అలా ఎవరూ చేయలేదు!
నాపై అలా ఎవరూ ఒత్తిడి చేయలేదని అంటోంది నటి ప్రణిత. అమ్మో బాపుగారి బొమ్మో పాట వర్ణణకు పేటెంట్ ఈ సుందరి. గుండరాల్లాంటి కళ్లతో కుర్రకారును ఇట్టే ఆకర్షించే ప్రణితను కథానాయకి పాత్రలు మాత్రం పెద్దగా దరి చేరడం లేదు. తెలుగు చిత్రం అత్తారింటికి దారేదితో సహా చాలా చిత్రాల్లో రెండవ కథానాయకి పాత్రలకే పరిమితం అవుతోంది.
తమిళంలో ఉదయన్ చిత్రంలో నాయకిగా పరిచయమైన ప్రణిత ఆ తరువాత శకుని, మాస్ లాంటి కొన్ని చిత్రాల్లో నటించింది. ఇటీవల విడుదలైన ఎనక్కు వాయ్‌ంద అడిమైగళ్ చిత్రంలో నెగిటివ్ షేడ్ ఉన్న పాత్రను చేసింది. ప్రస్తుతం తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ఒక్కో చిత్రం చేతిలో ఉన్న ప్రణితతో చిట్‌చాట్.
ప్ర: తమిళంలో అవకాశాలు తగ్గినట్లున్నాయే?
జ: అధిక చిత్రాల్లో నటించాలన్న కోరిక, ఏడాది మొత్తం నటిస్తూ బిజీగా ఉండాలన్న ఆశ నాకు లేవు. నా తల్లిదండ్రులు డాక్టర్లు. వారి కలలు, లక్ష్యం నెరవేర్చే మంచి కూతురిగా ఉండాలనే ఆశిస్తున్నాను. తెలుగు, కన్నడ భాషల్లో నాకు నటిగా మంచి ఆదరణే లభిస్తోంది. అక్కడి చిత్రాలు పూర్తి చేయడానికే టైమ్ సరిపోతోంది.
ప్ర: బాలీవుడ్ ఆశ లేదా? అలాంటి ప్రయత్నాలేమైనా చేస్తున్నారా?
జ: హిందీ చిత్రాల్లో నటించాలన్న ఆసక్తి లేదు. అక్కడి వరకూ ఎందుకు మాలీవుడ్ చిత్రాలే చేయలేదు.
ప్ర: రోజుకో భాషలో పూటకో కథానాయకి అంటూ కొత్త వారు వస్తున్నారు. వారితో పోటీని ఎలా ఎదుర్కొంటున్నారు?
జ: నిజమే పలు భాషల్లో పలువురు నటీమణులు, సాంకేతిక కళాకారులు పరిచ యం అవుతున్నారు. అయితే వాళ్లను ఎం దుకు పోటీగా భావించాలి? ఇక్కడ ఎవరికి ఎవరూ పోటీ కాదు. వారి వారి ప్రతి భ, శ్రమనే ఉన్నతి స్థాయికి చేరుస్తాయి.
ప్ర: తెలుగు చిత్రాల్లో గ్లామర్‌కు గేట్లు తెరిచారట?
జ: తెలుగులో అధిక గ్లామర్‌ను ఆశిస్తారనే ప్రచారం ఉన్న మాట నిజమే. నాకక్కడ హోమ్లీ ఇమేజ్ ఉంది. గ్లామరస్‌గా నటించమని ఇప్పటి వరకూ నన్నెవరూ ఒత్తిడి చేయలేదు.
ప్ర: ఇంకా ఎంత కాలం నటిగా కొనసాగుతారు?
జ: అది నా చేతిలో లేదు. అలాగే భవిష్యత్తు ప్రణాళికలంటూ ఏమీ లేవు. ఈ రోజు మంచిగా గడిచిపోయిందా? అన్నదాని గురించే ఆలోచిస్తాను. ఇక నటిగా అంటారా అభిమానులు ఆదరించే వరకూ నటిస్తాను.
ప్ర: ఎలాంటి పాత్రలు చేయాలని కోరుకుంటున్నారు?
జ: బాహుబలి చిత్రంలో నటించిన కథానాయికలందరూ నాకిష్టమైన వారే. అదే విధంగా హిందీ చిత్రం బాజీరావ్ మస్తానీలో దీపికాపదుకొణె నటన చాలా నచ్చింది. అలాంటి పాత్రలో నటించాలని కోరుకుంటున్నాను.
ప్ర: అవార్డులను ఆశిస్తున్నారా?
జ: నాకు అభిమానుల చప్పట్లు, ప్రశంసలు, మంచి విమర్శలే ముఖ్యం. ఉత్తమ నటి అవార్డు లభిస్తే సంతోషమే. అంతే గానీ అవార్డుల కోసమే నటించాలనుకోవడం లేదు.
ప్ర: చివరి ప్రశ్న. పెళ్లెప్పుడు చేసుకుంటారు?
జ: ఇప్పటి వరకూ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఎవరినీ ప్రేమించలేదు. అలాంటి ఆలోచన కూడా లేదు. అమ్మానాన్నలు కుదిర్చిన పెళ్లే చేసుకుంటాను.