
రెడీ టు విన్
మెగా ఫ్యామిలీలో ఇప్పుడు కొత్త సెంటిమెంట్ మొదలైంది. ‘సరైనోడు’, ‘ధృవ’, ‘ఖైదీ నంబర్ 150’ చిత్రాలకు ఆడియో వేడుకలు నిర్వహించలేదు. రోజుల వ్యవధిలో ఒక్కో పాటను విడుదల చేసి, ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించారు. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ తాజా సినిమాకి కూడా అదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నట్టున్నారు. సాయిధరమ్ తేజ్, రకుల్‌ప్రీత్ సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ‘ఠాగూర్’ మధు నిర్మిస్తున్న సినిమా ‘విన్నర్’.
ఈ నెల 9న థియేట్రికల్ ట్రైలర్, మహా శివరాత్రి సందర్భంగా 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు. 19న ప్రీ–రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘మహేశ్‌బాబు విడుదల చేసిన ‘సితార సితార...’ పాటకు మంచి స్పందన లభించింది. ఈరోజు ‘పిచ్చోడినయిపోయా..’ పాటను సమంత విడుదల చేయనున్నారు. మిగతా ఐదు పాటలను ఒక్కో సినీ ప్రముఖుడు విడుదల చేస్తారు. ప్రస్తుతం రీ–రికార్డింగ్ జరుగుతోంది. మిగిలిన ఒక్క పాటను 12 నుంచి చిత్రీకరిస్తాం’’ అన్నారు. ఎస్.ఎస్. తమన్ సంగీతమందించిన ఈ చిత్రానికి కథ: వెలిగొండ శ్రీనివాస్, మాటలు: అబ్బూరి రవి, ఎడిటర్: గౌతంరాజు, కెమేరా: ఛోటా కె.నాయుడు.