తమిళ అమ్మాయిని కావడమే పాపమా?
పెద్ద చిత్రాల్లో నటించే అవకాశాలు రావడం లేదు. చిత్ర పరిశ్రమ పక్కన పెడుతోంది. తమిళ భాష తెలిసిన తమిళ అమ్మాయిని కావడమే తన పాపమా? అంటూ యువ నటి శ్రీప్రియాంక తన ఆవేదనను వ్యక్తం చేసింది. రెయిన్‌బో మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై వీఏఏఆర్ కథికై నిర్మిస్తున్న చిత్రం సారల్.నినైత్తదు యారో చిత్రం ఫేమ్ అజార్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీప్రియాంక హీరోయిన్‌గా నటిస్తున్నారు.
డీఆర్‌ఎల్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి శంకరలింగమ్ సెల్వకుమార్ చాయాగ్రహణం, ఇషాన్‌దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో జరిగింది. చిత్ర ఆడియోను నటుడు వివేక్ ఆవిష్కరించగా నటుడు విజయ్‌సేతుపతి తొలి సీడీని అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిత్ర హీరోయిన్ శ్రీప్రియాంక దర్శకుల సంఘం అధ్యక్షుడు విక్రమన్, వివేక్, నిర్మాత సురేశ్ కామాక్షి లాంటి చిత్రప్రముఖులు ఆశీనులైన వేదికనే తన ఆవేదనను వ్యక్తం చేయడానికి సరైన సమయం అని భావించిందో ఏమో తమిళ భాష తెలిసిన తమిళ హీరోయిన్లను చిత్ర పరిశ్రమ పక్కన పెడుతోందని ఆరోపించింది. తాను పుదుచ్చేరికి చెందిన అమ్మాయినని చెప్పింది. కంగారు, వందామల్ల, కోడైమళై చిత్రాల్లో హీరోయిన్‌గా నటించానని, పైన పేర్కొన్న మూడు చిత్రాలు నటిగా తనకు మంచి పేరు తెచ్చిపెట్టాయని పేర్కొంది.
అయినా తన కంటూ మంచి స్థానాన్ని సంపాదించుకోలేక పోయాననే ఆవేదనను వ్యక్తం చేసింది. పెద్ద చిత్రాల అవకాశాలు రావడం లేదని అంది. తమిళ భాష తెలిసిన తనలాంటి హీరోయిన్లను చిత్ర పరిశ్రమ గుర్తించడం లేదన్న బాధను వ్యక్తం చేసింది. తమిళ అమ్మాయిని కావడమే తన పాపమా? అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. అయినా నటిగా సాధిస్తాననే నమ్మకం తనకుందని, ఈ సారల్ చిత్రంలో నటనకు అవకాశం ఉన్న పాత్రల్లో నటించే అవకాశం దర్శకుడు డీఆర్‌ఎల్ తనకు కల్పించారని అన్నారు. ఇక తమిళ నటిగా శ్రీప్రియాంక తన ఆవేదనను వ్యక్తం చేశారని, చక్కని అందంతో పాటు నటికి కావలసిన మంచి లక్షణాలన్నీ ఆమెలో ఉన్నాయని, తనకు మంచి టైమ్ వస్తుందని నటుడు విజయ్‌సేతుపతి వ్యాఖ్యానించారు.