పాక్ నటీనటులపై నిషేధం లేదు.. కానీ!
పాక్ నటీనటులపై నిషేధం లేదు.. కానీ!
Published Wed, Oct 26 2016 3:29 PM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM
పాకిస్థానీ నటీనటులు భారతదేశంలో పనిచేయకూడదంటూ ప్రభుత్వం నిషేధం ఏమీ విధించలేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అయితే, వారితో పనిచేయించే విషయంలో ప్రజల సెంటిమెంటును దర్శక నిర్మాతలు గౌరవించాలని మాత్రం ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదల విషయంలో ఎంఎన్ఎస్‌కు, సినిమా నిర్మాతకు మధ్యవర్తిత్వం జరపడంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన అన్నారు. ఇతర దేశాల కళాకారులు మన దేశంలోని సినిమాల్లో పనిచేయడంపై నిషేధం విధించడానికి తాను అనుకూలం కాదని వెంకయ్య తెలిపారు.
అయితే, పొరుగుదేశంతో పరోక్ష యుద్ధం కొనసాగుతున్నప్పుడు పరిస్థితులను దర్శక నిర్మాతలు దృష్టిలో పెట్టుకోవాలని మాత్రం అన్నారు. కళలకు హద్దులు లేవని అందరూ అంటారని.. కానీ దేశాలకు మాత్రం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రజల సెంటిమెంట్లను హర్ట్ చేయకూడదన్న బాధ్యత నటీనటులపై కూడా ఉంటుందని తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో అయితే పర్వాలేదు గానీ, రెండు దేశాల మధ్య పరిస్థితి సున్నితంగా ఉన్నప్పుడు, ఉగ్రవాదులకు పొరుగుదేశం నిధులిచ్చి మన జవాన్లను, వందలాది మంది ప్రజలను చంపిస్తున్నప్పుడు.. ఇలాంటి పరిస్థితుల్లో కళ అనేది తమ హక్కని చెబితే ప్రజలు మరోలా భావిస్తారన్నారు. అదే సమయంలో ప్రభుత్వం మాత్రం ఎవరి మీదా నిషేధం విధించలేదన్నారు.
Advertisement