నాకు అంత సీన్ లేదు! | pranitha interview | Sakshi
Sakshi News home page

నాకు అంత సీన్ లేదు!

Published Sat, Feb 15 2014 11:11 PM | Last Updated on Tue, Aug 28 2018 4:30 PM

pranitha interview

ప్రణీత అంటే ఐరన్ లెగ్!... ‘అత్తారింటికి దారేది’ ముందు వరకూ ఆమెకు అదే ఇమేజ్. ఆ సినిమాతో ఓవర్‌నైట్‌లో స్టార్‌డమ్ వచ్చేసిందామెకు. కన్నడ అమ్మాయి అయినా కూడా అచ్చం బాపు బొమ్మలాగానే ఉంటుంది. స్మయిలిష్‌గా... స్టయిలిష్‌గా కనబడే ప్రణీతతో మాట్లాడుతూ ఉంటే కాలం ఘనీభవించినట్టే అనిపిస్తుంది.
 
 డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యారట..?
 ప్రణీత: అవును. మా అమ్మానాన్నలిద్దరూ డాక్టర్సే. మాకు బెంగళూరులో ఆస్పత్రి ఉంది. ‘నువ్వు డాక్టర్ అవాలి’ అంటూ చిన్నప్పట్నుంచీ చెబుతూ పెంచారు నన్ను. నాకైతే ఆ మాట విన్నప్పుడల్లా చాలా ఒత్తిడిగా అనిపించేది. మార్కులైతే వందకు వంద రావాలనేవారు. అందుకని ఎప్పుడూ పుస్తకాలతో బిజీగా ఉండేదాన్ని.
 
 మరి.. హీరోయిన్ అవుతానంటే ఏమన్నారు?
 ప్రణీత: చాలామంది పేరంట్స్‌లానే కుదరదంటే కుదరదన్నారు.  నేను ఏమాత్రం ట్రై చేయకుండానే నాకు అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. దాంతో అమ్మ ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత ఆలోచనలో పడింది. ఒకవేళ సినిమా ఆర్టిస్ట్ అవ్వాలని రాసి పెట్టి ఉందేమో అనుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ విధంగా ‘పోకిరి’ కన్నడ రీమేక్ ‘పొర్కి’ ద్వారా హీరోయిన్ అయ్యాను.
 
 అందమైన అమ్మాయిలకు ప్రేమలేఖలు రావడం సర్వసాధారణం. మరి మీరెన్ని అందుకున్నారు?
 ప్రణీత: ఒక్కటి కూడా అందుకోలేదు.
 
 పోనీ.. మీరెవరికైనా రాశారా?
 ప్రణీత: పుస్తకాల్లో పాఠాలు రాసుకోవడం తప్ప ప్రేమలేఖలు రాసేంత సీన్ నాకు లేదు. అసలు ఆ యాంగిల్‌లో ఇప్పటివరకు నేను ఏ అబ్బాయినీ చూడలేదు.
 
 మీలా సన్నగా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
 ప్రణీత: నూనె లేకుండా చేసిన వంటకాలు తినాలి. హోటల్‌కెళ్లినప్పుడు, నాకు నచ్చినవన్నీ ఆర్డర్ చేసేసి, ఇవన్నీ నూనె లేకుండా తయారు చేయాలని చెబుతుంటాను. అప్పుడు ‘కొంచెం కూడా నూనె లేకుండా ఎలా వండమంటారు?’ అని కుక్స్ అడిగితే, ఎలాగోలా వండండి. నాకు మాత్రం ఆయిల్ ఫ్రీ ఫుడ్డే కావాలని చెప్పేస్తాను. మనం ఎప్పుడైతే ఆహారం విషయంలో హద్దులు పెట్టుకుంటామో అప్పుడు ఆరోగ్యంగానూ ఉండగలుగుతాం. అలాగే వ్యాయామాలు చేయాలి.
 
 సినిమాల్లో పాత్రకు అనుగుణంగా కాస్ట్యూమ్స్ వేసుకుంటారు. విడిగా మీ అభిరుచి ఏంటి?
 ప్రణీత: సినిమా తారలు సమ్మర్‌లో స్వెటర్ వేసుకుని బయటికెళ్లినా, ‘ఇప్పుడీ ట్రెండ్ నడుస్తుందేమో’ అనుకుని అది ఫాలో అవుతారు చాలామంది. అందుకే, నేను దుస్తుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను. వీలైనంత స్టయిలిష్‌గా ఉండటానికి ప్రయత్నిస్తాను.
 
 డాక్టర్ అవకుండా యాక్టర్ అయ్యామని ఎప్పుడైనా ఫీలయ్యారా?
 ప్రణీత: అస్సలు లేదు. ఇప్పుడే కాదు భవిష్యత్తులో కూడా నేను పశ్చాత్తాపపడను. ఎన్నో రకాల జీవితాలను తెరపై జీవించే అవకాశం ఒక్క కళాకారులకే ఉంటుంది. ఒక్కో పాత్ర మాకు ఒక్కో పాఠం. ఆ పాత్ర తాలూకు అనుభవాలు ఒక్కోసారి మా జీవితాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే షూటింగ్‌లో భాగంగా మేం విదేశాలకూ వెళుతుంటాం. అక్కడి వేష, భాషలు సంప్రదాయాలు తెలుస్తుంటాయి. మన దేశంలోనే పొరుగు రాష్ట్రాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచారాలు తెలుస్తాయి. వాటిలో ఆచరించదగ్గ మంచి విషయాలుంటాయి.
 
 మీకు డ్రీమ్ రోల్ ఏదైనా ఉందా?
 ప్రణీత: ఒక్క పౌరాణిక పాత్రైనా చేయాలని ఉంది. ఆ పాత్రలకు వేసే కాస్ట్యూమ్స్ అంటే చెప్పలేనంత ఇష్టం. అలాగే ఆ సినిమాల్లో వచ్చే గ్రాఫిక్స్‌కి థ్రిల్ అయిపోతుంటాను. అరుంధతి, మగధీర చిత్రాలను ఎగ్జయిట్‌మెంట్‌తో చూశాను.
 
 సేవా కార్యక్రమల సంగతేంటి?
 ప్రణీత: కచ్చితంగా చేస్తాను. దానికోసం సన్నాహాలు కూడా మొదలుపెట్టాను. ఏదైనా స్వచ్ఛంద సేవా సంస్థతో కలిసి నాకు కుదిరినంతవరకూ సేవా కార్యక్రమాలు చేయాలని ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement