
రజనీ చిత్రంలో విలన్‌గా అమీర్‌ఖాన్
దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ఉత్తరాది సూపర్‌స్టార్ అమీర్‌ఖాన్‌ను ఢీకొనబోతున్నారా? అవుననే సమాధానమే వస్తోం ది కోలీవుడ్ నుంచి. ఇక్కడ పైచేయి ఎవరిదన్న విషయాన్ని పక్కన పెడితే హీరో మాత్రం మన సూపర్‌స్టారే. విలన్‌గా అమీర్‌ఖాన్ అవతారమెత్తనున్నారన్నది ఆసక్తికరమైన అంశం. అసలు విషయానికొస్తే 2010లో రజనీకాంత్, ఐశ్వర్యారాయ్, దర్శకుడు శంకర్ కలయికలో వచ్చిన ఎందిరన్ ఎంత సంచలన విజ యం సాధించిందో తెలిసిందే. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్ తెరకెక్కనుందన్నది తాజా సమాచారం. దర్శకుడు శంకర్ ఎందిరన్ రెండవ భాగం రూపొందించాలని చాలా కాలంగా భావిస్తున్నా రు.
అందుకు కథ కూడా రెడీ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం విక్రమ్ హీరోగా, ఐ చిత్రాన్ని పూర్తి చేసిన శంకర్ ఎందిరన్-2కు సిద్ధం అవుతున్నారు. ఎందిరన్‌లో రజనీ కాంత్ హీరో (సైంటిస్ట్)గా, విలన్ (రోబో)గా ద్విపాత్రాభినయం చేసిన సంగతి తెలిసిందే. ఎందిరన్-2 లో హీరో పాత్రను రజనీకాంత్‌తోను విలన్ పాత్రను వేరే నటుడితో చేయించాలని భావించారట. ఆ పాత్రను పోషించడానకి పలువుర్ని పరిశీలించినా చివరికి బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్‌ఖాన్ బాగుంటారన్న ఆలోచన వచ్చిం దట. వెంటనే ఆ ఆలోచన అమల్లో పెట్టారట. ఎందిరన్-2లో విలన్‌గా నటించడానికి అమీర్‌ఖాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.
శంకర్ ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇదే జరిగితే ఈ చిత్రం బడ్జెట్, వ్యాపారం ఏ స్థాయిలో ఉంటాయో ఊహించుకోవచ్చు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక వార్త త్వరలో వెలువడనుంది. ప్రస్తుతం రజనీకాంత్ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ద్విపాత్రాభినయం చేస్తున్న లింగా చిత్రం శరవేగంగా జరుగుతోంది.
మైకంతో తూలిపడ్డ రజనీ
లింగా చిత్రం షూటింగ్‌లో నటిస్తున్న సూపర్‌స్టార్ రెండురోజుల క్రితం అనూహ్యంగా మైకంతో తూలి పడిపోయారు. ఈ ఊహించని పరిణామానికి చిత్ర యూనిట్ దిగ్భ్రాంతి చెందింది. వెంటనే రజనీని ఆస్పత్రిలో చేర్చారు. లింగా చిత్ర షూటింగ్ రద్దు అయ్యింది. ఇంతకు ముందు అనారోగ్యానికి గురై చికిత్స పొందినప్పుడే వైద్యులు ఉద్వేగభరిత సన్నివేశాల్లో నటించరాదని సూచించారు. హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న లింగా చిత్ర ఫైటింగ్ సన్నివేశాల్లో రజనీ నటిస్తున్నారు.
పోరాట దృశ్యాల్ని డ్యూప్‌తో చిత్రీకరిద్దామని దర్శకుడు చెప్పినా చిన్న మూమెంటే కదా అంటూ రజనీ వేగంగా పక్కకు తిరిగి స్టంట్ కళాకారుల్ని కాలితో తన్నే సన్నివేశాల్లో నటించారు. ఆ సమయంలోనే ఆయన మైకంలో తూలి కింద పడిపోయారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రిలో చేర్చగా అలసట కారణంగానే రజనీకాంత్ మైకంతో తూలిపడ్డారని వైద్యులు తెలిపినట్లు చిత్ర యూనిట్ వర్గాలు తెలిపారు.