రకుల్‌..ధరమ్‌ | sai dharamtej and rakul preeth singh special interview | Sakshi
Sakshi News home page

రకుల్‌..ధరమ్‌

Published Sat, Feb 18 2017 11:31 PM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

మా మీద వచ్చే రూమర్స్‌కి మేమిలాగే నవ్వుతుంటాం అంటున్న రకుల్‌ప్రీత్, సాయిధరమ్‌ తేజ్‌

మా మీద వచ్చే రూమర్స్‌కి మేమిలాగే నవ్వుతుంటాం అంటున్న రకుల్‌ప్రీత్, సాయిధరమ్‌ తేజ్‌

లాత్రి లైన్‌ అయ్యిందనుకుంటా...
ఇంటర్వ్యూ లంప్లీట్‌ అవ్వడానికి...
కలుపు నొప్పేసింది... లవ్వీ... లవ్వీ...
‘సాక్షి’ చేసిన ఇంటర్వ్యూల్లో ఇది తప్పకుండా
లక్కిలిగింతల ఇంటర్వ్యూయే..
సాయిధరమ్‌ తేజ్‌ – రకుల్‌ ప్రీత్‌సింగ్‌
ఇద్దరూ ఒకరితో ఒకరు‘ల’ భాషలో మాట్లాడుకుంటారట.
మేం ముందు బుర్ర గీక్కున్నాం..
అదేమైనా ‘లవ్వు’ భాషేమో అని.
ఆ తర్వాత అర్థమైంది...‘లాఫింగ్‌ భాష’ అని.
ఎంజాయ్‌ ఇంటర్వ్యూ...‘సాక్షి’ ఎక్స్‌క్లూజివ్‌.


సాక్షి: రకుల్‌తో సినిమా అనగానే మీకు ఏమనిపించింది?
సాయిధరమ్‌ తేజ్‌: తనతో నాకు ముందునుంచీ పరిచయముంది. అందుకే షూటింగ్‌ సరదాగా ఉంటుందనుకున్నా. అంతకంటే ఎక్కువ సరదాగా, ఎంజాయ్‌ చేస్తూ షూటింగ్‌ చేశాం. డైట్‌ కంట్రోల్‌లో ఉంటాం కాబట్టి, మేం ఎక్కువగా తినం. ఇద్దరం ఫుడ్‌ లవర్స్‌. అందుకే ఫుడ్‌ గురించి విపరీతంగా డిస్కస్‌ చేసుకుంటాం. మేం ఏ ఫుడ్‌కైతే దూరంగా ఉంటామో అవి తింటున్నట్లు ఊహించుకుంటాం. అప్పుడు నోట్లో నుంచి.. ఎందుకులెండి? చెబితే బాగుండదు. ఇక, షూటింగ్‌ విషయానికి వస్తే రకుల్‌తో నాకెలాంటి మొహమాటాలూ లేవు. ఏదైనా ఫ్రెండ్లీగా మాట్లాడతా. అంత ఫ్రీడమ్‌ ఉంది. అదే సమంతతో సినిమా అంటే.. ‘ఆహా... ఆ’ అని ఎగై్జట్‌ అయ్యేవాణ్ణి. రకుల్‌తో అనగానే మామూలుగా ‘యస్‌’ అనుకున్నా (నవ్వులు).
రకుల్‌: (తేజ్‌ వైపు చూస్తూ..) కొడతా!

సాక్షి: ఇంతకీ మీరిద్దరూ. నువ్వు–నువ్వు అనుకుంటారా? మీరు–మీరు అని పిలుచుకుంటారా?
రకుల్‌: ‘మీరు.. సార్‌’.. అలాంటివేం లేదు. నువ్వు.. నువ్వు అనే మాట్లాడుకుంటాం.
తేజ్‌: ఒకవేళ ఎవరైనా నాకు పరిచయం లేని కొత్త హీరోయిన్‌ అయితే మీరు అని పిలుస్తా. రకుల్‌ ఎప్పట్నుంచో ఫ్రెండ్‌ కాబట్టి నువ్వు అనే అంటా.

సాక్షి: తేజూతో సినిమా అనగానే మీకెలా అనిపించింది?
రకుల్‌: మంచి ఫ్రెండ్‌ కాబట్టి బాగానే అనిపించింది. షూటింగ్‌ స్పాట్‌లో అయితే ‘హీరోగారు వచ్చారు, హీరోగారు వెయిట్‌ చేస్తున్నారు’ టైపులో ఏం లేదు (నవ్వుతూ). షాట్‌ గ్యాప్‌లో ఏదో సోది మాట్లాడుకునేవాళ్లం. మా ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉంటుంది. నేను అక్టోబర్‌ 10న, తను అక్టోబర్‌ 15న పుట్టాం. నేను అమ్మాయి, తను అబ్బాయి. అంతే తేడా. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌.

సాక్షి: ఇద్దరూ ఒకే ఏడాది పుట్టారా?
రకుల్‌:హలో.. ఏజ్‌ తెలుసుకోవడానికి ప్రయత్నిస్తు న్నారా? ఇక్కడ వయసులు చెప్పబడవు.
తేజ్‌: నాకంటే చిన్నది. అంతవరకూ చెబుతా.

సాక్షి: అవునూ.. మీ గురించి గాసిప్స్‌ వస్తుంటాయ్‌ కదా.. వాటి గురించి డిస్కస్‌ చేసుకుంటారా?
తేజ్‌: బాగా డిస్కస్‌ చేసుకుంటాం. ‘మనిద్దరం ఒకరినొకం ఇష్టపడుతున్నామని రాశారు. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తోంది?’ అని తనని అడిగితే.. స్టుపిడ్‌గా ఉందంటుంది. నాకేమో నవ్వొస్తుంది. ఇప్పటివరకూ నేను పని చేసిన ప్రతి హీరోయిన్‌తోనూ లింకప్‌ పెట్టి గాసిప్స్‌ రాశారు.
రకుల్‌: తేజు చాలా మంచోడు. తనపై ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తున్నారో అర్థం కావడం లేదు.

సాక్షి: రెజీనా, రాశీఖన్నా, రకుల్‌.. ఇలా ‘ర’ లెటర్‌ ఉన్న హీరోయిన్లతోనే ఎఫైర్‌ అని వార్తలు రావడం విచిత్రం..
రకుల్‌:(నవ్వుతూ..) అవునవును. ఇంతకు ముందే నేనా విషయం తేజూకి చెప్పా. ఇక, మా స్టోరీ అయితే సూపర్బ్‌. ఎంత మంచి స్క్రీన్‌ప్లే రాశారంటే.. సడన్‌గా ఓసారి గోపీగారు (‘విన్నర్‌’ దర్శకుడు గోపీచంద్‌ మలినేని) నా పర్సు ఓపెన్‌ చేస్తే.. అందులో తేజు ఫోటో ఉందట! అలా కల్పించుకుని ఎవరో రాశారు.
తేజ్‌: ఆ స్క్రీన్‌ప్లే నాకూ అర్థం కాలేదు. అయినా ఈ కాలంలో పర్సుల్లో ఎవరు ఫొటోలు పెట్టుకుంటారండీ? ఎంచక్కా ఫోన్‌లో పెట్టుకుంటున్నారు. అందుకే ఆ కహానీ చదివి, ‘ఏ కాలంలో ఉన్నార్రా బాబూ. ఆ జమానా ఎప్పుడో అయిపోయింది’ అనుకుని ఇద్దరం నవ్వుకున్నాం.

సాక్షి: మీ హార్ట్‌ని విన్‌ అయినవాళ్లు ఎవరైనా ఉన్నారా?
తేజ్‌: చాలామంది గెలుచుకున్నారండి.
రకుల్‌: పెద్ద లిస్టు ఉంది. చెప్పడానికి సిగ్గుపడతాడు.
తేజ్‌: పేర్లు చెబితే వాళ్లు కూడా సిగ్గుపడతారు. అలాగే వీడు మనల్ని ఎప్పుడు చూశాడా అని ఆశ్చర్యపోతారు.
రకుల్‌: సిగ్గుతో చచ్చిపోతారు కూడా.  

సాక్షి : అసలు ఎప్పుడైనా పర్సులో ఫొటోలు పెట్టుకున్నారా?
తేజ్‌: ఒకప్పుడు పెట్టుకున్నాను. కానీ, పర్సు సరిపోలేదు.
రకుల్‌: అందుకే, తన ఫొటో తీసి నా పర్సులో పెట్టాడు. నా పర్సు ఖాళీగా ఉంటుంది కదా. పర్సులో ఉన్న తన ఫొటోను నా పర్సులో పెడితే.. ఆ ఖాళీలో ఇంకో అమ్మాయి ఫొటో పెట్టొచ్చు కదా (అల్లరిగా చూస్తూ). ఏయ్‌.. నువ్వే నీ ఫొటోని నా పర్సులో పెట్టావ్‌ కదూ.
తేజ్‌: నాకేం తెలుసు. వాళ్లు నీ పర్సే ఓపెన్‌ చేస్తారని!
రకుల్‌: మమ్మీ–డాడీ చూసేస్తారు. అందుకే, పర్సులో ఎప్పుడూ ఫొటోలు పెట్టుకోలేదు. హార్ట్‌లోనే పెట్టుకున్నా.
తేజ్‌: నా కెమిస్ట్రీ బుక్‌లో ఓ ఫొటో, ఫిజిక్స్‌ బుక్‌లో ఒకటి, బోటనీ, జువాలజీల్లో ఒక్కో ఫొటో ఉండేది. నలుగురి ఫొటోలు. క్లాస్‌ మారినప్పుడల్లా ఫొటోలు మారేవి!

సాక్షి : జనరల్‌గా మీరు ఏ భాషలో మాట్లాడుకుంటారు?
రకుల్‌: లలలలల! ‘ల’ భాష మాట్లాడుకుంటాం. ఇప్పుడు మీరు తేజూ అంటున్నారని నేనలా పిలుస్తున్నాను కానీ, మామూలుగా అయితే నేను తేజూని ‘ధలమ్‌’ అంటాను. తనేమో నన్ను ‘లకుల్‌’ అని పిలుస్తాడు.
తేజ్‌:మాది ‘ల’ భాష. ఉక్రెయిన్‌లోని ‘లివివ్‌’ అనే సిటీలో ‘విన్నర్‌’ షూటింగ్‌ చేసినప్పుడు ఆ భాష మొదలుపెట్టాం. అక్కడ చలి ఎక్కువ. సాయంత్రం నాలుగున్నరకి షూటింగ్‌కి ప్యాకప్‌ చేప్పేసేవారు. 6 గంటలకు హోటల్‌కి చేరుకునేవాళ్లం. ఓ గంట వర్కౌట్స్‌ చేసి, ఏడు నుంచి పది గంటల వరకూ సిటీ చూడ్డానికి వెళ్లేవాళ్లం. డిఫరెంట్‌ రెస్టారెంట్స్‌లో ఫుడ్‌ తినేవాళ్లం. ఒకచోట భోజనం ఎంత టేస్టీగా ఉందంటే.. మా మైండ్‌ బ్లాంక్‌ అయింది. ఆ ఫుడ్‌ గురించి మాట్లాడుతూ.. మాట్లాడుతూ మళ్లీ అదే ప్లేస్‌కి వచ్చాం. అప్పుడు.. ‘మనం లివీవియన్స్‌. మనం లివీవ్‌లో బతుకుతున్నాం. మనది ‘ల’ భాష’ అని డిసైడ్‌ అయ్యాం. ‘బీసీ సెంటల్, లకుల్, విన్నల్‌’.. ఇలా అన్నీ ‘లా’లే.

సాక్షి: లైఫ్‌లో మీ మొదటి గెలుపు మీకు గుర్తుందా?
తేజ్‌:చిన్నప్పుడు వంద మీటర్ల పరుగు పందెం గెలిచినప్పుడు బుజ్జి కప్‌ ఇచ్చారు. దాన్ని అమ్మకు ఇచ్చాను. నా మొదటి గెలుపు అది. ఎప్పటికీ గుర్తుంటుంది.
రకుల్‌: మేము జలంధర్‌లో ఉన్నప్పుడు ఓ సింగింగ్‌ కాంపిటీషన్‌లో ప్రైజ్‌ తీసుకున్నా. అప్పుడు నాకో బ్యూటిఫుల్‌ టెడ్డీబేర్‌ గిఫ్ట్‌ ఇచ్చారు. నేనప్పుడు సెకండ్‌ క్లాస్‌ చదువుతున్నా. కాంపిటీషన్‌లో కూడా నేను సెకండే. ‘యాద్‌ పియా కి ఆనే లగి..’ పాట పాడాను. నేనంత దరిద్రంగా పాడినా ప్రైజ్‌ ఎలా వచ్చిందో తెలీదు (నవ్వుతూ). అప్పట్లో నాకొచ్చిన ఒకే ఒక్క పాట అది. ప్రతి కాంపిటీషన్‌లోనూ ఆ పాటే పాడేదాన్ని.
తేజ్‌:నేను మ్యూజికల్‌ చైర్స్‌ చాలా కసిగా ఆడేవాణ్ణి. ఎప్పుడూ నెగ్గలేదు. ఆటలో ఇద్దరు మిగిలిపోయినప్పుడు చాలా టెన్షన్‌గా ఉండేది. కుర్చీ యాంగిల్‌లో ఉండేవాళ్లు్ల నెగ్గేవారు. నేను ఆ యాంగిల్‌లోనే ఎక్కువగా వెళ్లేవాణ్ణి. కానీ, కుర్చీ లాక్కుని పక్కనోడు కూర్చునేవాడు. అలా ఛాన్స్‌ ఉండి కూడా నేను ఓడిపోయేవాణ్ణి.

సాక్షి: ఇంకొకరి గెలుపు కోసం మీరు ఓడిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?
రకుల్‌: (నవ్వుతూ...) అంత సినిమాటిక్‌ లైఫ్‌ లేదు. అలాగని నేనే గెలవాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎవ్వరైనా వంద శాతం కష్టపడితే వాళ్లు నెగ్గుతారు. (తేజ్‌వైపు చూస్తూ..)
తేజ్‌:చిన్నపిల్లల్ని ఎంకరేజ్‌ చేయడానికి కొన్నిసార్లు ఓడిన సందర్భాలున్నాయి. కానీ, గేమ్స్‌ ఆడేటప్పుడు ఎదుటివాళ్లను గెలిపించాలనే ఆలోచన రాలేదు.

సాక్షి: చిన్నప్పుడు మార్కులు, స్పోర్ట్స్, పెద్దయిన తర్వాత కెరీర్‌... అన్నింట్లోనూ గెలవాలి. గెలుపు అంటే ఎప్పుడూ ఓ ప్రెజర్‌ ఉంటుందేమో కదా?
తేజ్‌:నేను గెలుపు గురించి ఆలోచించను. చేస్తున్న పనిని ఎంజాయ్‌ చేస్తున్నానా? లేదా? అని మాత్రమే ఆలోచిస్తా. ఇప్పుడు సినిమాలు చేస్తున్నా. ప్రతి సినిమా ఆడాలంటే కష్టం. గెలుపోటములను మనం ఎలా చూస్తున్నామన్నదే ముఖ్యం. నేను రెంటినీ ఒకేలా చూస్తా. ఒక్క తేడా ఏంటంటే... గెలిస్తే హ్యాపీ. ఓడితే.. దాన్నుంచి ఏం నేర్చుకున్నాం? అని ఆలోచిస్తా. మళ్లీ అది రిపీట్‌ చేయకుండా చూసుకుంటా.
రకుల్‌: ఎప్పుడూ నేను ఒత్తిడికి లోనుకాను. ఒత్తిడికి గురయితే.. పర్‌ఫార్మెన్స్‌ పోతుంది. నేను ఏం చేసినా ఎంజాయ్‌ చేసి, చేస్తాను. వందశాతం కష్టపడి చేస్తా. రిజల్ట్‌ గురించి ఎప్పుడూ పట్టించుకోను. వృత్తిపట్ల నిజాయితీగా ఉంటే గెలుపు అదే వస్తుంది.

సాక్షి:  ‘గెలుపు’కి మీరిచ్చే నిర్వచనం ఏంటి?
రకుల్‌: నేను ఎవరితో అయితే కలసి పని చేస్తున్నానో ఆ వ్యక్తులు నా పట్ల మంచి అభిప్రాయంతో ఉండడమే నిజమైన గెలుపు. ఉదాహరణకు.. నేను బోలెడన్ని డబ్బులు సంపాదించి, ఎంతో సాధించినప్పటికీ... ఎవరూ నన్ను ఇష్టపడకపోతే, నాతో మాట్లాడేవారు ఒక్కరూ లేకపోతే, అసలు స్నేహితులే లేరంటే... ఐయామ్‌ ద బిగ్గెస్ట్‌ ఫెయిల్యూర్‌ పర్సన్‌. నా దృష్టిలో గెలుపంటే... గొప్ప స్నేహితులు, గొప్ప జీవితం ఉండాలి. ఎప్పుడూ సంతోషంగా ఉండాలి.
తేజ్‌: ఈ సినిమాకు ముందు చిన్న చేదు అనుభవం (‘తిక్క’ ఫెయిల్యూర్‌) ఉంది. అదో లెర్నింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌. ఆ టైమ్‌లో నావాళ్లు, మా ఫ్యాన్స్‌ నాకు బాగా సపోర్ట్‌గా నిలిచారు. అది హ్యాపీ. నా పట్ల వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు నా సక్సెస్, గెలుపు కింద భావిస్తా. మనం నలుగుర్ని సంపాదించుకున్నామంటే అది గెలుపే.


