
2ఓ కోసం 40 కిలోల బరువుతో రజనీ
2ఓ చిత్రం కోసం సూపర్‌స్టార్ రజనీకాంత్ శక్తికి మించి శ్రమించినట్లు ప్రచారం చక్కర్లు కొడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులను సొంతం చేసుకున్న ఏకైన భారతీయ నటుడు రజనీకాంత్ అనడంలో ఏమాత్రం అతిశయోక్తి ఉండదు. అలాంటి సూపర్‌స్టార్ తాజాగా ఏక కాలంలో కబాలి, 2ఓ చిత్రాలలో నటిస్తుండడం విశేషం. చాలా కాలం తరువాత దాదాగా నటిస్తున్న కబాలి చిత్రానికి సంబంధించిన అన్ని పనులను రజనీ పూర్తి చేశారు.
ఇక ఎందిరన్‌కు సీక్వెల్‌గా స్టార్ డెరైక్టర్ శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 2ఓ. ఈ చిత్రం షూటింగ్ అధిక భాగం విదేశాలలో చిత్రీకరణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చి్రత్రానికి సంబంధించిన షూటింగ్‌ను రజనీకాంత్ దాదాపు పూర్తి చేశారని సమాచారం. ఇందులో గ్రాఫిక్స్‌కు అధిక ప్రాధాన్యం ఉంటుంది కాబట్టి ఇంకా రజనీకాంత్ నటించే సన్నివేశాలు తక్కువేనని కోలీవుడ్ వర్గాల టాక్. ఇందులో రజనీకాంత్ అధిక సన్నివేశాలలో విచిత్రమైన కాస్ట్యూమ్స్‌లో కనిపిస్తారట.
వీటి బరువు సుమారు 40 కిలోలు ఉంటాయట. ఈ కాస్ట్యూమ్స్ ధరించి వేసవిలో అవుట్ డోర్‌లో మండే ఎండల్లోనూ ఇండోర్‌లో అతి ఏసీ ఫ్లోర్‌లోనూ నటించడంలాంటి కష్టమైన సన్నివేశాలలో రజనీకాంత్ నటించారనీ, అందుకే ఆయన అనారోగ్యం పాలయ్యారని మీడియాలో ప్రచారం హల్‌చల్ చేస్తోంది. అయితే ఈ విషయాల్లో నిజం ఎంతన్నది పక్కన పెడితే రజనీకాంత్ మాత్రం ఇటీవల అనారోగ్యానికి గురైన మాట వాస్తవం. అమెరికాలో చికిత్స పొందిన రజనీ ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ కారణంగానే కబాలి చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని గ్రాండ్‌గా నిర్వహించ తలపెట్టిన చిత్ర యూనిట్ ఆ కార్యక్రమాన్ని విరమించుకుందనే ప్రచారం ఆ మధ్య జరిగింది. అయితే సూపర్‌స్టార్ ప్రస్తుతం పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు.