
ఓ కాదల్ కన్మణి ఆడియో వచ్చేస్తోంది..
చెన్నై: ఎపుడెపుడా అని సంగీతాభిమానులు ఎదురు చూస్తున్న ఓకే కన్మణి అదేనండీ...ఓ కాదల్ కన్మణి తమిళ మూవీ ఆడియో ఏప్రిల్ 4న వస్తోంది. ఈ శనివారమే ఆడియోను రిలీజ్ చేస్తున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది. తమిళ స్టార్ దర్శకుడు మణిరత్నం, డబుల్ ఆస్కార్ విన్నర్ ఎఆర్ రెహమాన్ ల కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పాటలను ముందు బుధవారం రిలీజ్ చేయాలని అనుకున్నా అది వారాంతానికి వాయిదా పడింది.
మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి వారసుడు దుల్కర్ సల్మాన్, నిత్యమీనన్, జంటగా నటిస్తున్న ఈ చిత్రం తెలుగులో ఘన విజయం సాధించిన సఖి మాదిరిగా రొమాంటిక్ లవ్‌స్టోరీతో తెరకెక్కుతున్నట్లు సమాచారం. దాదాపు పది సంవత్సరాల తరువాత మంచి ప్రేమకథా చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారని టాక్. అంతేకాదు చాలా సంవత్సరాల తరువాత పీసీ శ్రీరాం, మణిరత్న కలసి పనిచేయడం మరో ప్రత్యేకత.
రెండు ఆస్కార్ అవార్డులను తన ఖాతాలో వేసుకున్న రెహమాన్ స్వరపర్చిన పాటలకోసం జనం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మరోవైపు ఏప్రిల్ 24 న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ కసరత్తు చేస్తోంది. ఈ చిత్రం తమిళంతోపాటు తెలుగులోను ఏకకాలంలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సినిమాకు తెలుగులో 'ఓకే బంగారం' అనే టైటిల్‌ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే.