ఆయన గురువు... ఈయన కులదైవం
‘‘శిరిడీ సాయిబాబా మా గురువైతే, ఏడు కొండల వేంకటేశ్వరస్వామి మా కులదైవం. మా గురువుగారి కథతో ‘శిరిడిసాయి’ తీశా. ఇప్పుడు ఓ భక్తుడిగా మా వెంకన్నకి మాహాభక్తుడైన హథీరామ్ బాబా చరిత్ర ఆధారంగా ఈ చిత్రం నిర్మించా. నాకు ఈ అవకాశాలు కల్పించిన రాఘవేంద్రరావు, నాగార్జునలకు జీవితాంతం రుణపడి ఉంటా’’ అన్నారు నిర్మాత ఏ. మహేశ్‌రెడ్డి. ‘శిరిడిసాయి’ తర్వాత నాగార్జున,కె. రాఘవేంద్రరావు కలయికలో ఆయన నిర్మించిన భక్తిరస చిత్రం ‘ఓం నమో వేంకటేశాయ’ ఈ నెల 10న రిలీజవుతోంది. మహేశ్‌రెడ్డి చెప్పిన విశేషాలు....
► తిరుపతి కొండపై హాథీరామ్ బాబా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు? ఆయనకి ఆ పేరు ఎలా వచ్చింది? స్వామివారికి చేసే తోమాల సేవ, వెన్న సేవ తదితర అంశాల గురించి చిత్రంలో చూపించాం. స్వామివారికీ, హాథీరామ్ బాబాకీ మధ్య జరిగిన సంభాషణలు, ఆయన చరిత్రే ఈ సినిమా. స్వామివారిపై సినిమా తీయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నా. ఈ చిత్రంతో ఆ కోరిక తీరింది.
► ఇప్పుడున్న యువతకి స్వామివారి గురించి పెద్దగా తెలియకపోవచ్చు. స్వామికి జరిగే పూజలు, విశిష్ఠత గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ‘ఓం నమో వేంకటేశాయ’ అనేది ఎన్నిసార్లు పలికితే అంత మంచి జరుగుతుంది. అందుకే, హాథీరామ్ బాబా చరిత్రకి ఆ పేరు పెట్టడం జరిగింది.
► ఓవైపు కమర్షియల్ చిత్రాలు చేస్తూనే, మరోవైపు ఈ ఆధ్యాత్మిక చిత్రం చేయడం నాగార్జున గొప్పతనం, మా అదృష్టం. వేరే చిత్రాలు అంగీకరించకుండా గడ్డం పెంచి, భక్తి శ్రద్ధలతో నాగార్జున ఈ చిత్రం చేశారు. తెరపై ఆయన్ని చూడగానే భక్తి భావంతో నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. చరిత్రలో నిలిచిపోయే విధంగా నటించారాయన. థియేటర్‌లో చూసిన ప్రేక్షకులకూ అదే భావన కలుగుతుంది.
► 500 ఏళ్ల క్రితం తిరుమల తిరుపతి ఏ విధంగా ఉండేదో... తెరపై ఆ వాతావరణం ప్రతిబింబించేలా చాలా జాగ్రత్తలు తీసుకుని చిత్రీకరించాం. డీఓపీ ఎస్. గోపాల్‌రెడ్డి చిక్ మంగుళూరు, మహాబలేశ్వరంలలో లొకేషన్‌లు ఫైనలైజ్ చేశారు. కీరవాణి అద్భుతమైన స్వరాలందించారు. నాగార్జున–రాఘవేంద్రరావు కలయికలో భక్తి చిత్రమనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం సహజం. వాటిని అందుకునే విధంగా దర్శకేంద్రులు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. చిత్రం విడుదల తర్వాత తిరుపతి వెళ్లే భక్తుల సంఖ్య పెరుగుతుంది.
► వ్యాపార దృక్పథంతో కాకుండా ఓ భక్తుడిగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రం నిర్మించా. సాధారణంగా భక్తి చిత్రాలపై ఎవరూ ఇంత ఖర్చుపెట్టరు. మా ఎ.ఎం.ఆర్. గ్రూప్ సంస్థల్లో 4,000 మంది పనిచేస్తున్నారు. ఓ వ్యాపారవేత్తగా నేను కొందరికి తెలుసు. ‘శిరిడిసాయి’ విడుదల తర్వాత నా పేరు అందరికీ తెలిసింది. టీవీలో ఆ చిత్రం ప్రసారమైన ప్రతిసారీ 50, 60 ఫోనులు వస్తాయి. ఈ ‘ఓం నమో వేంకటేశాయ’కి ఇంకా మంచి పేరొస్తుంది. మా సంస్థ నిర్మించిన రెండూ భక్తి చిత్రాలే. మంచి కథలు లభిస్తే కమర్షియల్ చిత్రాలు కూడా నిర్మించాలనుంది.