'అలా చేయడాన్ని నేను సిగ్గు అనుకోను.. తప్పదు'
లాస్ ఎంజెల్స్: తన పిల్లల విషయంలో జోక్యం చేసుకున్న అభిమానికి ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ విజేత హాలే బెర్రీ గట్టి ఝలక్ ఇచ్చింది. తన పిల్లల విషయాలు తన ఇష్టమని, వారి ప్రైవసీ కోసం తాను ఇష్టమొచ్చింది చేస్తానని అభిమానికి షాకిచ్చింది. తను తన పిల్లలను చాలా సమర్థంగా పెంచుతున్నానని చెప్పుకొచ్చింది. ఇటీవల హాలే తన ఇద్దరు పిల్లలు నహ్లా ఆబ్రే, మకేవో మార్జింజ్ ల ఫొటోలను ఇన్స్టాగ్రమ్లో పంచుకుంది. అయితే, వారి ముఖాలను పూర్తి స్థాయిలో చూపించకుండా సగం సగం మాత్రమే చూపించింది. దీనిపై ఓ అభిమాని స్పందిస్తూ..
'పిల్లల ముఖాలు దాయడం వెనుక రహస్యం ఏమిటి? వారు నిజంగా అందమైనవారు. వారిని ఎందుకు చూపించడం లేదు? అలా చూపించేందుకు సిగ్గుగా భావిస్తున్నారా? అంటూ ఆ అభిమాని ప్రశ్నలు సందించాడు. దీంతో కాస్త కోపం పుచ్చుకున్న ఈ అమ్మడు 'ఇప్పటికే మీకు నేను చాలా సార్లు చెప్పాను. అయినా మరోసారి స్పష్టం చేస్తున్నాను. నేను నా పిల్లల గురించి చెప్పేందుకు ఏ విధంగాను సిగ్గుపడటం లేదు. నా సొంత సంరక్షణలోనే వారిని ఎక్కువ సృజనాత్మకత కలిగే పిల్లలుగా తీర్చిదిద్దాలనుకుంటున్నాను. వారి ప్రైవసీకోసమే రహస్యంగా ఉంచుతున్నా. వారిప్పుడే పబ్లిక్ కు తెలియడం నాకు ఇష్టం లేదు' అంటూ చెప్పింది.