సాక్షి: తేజూలో ప్లస్, మైనస్‌?
రకుల్‌: చాలా మంచోడు. అమ్మను బాగా చూసుకుంటాడు. రాముడు మంచి బాలుడు టైపు. ‘గెట్‌ స్పాయిల్డ్‌’ అని చెబుతుంటా. ‘చుట్టుపక్కల ఉన్నోళ్లను చూసి కొంచెం నేర్చుకో... ఎప్పుడైనా అబద్ధాలు చెప్పు. అల్లరి చేయ్‌’ అంటుంటా. అంత మంచోడు కాబట్టే కొంతమంది అలుసుగా తీసుకుంటారు. తన ప్లస్, మైనస్‌.. మంచోడు కావడమే.
తేజ్‌: అది నిజమేనండి. నేను చాలా ఈజీగా కరిగిపోతా. ఎవరేం చెప్పినా నమ్మేసి హెల్ప్‌ చేయడానికి ప్రయత్నిస్తా.

సాక్షి: రకుల్‌లో ఉన్న ప్లస్సులూ మైనస్సులూ ఏంటి?
తేజ్‌: ఓవర్‌ హార్డ్‌ వర్కింగ్‌. రెస్ట్‌ తీసుకోదు. ఏం చేసినా అందులో మ్యాగ్జిమమ్‌ చేస్తుంది. వర్క్, ఫన్, ఇంకోటి ఏదైనా.. చాలా సీరియస్‌గా తీసుకుని చేసేస్తుంది. తనకంటూ టైమ్‌ కేటాయించదు. అదే ప్లస్‌.. అదే మైనస్‌.
రకుల్‌:అవునండి. వర్క్, వర్కౌట్స్, పార్టీయింగ్‌.. ఏదైనా ఫుల్లుగా చేయాలన్నది నా పాలసీ.

సాక్షి: తేజ్‌ బాగా డ్యాన్స్‌ చేస్తారు. ఇబ్బంది అనిపించిందా?
రకుల్‌: మెగా ఫ్యామిలీలో ఉన్నవాళ్లకి చిన్నప్పట్నుంచీ స్పూన్‌తో డ్యాన్సింగ్‌ సిరప్‌ తాగించారేమో. అసలు ఎముకలు లేనట్టు బాగా డ్యాన్స్‌ చేస్తారు. నాకు ఇబ్బంది కాదు. ఎందుకంటే నాకూ ఎక్కువ డ్యాన్స్‌ చేసే ఛాన్స్‌ వస్తుంది.  
తేజ్‌: షి ఈజ్‌ గుడ్‌ డ్యాన్సర్‌. మేనేజ్‌ చేయడం నుంచి మంచి డ్యాన్సర్‌గా ఎదిగింది. తారక్‌ (ఎన్టీఆర్‌), రామ్‌చరణ్, బన్నీలతో ప్రాక్టీస్‌ చేసిన తర్వాత నేనేంత? జుజుబీ(నవ్వుతూ).

సాక్షి: ‘ధృవ’లో ‘పరేషానురా....’ పాట లో మీరు చాలా హాట్‌గా ఉంటారు.
రకుల్‌: సినిమాటోగ్రాఫర్‌ నన్ను చాలా అందంగా చూపించారు.
తేజ్‌: రకుల్‌ని చూస్తే ఓ కమెడియన్‌ గుర్తొస్తుంది. ఆ పాటలో మరీనూ. రకుల్‌ సరిగా చేయలేదు. ‘చూశా.. చూశా..’ పాటలో జీవించింది. ‘పరేషానురా..’లో జస్ట్‌ నటించింది.
రకుల్‌: ‘చూశా.. చూశా’ ఈజ్‌ మై ఒరిజినల్‌ క్యారెక్టర్‌. అంతకన్నా ఎక్కువ నాకు రాదు, తెలీదు. మీరే (తేజ్‌) నేర్పించాలి మరి (కాస్తంత వ్యంగ్యంగా).

