నాకు ఎవరూ ప్రపోజ్‌ చేయలేదు! | No one in real life has ever promoted me. | Sakshi
Sakshi News home page

నాకు ఎవరూ ప్రపోజ్‌ చేయలేదు!

Published Thu, Jul 27 2017 12:13 AM | Last Updated on Tue, Sep 5 2017 4:56 PM

నాకు ఎవరూ ప్రపోజ్‌ చేయలేదు!

నాకు ఎవరూ ప్రపోజ్‌ చేయలేదు!

వచ్చింది... మెల్లగా తెలుగు తెరపైకొచ్చింది... ముఖంపై ముత్యమంత మొటిమలతో వచ్చింది...కుర్రాళ్లను గమ్మున కూర్చోనీయడం లేదు..  నిల్చోనీయడం లేదు...ముద్ద నోటికి పోకుండా మస్తుగా డిస్ట్రబ్‌ చేసింది... అందానికి కొత్త నిర్వచనం ఇచ్చింది...తెలుగు ప్రేక్షకులను ‘ఫిదా’ చేసిన తమిళ సాయిపల్లవితో ఇంటర్వ్యూ...

‘గట్టిగా అనుకో.. జరుగుద్ది’ అని ‘ఫిదా’లో ఓ డైలాగ్‌ ఉంది. రియల్‌ లైఫ్‌లో ఎప్పుడైనా అలా అనుకున్నారా?
మనమా? ఎంబీబీఎస్‌ అనుకున్నా. చదువుతానా? లేదా? అనే భయం ఉండేది. కానీ, అయ్యింది కదా! మనం మంచిగా ఆలోచిస్తే మంచే జరుగుతుంది. దేవుడిపై మనకు సహనం, నమ్మకం ఉండాలంతే. ‘ఢీ’ షో అప్పుడు ఇద్దరు ముగ్గురు తెలుగు దర్శకులు అడిగారు. అప్పుడు ‘యస్‌’ చెబితే... ఇప్పుడు ఇంత పేరొస్తుందా? లేదా? తెలీదు.
 
ఓ చేతిలో ఎంబీబీఎస్‌ డిగ్రీ... మరో చేతిలో హీరోయిన్‌గా మంచి పేరు... నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటి?
ఎంబీబీఎస్‌కి, చదువుకి వయసుతో సంబంధం లేదు. కానీ, నటనకు వయసుతో సంబంధం ఉంది. ప్రేక్షకులు నన్ను ఆదరించినంత వరకూ నటిస్తా. తర్వాత చదువు కంటిన్యూ చేస్తా. యాక్చువల్లీ... కార్డియాలజీ చేయాలని నా కోరిక. టైమ్‌ చూసుకుని చేస్తా.
 
ఎంబీబీఎస్‌ చదివేశారు. మరి, మెడిసిన్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నారా?

చేయాలి. కానీ, మెడిసిన్‌ అంత ఈజీ కాదు. మళ్లీ మళ్లీ చదువుతూనే ఉండాలి. మనిషితో ఆటలు ఆడకూడదు. నాకు డిగ్రీ ఉందని ఏదేదో చేయకూడదు. డాక్టర్‌ అవ్వాలనుకుంటే మళ్లీ ఓ ఏడాది నటనను పక్కన పెట్టి... పుస్తకాలన్నీ తిరగేస్తా. వేరొకరి ప్రాణంతో ఆటలు ఆడకూడదు కదా.

రియల్‌ లైఫ్‌లో సాయిపల్లవి ఎలా ఉంటారు?
ఇప్పుడు ఎలా ఉన్నానో.. అలాగే ఉంటాను. మేకప్, గట్రా ఏం ఉండవు. నేను మేకప్‌ వేసుకుంటే వేరే అమ్మాయిలా ఉంటాను. ఐయామ్‌ వెరీ లక్కీ అండ్‌ బ్లెస్డ్‌... నా దర్శకులందరూ మేకప్‌ లేకుండా నటించమన్నారు. దీనివల్ల అమ్మాయిలకు ఎంతో కాన్ఫిడెన్స్‌ వస్తుంది. మా చెల్లి నాకంటే ఐదేళ్లు చిన్నది. కాలేజ్‌కి వెళ్తుంది. తనే కాదు... అమ్మాయిలందరికీ ఓ కాంప్లెక్స్‌ ఉంటుంది. అబ్బాయిలు ‘నువ్వు చాలా అందంగా ఉన్నావ్‌?’ అని చెప్పాలంటే... చక్కగా మేకప్‌ వేసుకుని, ఐలైనర్స్‌ పెట్టుకోవాలనుకుంటారు. ‘ప్రేమమ్‌’ (మలయాళ సినిమా) వచ్చిన తర్వాత పింపుల్స్‌ (మొటిమలు) ఉన్న అమ్మాయి కూడా చాలా అందంగా, కాన్ఫిడెంట్‌గా ఉంటుందన్నారు. అందరూ అందంగా ఉంటారు. చూసే కళ్లని బట్టి  ఉంటుంది.

మీలోనూ ‘ప్రేమమ్‌’ తర్వాతే ఈ కాన్ఫిడెన్స్‌ వచ్చిందా?
యస్‌. నేనూ మామూలు అమ్మాయినే కదా! అందరిలానే ఆలోచించా. నేను చూసిన సినిమాలన్నిటిలో హీరోయిన్స్‌ అందరూ చాలా బాగున్నారు. ముఖంపై ఓ మచ్చ లేదు. దేవతల్లా కనిపించారు. నేను బాగున్నానా? లేదా? అని ఇన్‌సెక్యురిటీ ఉండేది. బట్, క్యారెక్టరే ఇంపార్టెంట్‌ కదా. రియల్‌ లైఫ్‌లో అందరూ ప్రెట్టీ. ఆల్‌ లేడీస్‌ ఆర్‌ వెరీ వెరీ ప్రెట్టీ. అందరూ ఈ మాటే చెప్పాలి. మేకప్‌ వేసుకున్న హీరోయిన్లూ  ‘నేను మేకప్‌ లేకుండానే బాగున్నా’ అని ఫీలవుతారు. ‘ఫిదా’లో మేకప్‌ లేకుండా ఆ అమ్మాయి బాగుంది.. నేనూ మేకప్‌ లేకుండా బాగుంటానని ఏ అమ్మాయి అయినా అనుకుంటే నాకు హ్యాపీగా ఉంటుంది.



‘ఫిదా’లో ఓ సీన్‌లో మోడ్రన్‌ డ్రస్సులో కనిపించారు. రియల్‌ లైఫ్‌లో?
అందులో నేనంత కంఫర్టబుల్‌గా లేను. కానీ, శేఖర్‌ కమ్ములగారి కోసం చేశా. మోడ్రన్‌ డ్రస్సుల్లోనే కాదు, సల్వార్స్‌లోనూ ఓ అమ్మాయిను ఎలా చూపించాలో అలానే చూపించాలి. గ్లామరస్‌గా చూపిస్తే వేరేలా ఆలోచిస్తారు. నాకది వద్దు. ప్రతి రోజూ అమ్మాయిలు కాన్ఫిడెంట్‌గా వేసుకెళ్లే డ్రస్సులనే వేసుకుంటా. ఒకవేళ ఎవరైనా అమ్మాయిలు మోడ్రన్‌ డ్రస్సులు వేసుకుంటే అబ్బాయిలు అడ్వాంటేజ్‌ తీసుకో కూడదు. దాన్ని బ్యాడ్‌గా చూడకూడదు. అందరికీ మనమదే నేర్పించాలి.

♦ తెలుగు ‘ప్రేమమ్‌’ ప్రచార చిత్రాలు చూసి టీచర్‌ పాత్రకు మీ అంత సూట్‌ కాలేదని శ్రుతీహాసన్‌ను కొందరు కామెంట్‌ చేశారు...
శ్రుతి ఓ క్యారెక్టర్‌ చేశారు. ఆమె ఎలా నటించిందో చూడక ముందు, జస్ట్‌ ట్రైలర్స్‌ చూసి కామెంట్స్‌ చేయడం తప్పు. సోషల్‌ మీడియాలో కామెంట్స్‌ను అందరూ చూస్తున్నారనే విషయాన్ని ప్రతి ఒక్కరూ మర్చిపోతున్నారు. జస్ట్‌ థింక్‌... కామెంట్‌ చేసిన అబ్బాయిని ఓ వంద మంది కామెంట్‌ చేస్తే ఎంత బాధపడతాడు. మంచి విషయం చెప్పాలనుకుంటే... అందరికీ చెప్పండి. మీకు నచ్చలేదని కామెంట్‌ చేయడం, అందరికీ చెప్పడం ఎందుకు? ఆమెపై వచ్చిన కామెంట్స్‌ చూసి నేను చాలా బాధపడ్డా. ‘ఫిదా’కు విడుదలకు ముందు ట్రైలర్‌ చూసి ఇద్దరు ముగ్గురు అబ్బాయిలు సోషల్‌ మీడియాలో ‘తెలుగులో ఎంతోమంది అమ్మాయిలుంటే... ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నారు? మన పక్కింటి అమ్మాయిలానే ఉంది కదా!’ అన్నారు. సినిమా చూసి, నా నటనకు ‘ఫిదా’ అయ్యామన్నారు. ఏదైనా మనం చూసే దృష్టిలో ఉంటుంది.

భానుమతిగారూ... మీ నటనకు ఇంత పేరొస్తుందని ఊహించారా?
(నవ్వుతూ). ‘ఫిదా’ విడుదల తర్వాత సాయి పల్లవీ అని కాకుండా నన్ను భానుమతీ అంటుంటే హ్యాపీగా ఉంది. నా బెస్ట్‌ ఇస్తే, హార్డ్‌వర్క్‌ చేస్తే మంచి పేరొస్తుందనుకున్నా. కానీ, ఇంత పేరొస్తుందని ఊహించలేదు. ఈ సక్సెస్‌ నాకింకా సింక్‌ కాలేదు.  

♦ సాయిపల్లవి వల్లే సినిమా హిట్టయ్యిందని కొందరంటున్నారు...
వరుణ్‌ది, నాది, రాజు (‘దిల్‌’ రాజు)గారిది, శేఖర్‌ కమ్ముల గారిది, ఇంకో రెండుమూడు ముఖాలే ప్రేక్షకులు చూస్తారు. కానీ, అసిస్టెంట్‌ డైరెక్టర్లు, కాస్ట్యూమర్స్, మిగతా టీమంతా కష్టపడ్డారు. అలాగే, నాకు కాఫీ ఇచ్చిన అబ్బాయి కూడా ఇంపార్టెంటే. నేను స్పెషల్‌గా ఫీలయ్యేలా చేశాడు. నేను వాళ్లందరికీ క్రెడిట్‌ ఇస్తా.

తెలంగాణ భాష–యాసలపై అంత స్పష్టత ఎలా వచ్చింది?
‘భానుమతి స్లాంగ్‌ ఇలానే ఉండాలి’ అని శేఖర్‌ కమ్ముల చెప్పినప్పుడు.. నా బాడీ లాంగ్వేజ్‌కి సూట్‌ అవుతుందా? అనే డౌటొచ్చింది. కానీ, కన్విన్స్‌ చేశారు. ఏదైనా డైలాగును స్పష్టంగా పలకకపోయినా.. లిప్‌ సింక్‌ లేకున్నా ముఖంలో తెలుస్తుంది. నాకది ఇష్టం లేదు. అందుకే, ప్రతిరోజూ నా డైలాగులను వంద సార్లు చదువుకునేదాన్ని. ఓ ఏడాది పాటు నేను భానుమతిగా మారా. పాత్రలో జీవించా. ఇప్పుడు నటిస్తున్న ‘ఎం.సి.ఎ.’ షూటింగ్‌ మొదట్లో తెలంగాణ యాస వచ్చేది. ‘ఇప్పుడు మామూలు మనిషినయ్యా (నవ్వులు).

‘ఫిదా’లో పవన్‌కల్యాణ్‌ ఫ్యాన్‌గా నటించారు. ఆయన సినిమాలు ఏవైనా చూశారా?
‘గబ్బర్‌సింగ్‌’ చూశా. అయితే... థియేటర్లో ‘ఫిదా’ చూస్తున్నప్పుడు ఓ డౌట్‌ వచ్చింది. నా నటనకు చప్పట్లు కొడుతున్నారా? లేదంటే నేను చెప్పిన పవన్‌గారి డైలాగులకు చప్పట్లు కొడుతున్నారా? అని!! ఒక్కో డైలాగ్‌ చెబుతుంటే థియేటర్‌ మొత్తం చప్పట్లు, ఈలలు. నెక్ట్స్‌ ఇంపార్టెంట్‌ డైలాగ్‌ ఉంది. అది వినిపిస్తుందో? లేదోనని భయపడ్డా. కాసేపటికి నాకే చప్పట్లు కొడుతున్నారనుకున్నా. ఆడియో వేడుకలోనూ అంతే. ‘నేను పీకే సార్‌ ఫ్యాన్‌’ అని శేఖర్‌ కమ్ములగారు చెప్పగానే... ఫ్యాన్స్‌ చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఆపడం లేదు. అప్పుడు ‘నేను డైలాగ్స్‌ కరెక్టుగా చెప్పానా? పీకే సార్‌ యాటిట్యూడ్‌ సరిగ్గా వచ్చిందా? లేదా’ అని ఆలోచించా.

♦  ఏ సీన్‌కి ఎక్కువ కష్టపడ్డారు? ఎక్కువ టేకులు తీసుకున్నారు?
నేను ఉదయం నాలుగున్నరకు నిద్రలేస్తా. రాత్రి పదిన్నర తర్వాత ఆటోమేటిక్‌గా నిద్రొస్తుంది. ఇందులో ఓ సీన్‌ను రాత్రి పదిన్నర తర్వాత ప్లాన్‌ చేశారు. మామూలుగా రెండుమూడు పేజీల డైలాగులు చెప్పేసే నేను, ఆ రోజు రెండు లైన్ల డైలాగ్‌కి మూడు టేకులు తీసుకున్నా. నా వల్ల ప్రతి ఒక్కరూ రెండు మూడు టేకులు చేస్తున్నారు. అప్పుడు ఏడుపొచ్చేసింది.

మరి, నిజంగా కన్నీళ్లు పెట్టుకోవలసిన సీన్స్‌ ఎలా చేశారు?
నాకొక చెల్లి ఉంది. తనకు పెళ్లై వెళ్తే ఎలా ఉంటుందనేది ఊహించుకుని చేశా. ఇప్పుడు తనకు నిజంగా పెళ్లయితే ఏడుపు వస్తుందా? లేదా? అనేది నాకు తెలీదు. ఎందుకంటే... ఆ ఏడుపు ఆల్రెడీ వచ్చేసింది.

సెట్స్‌లో వరుణ్‌ ఎలా ఉండేవారు.. తన హైట్‌తో ఇబ్బందిపడ్డారా?
సైలెంట్‌. వెరీ ప్రొఫెషనల్‌. ఎంత ఎక్స్‌ప్రెషన్‌ కావాలంటే... అంతే ఇస్తాడు. ఎంత సెటిల్డ్‌గా, న్యాచురల్‌గా చెయ్యొచ్చో అంత సహజంగా చేస్తాడు. నా హైట్‌ 5.4. వరుణ్‌ 6.4. మేమిద్దరం ఒక్క ఫ్రేమ్‌లో వస్తామా? లేదా? అని డౌట్‌ పడ్డా. క్లోజ్‌గా ఉన్నప్పుడు హీల్స్‌ వేసుకున్నా. మిగతా సీన్లలో హైట్‌ డిఫరెన్స్‌ ఉంటే బాగుంటుందని శేఖర్‌గారు నేచురల్‌గా షూట్‌ చేశారు.
 
ఇందులో వరుణ్‌ ప్రపోజ్‌ చేస్తే చెప్పు చూపించారు. రియల్‌ లైఫ్‌లో..
ఒక్కరికి కూడా చూపించలేదు. చెబితే నమ్ముతారో? లేదో? రియల్‌ లైఫ్‌లో ఎవరూ సీరియస్‌గా నాకు ప్రపోజ్‌ చేయలేదు.
 
‘ప్రేమమ్‌’ తర్వాత అందులో నటించిన హీరోయిన్లందరూ తెలుగుకు వచ్చారు. మీరు లేటయ్యారు...
అక్కడ వచ్చిన ప్రశంసలు చాలు. రీమేక్‌ చేస్తే... మళ్లీ సేమ్‌ రెస్పాన్స్, ఫీల్‌ వస్తుందా? అనేది నాకు తెలీదు. మీరు తెలుగు ‘ప్రేమమ్‌’ చేస్తారా? అని ఎవరూ నన్ను అడగలేదు. ఇప్పుడు ‘ఫిదా’ను కూడా వేరొక భాషలో రీమేక్‌ చేస్తానంటే నేను చేయను.

మీరు రీమేక్‌లకు వ్యతిరేకమా?
కాదు. ఆల్రెడీ మంచి పేరొచ్చింది. మళ్లీ రీమేక్‌ చేసి, పేరును పోగొట్టుకోవడం ఎందుకనే భయం. సినిమాల్లో లాంగ్‌ కెరీర్‌ ఉండడానికి నేను సూపర్‌ హీరోను కాదు కదా! ఉన్నన్ని రోజులు మంచి సినిమాలు చేయాలి. మంచి పేరు తెచ్చుకుని వెళ్లిపోవాలి.

‘ప్రేమమ్‌’ కంటే ముందే ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’కి ఓ పాత్రకు శేఖర్‌గారు మిమ్మల్ని అడిగారట?
నేనప్పుడు జార్జియాలో ఎంబీబీఎస్‌ చేస్తున్నా. ఇండియాలో ఉంటే ఇటువంటి ఆఫర్స్‌ వల్ల నేనెక్కడ డిస్ట్రబ్‌ అవుతానోనని జార్జియా పంపించారు. ఎందుకంటే సినిమా కెరీర్‌ చిన్నది. ముఖ్యంగా అమ్మాయిలకు. అందువల్ల, నేను కంపల్సరీ డిగ్రీ కంప్లీట్‌ చేయాలనుకున్నారు. ఎంబీబీస్‌ ఫైనల్‌ ఇయర్‌లో ఆల్ఫోన్స్‌ (దర్శకుడు) మలయాళ ‘ప్రేమమ్‌’ చేయమని అడిగారు. అదీ నా సెలవుల్లో షూటింగ్‌ ప్లాన్‌ చేశారు. అందుకే చేశా.

ఫైనల్లీ... ‘ఫిదా’కు మీకొచ్చిన అత్యుత్తమ ప్రశంస ఏది?
తెలంగాణ భాషను రౌడీయిజమ్‌కు ఎక్కువగా వాడడం వల్ల ఒక ప్రొజెక్టర్‌ (థియేటర్‌లో సినిమా వేసేవ్యక్తి) తన పిల్లలు తెలంగాణ మాట్లాడితే తిట్టేవారట. ‘ఫిదా’ చూసిన తర్వాత వాళ్లమ్మాయితో తెలంగాణలో మాట్లాడమన్నారట. మా అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సూరి ఈ సంగతి చెప్పారు. ఆ ప్రొజెక్టర్‌ సెలబ్రిటీ కాకున్నా... నాకొచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌గా ఫీలవుతున్నా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement