టైటిల్ : విన్నర్
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్, థాకూర్ అనూప్ సింగ్, జగపతి బాబు, ముఖేష్ రుషి
సంగీతం : ఎస్. తమన్
దర్శకత్వం : గోపిచంద్ మలినేని
నిర్మాత : నల్లమలపు బుజ్జి, ఠాగూర్ మధు
వరుస హిట్స్తో మంచి ఫాంలో కనిపించిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ జోరుకు తిక్క సినిమాతో బ్రేక్ పడింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావలన్న కసితో సాయి చేసిన సినిమా విన్నర్. కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించటంలో స్పెషలిస్ట్గా పేరున్న గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన విన్నర్.. సాయి కెరీర్కు బూస్ట్ ఇచ్చిందా..? గోపిచంద్ మలినేని మరోసారి కమర్షియల్ డైరెక్టర్గా తన స్టామినాను ప్రూవ్ చేసుకున్నాడా..?
కథ :
మహేందర్ రెడ్డి (జగపతి బాబు) ఇండియాలోనే బెస్ట్ జాకీ. వందల కోట్ల ఆస్తులకు వారసుడు. అవన్ని కాదనుకొని తను ప్రేమించిన అమ్మాయి కోసం తండ్రి (ముఖేష్ రుషి)ని ఎదిరించి ఇంటి నుంచి వెళ్లిపోతాడు. కొడుకు సిద్ధార్థ్ పుట్టిన తరువాత భార్య చనిపోవటంతో కొడుకే ప్రపంచంగా బతుకుతుంటాడు. మహేందర్ రెడ్డి తండ్రికి బిజినెస్ లో భారీగా నష్టాలు వస్తాయి. వరుసగా తాము బెట్టింగ్ వేసిన గుర్రాలు ఓడిపోతుండటంతో మహేందర్ రెడ్డి వస్తేనే తిరిగి బిజినెస్ లాభల్లోకి వస్తుందని పార్టనర్స్ ఒత్తిడి చేస్తారు. కానీ మనవడిని మాత్రం తన కొడుకు నుంచి ఎలాగైన దూరం చేయాలని ప్లాన్ చేస్తాడు. అ నుకున్నట్టుగా తండ్రి కొడుకుల మధ్య దూరం పెంచి సిద్ధార్థే, తండ్రి మీద కోపంతో ఇళ్లు వదిలి వెళ్లిపోయేలా చేస్తాడు. తండ్రి రేసుల కారణంగా తనకు దూరమయ్యాడన్న కోపంతో నాన్న అన్నా, గుర్రాలన్నా, రేసులన్నా ద్వేషం పెంచుకుంటాడు సిద్ధార్థ్.
20 ఏళ్ల తరువాత సిద్ధార్థ్ న్యూ లుక్ పత్రికలో క్రియేటివ్ హెడ్గా పనిచేస్తుంటాడు. ఒక పార్టీలో కలిసిన రేసర్ సితారతో తొలి చూపులోనే ప్రేమలో పడిపోతాడు. కానీ సితార మాత్రం తన గోల్ గురించి చెప్పి సిద్ధార్థ్ ప్రేమను కాదంటుంది. ఆ కోపంతో సితార రన్నింగ్ కాంపిటీషన్కు రెడీ అవుతున్న విషయం వాళ్ల ఇంట్లో చెప్పేస్తాడు. దీంతో సితార తండ్రి రాజీవ్ రెడ్డి ఆమెకు వెంటనే పెళ్లి ఫిక్స్ చేస్తాడు. పెళ్లి నుంచి తప్పించుకోవాలనుకున్న సితార.. తాను సిద్ధార్థ్ను ప్రేమించానని.. వీరు తీసుకువచ్చిన పెళ్లి కొడుకు తన ప్రియుడితో రేసులో గెలవాలని పందెం కాస్తుంది. మరి గుర్రాలంటే పడని సిద్ధార్థ్ హార్స్ రేసులో పాల్గొన్నాడా..? సితారను పెళ్లి చేసుకోవటానికి వచ్చిన వ్యక్తి ఎవరు..? సిద్ధార్ధ్, తిరిగి తండ్రి మహేందర్ రెడ్డి దగ్గరకు చేరుకున్నాడా..? అన్నదే మిగతా కథ.
నటీనటులు :
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్.. తన ఎనర్జిటిక్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ సీన్స్ కోసం సాయి పడిన కష్టం తెర మీద కనిపించింది. ముఖ్యంగా క్లైమాక్స్ సీన్స్లో సాయి ప్రొఫెషనల్ జాకీలా కనిపించాడు. హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్ ఆకట్టుకుంది. నటనతో పాటు గ్లామర్ షోతోనూ అలరించింది. జగపతి బాబు మరోసారి తండ్రి పాత్రలో ఒదిగిపోయాడు. స్టైలిష్గా కనిపిస్తూనే ఎమోషన్స్ పండించాడు. విలన్ థాకూర్ అనూప్ సింగ్ స్టైలిష్గా అదే సమయంలో క్రూయల్ గానూ కనిపించాడు. ముఖ్యంగా హార్స్ రైడింగ్ సీన్స్లో సాయికి గట్టి పోటి ఇచ్చాడు. వెన్నెల కిశోర్, అలీ, 30 ఇయర్స్ పృథ్వీలు కామెడీ పరవాలేదనిపించింది. ఇతర పాత్రల్లో ముఖేష్ రుషి, సురేష్ తమ పరిథి మేరకు ఆకట్టుకున్నారు.
సాంకేతిక నిపుణులు :
డాన్ శీను, బలుపు లాంటి సూపర్ హిట్లతో పాటు.. బాడీగార్డ్, పండగ చేస్కో లాంటి యావరేజ్ సినిమాలను అందించిన గోపిచంద్ మలినేని మినిమమ్ గ్యారేంటి దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పక్కా కమర్షియల్ ఫార్మాట్లో సినిమా చేసే గోపిచంద్ విన్నర్లోనూ అదే ఫార్ములాను కంటిన్యూ చేశాడు. ఫస్ట్ అంతా కామెడీ, లవ్ ట్రాక్లతో లాగించేసిన దర్శకుడు ఇంటర్వ్లో అసలు కథలోకి ఎంటర్ అయ్యాడు. అప్పటి వరకు వచ్చిన సీన్స్ అన్ని రొటీన్గా అనిపించటం కాస్త బోర్ కొట్టిస్తుంది. సెకండ్ హాఫ్లో కథలో వేగం కనిపిస్తుంది. తమన్ మ్యూజిక్ ఆకట్టుకునే స్థాయిలో లేదు. చోటా కె నాయుడు సినిమాటోగ్రఫి బాగుంది. హార్స్ రేస్ సీన్స్, సాంగ్స్లో విజువల్స్ చాలా బాగున్నాయి. ఎడిటింగ్ విషయంలో కూడా ఇంకాస్త కేర్ తీసుకోవాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
సాయి ధరమ్ తేజ్, జగపతి బాబు నటన
రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్
హార్స్ రేస్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ టేకింగ్
మ్యూజిక్
విన్నర్.. రొటీన్ కమర్షియల్ ఎంటర్టైనర్
- సతీష్ రెడ్డి, ఇంటర్నెట్ డెస్క్