడా మెచ్చుకోవాలని కోరుకుంటున్నాను. ‘అన్వేషణ’ సినిమాను నేను చూడలేదు. ఆ సినిమాతో ఈ సినిమాను ఎందుకు పోల్చుతున్నారో నాకు అర్థం కావడం లేదు. అలాగే హాలీవుడ్ మూవీ ‘ఫైనల్ డెస్టినేషన్’ సిరీస్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా ఉంటుందా? అంటే.. అది ఆడియన్స్ వెండితెరపై చూడాలి.
► సినిమాలో నా స్క్రీన్ టైమ్ ఎక్కువగా ఉందా? లేక తక్కువగా ఉందా? అనే అంశాలను పెద్దగా పట్టించుకోను. నేను చేస్తున్న పాత్రకు ఎంత వరకు న్యాయం చేస్తున్నానన్నదే నాకు ముఖ్యం. ఈ సినిమాలో నా స్క్రీన్ టైమ్ దాదాపు 20 నిమిషాలే ఉంటుంది. ‘నిన్నుకోరి, జెంటిల్‌మన్’ చిత్రాల్లో ఎక్కువ ఉంటుంది. వెంట వెంటనే సినిమాలు చేయడం కన్నా మంచి సినిమాలు చేయాలనుకుంటాను. కొత్త విషయాలు నేర్చుకుంటూ యాక్టర్‌గా మెరుగవ్వాలని కోరుకుంటాను. అన్నిరకాల పాత్రలు చేయాలనుకుంటున్నాను. నేను చేసిన సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో థియేటర్లో చూస్తాను. అది కూడా నిలబడే చూస్తాను. నెర్వస్ వల్ల కాదు. అదో ఫీలింగ్.
► ‘బ్రోచేవారెవరురా’ అనే కామెడీ చిత్రం, ‘శ్వాస’ అనే ట్రావెల్ ఫిల్మ్ చేయబోతున్నాను. మరికొన్ని సినిమాలకు చర్చలు జరుగుతున్నాయి. ఈ ఏడాది తమిళ సినిమా కూడా చేస్తాను. మలయాళ సినిమాలు డిస్కషన్ స్టేజ్‌లో ఉన్నాయి. అన్నీ సవ్యంగా సాగితే ఈ ఏడాదిలో నావి ఐదు సినిమాలు ఉంటాయి. రిలీజ్‌ల పరంగా నా కెరీర్‌లో ఇదో బిగ్గెస్ట్ ఇయర్‌గా ఉండొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment