ఇక కమర్షియల్ చిత్రాలు చెయ్యను: అమలాపాల్
నటి అమలాపాల్ తన ప్రియుడు, దర్శకుడు విజయ్‌తో ఏడడుగులు నడవడానికి సిద్ధం అవడంతో ఆమె ఇకపై నటిస్తారా? లేదా? అన్న విషయంపై పరిశ్రమలో ఆసక్తి నెలకొంది. దీనిపై స్పష్టమయిన అభిప్రాయాన్ని సోమవారం చెన్నైలో వెల్లడించారు. విజయ్, అమలాపాల్‌ల వివాహం జూన్ 12న చెన్నై అడయార్‌లోని రామనాధర్ శెట్టియార్ హాల్‌లో జరగనుంది. విజయ్ మాట్లాడుతూ తమ ప్రేమ వ్యవహారం గురించి పలువురు పలు రకాలుగా ప్రచారం చేశారన్నారు. ఇకపై ఎలాంటి సమాచారం కావాలన్నా అమలాపాల్, తాను ఇద్దరం అందుబాటులో ఉంటామని చెప్పారు. ఈ పెళ్లి తమ జీవితంలో చాలా ముఖ్యమయిన ఘట్టం అన్నారు. అమలాపాల్ మాట్లాడుతూ విజయ్‌తో తన స్నేహాన్ని ప్రేమగా ప్రచారం చేసింది మీడియానేనన్నారు. దీంతో తమ మధ్య ప్రేమ బలపడిందన్నారు.
అదిప్పుడు పెళ్లికి దారి తీసిందని వెల్లడించారు. వివాహానంతరం నటిస్తారా? అన్న ప్రశ్నకు ఆమె బదులిస్తూ ఇకపై కమర్షియల్ చిత్రాల్లో నటించనని, నటనకు అవకాశం ఉన్న మంచి పాత్రలు లభిస్తే చేస్తానని చెప్పారు. ఇప్పుడు నటనకన్నా తమ సంసార జీవితం, తన భర్త ఆకాక్షంకు అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. తన భర్త విజయ్ వెనుక ఉంటూ ఆయనకు సహకరిస్తానన్నారు. విజయ్‌కి దర్శకత్వం శాఖలో సహకరిస్తారా? అన్న ప్రశ్నకు దర్శకుడిగా విజయ్ ప్రతిభ ఏమిటో అందరికీ తెలిసిందే, అందులో తన సహకారం అవసరం లేదని తెలిపారు. హనీమూన్ ఎక్కడ జరుపుకుంటారన్న ప్రశ్నకు విజయ్ బదులిస్తూ తన సైవం చిత్రం త్వరలో విడుదలకానుందని ఆ తరువాతనే హనీమూన్ గురించి ప్లాన్ చేసుకుంటామని బదులిచ్చారు.