సాక్షి : రకుల్‌ అందాన్ని వర్ణించమంటే.. ఏం చెప్తారు తేజూ?
తేజ్‌:నేనెప్పుడూ రకుల్‌ని అలా చూడలేదు. ఎమీ జాక్సన్‌ గురించి అడగండి, చెప్తాను. రకుల్, రెజీనా నాకు క్లోజ్‌ ఫ్రెండ్స్‌. ఇద్దరి అందాన్ని వర్ణించే దృష్టితో చూడలేదు.
రకుల్‌: ఇన్‌ఫాక్ట్‌ మేమిద్దరం కూర్చుని ఆ అమ్మాయి బాగుంది, ఈ అబ్బాయి బాగున్నాడని డిస్కస్‌ చేసుకుంటాం. రొమాంటిక్‌ సీన్స్‌ చేసేటప్పుడు నవ్వుకునేవాళ్లం. ఓ సాంగ్‌ షూటింగ్‌లో తేజూని చూసి సిగ్గుపడాల్సిన టైమ్‌లో నాకు నవ్వొచ్చింది. కష్టపడి కంప్లీట్‌ చేశాం
తేజ్‌: రొమాంటిక్‌ సీన్స్‌లో ‘హే.. డోంట్‌ డూ ఇట్‌’ అనేవాణ్ణి. అంతలోనే, ‘మనం తప్పకుండా యాక్ట్‌ చేయాలి. వాళ్లు మనకి డబ్బులు ఇస్తున్నారు’ అనుకునేవాళ్లం.

సాక్షి: వేలంటైన్స్‌ డే ఎలా సెలబ్రేట్‌ చేసుకున్నారు?
రకుల్‌: ‘హ్యాపీ సింగిల్‌ వేలంటైన్స్‌డే’ అని చెప్పుకున్నాం.
తేజ్‌: నేను వేలంటైన్స్‌డే సెలబ్రేట్‌ చేసుకోను. 15 ఏళ్ల క్రితం ఫిబ్రవరి 14న నా ఫ్రెండ్‌ మరణించాడు. అప్పట్నుంచీ వేలంటైన్స్‌డే సెలబ్రేట్‌ చేసుకోను. ఆ రోజు మా ఫ్రెండ్స్‌ అందరం కలసి ఓ కాఫీ తాగి, కాసేపు మౌనం పాటించి ఇంటికి వెళ్లిపోతాం.

సాక్షి: మీరు భయపడే విషయాలేవైనా ఉన్నాయా?
తేజ్‌: నాకు హారర్‌ సినిమాలంటే భయం. కాన్‌జ్యూరింగ్, ద ఎగ్జాసిస్ట్‌.. అవన్నీ నా వల్ల కాదు. దరిద్రం కాకపోతే... డబ్బులిచ్చి మరీ భయపడటం ఏంటండీ. జేమ్స్‌ కామెరూన్‌ డైరెక్ట్‌ చేస్తానన్నా నేను హారర్‌ సినిమాలు చేయను.  
రకుల్‌: తేజ్‌కి ఎంత భయమంటే.. మీరు హారర్‌ సినిమాల గురించి మాట్లాడితే రూమ్‌ నుంచి బయటకి వెళ్లిపోతాడు.

సాక్షి: ఫైనల్లీ... రకుల్‌కి ప్రపోజ్‌ చేయమంటే ఎలా చేస్తారు?
రకుల్‌: ప్లీజ్‌.. అలా చెయ్యొద్దు. నువ్వు ప్రపోజ్‌ చేస్తే నేను చచ్చిపోతా. (గట్టిగా నవ్వులు)
తేజ్‌: ప్లీజ్‌ గివ్‌ మి ఒన్‌ ఛాన్స్‌ రకుల్‌.

సాక్షి: రకుల్‌... ఒకవేళ మీరు ప్రపోజ్‌ చేయాలనుకుంటే?
రకుల్‌: దలమ్‌కా.. అస్సలు చేయను.
తేజ్‌:చేయవా.. చ్చచ్చచా! ప్రపోజ్‌ చేయడానికి కూడా పనికి రానా? అయితే నో ప్రాబ్లమ్‌..
రకుల్‌: ఓకే.. నో ప్రాబ్లమ్‌..
తేజ్‌: సరే.. ఇంకో ఇంటర్వ్యూ ఉంది.. నడువు..
రకుల్‌: వస్తున్నానోయ్‌..
తేజ్‌:రకుల్‌: బై బై అండి.

– డి.జి. భవాని

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement