ఒకరు మిస్‌... ఇంకొకరు యస్‌! | one miss...other yes! | Sakshi
Sakshi News home page

ఒకరు మిస్‌... ఇంకొకరు యస్‌!

Published Tue, Feb 21 2017 12:06 AM | Last Updated on Tue, Sep 5 2017 4:11 AM

ఒకరు మిస్‌... ఇంకొకరు యస్‌!

ఒకరు మిస్‌... ఇంకొకరు యస్‌!

చేతిదాకా వచ్చింది.. ఇక సెట్లోకి వెళ్లడమే ఆలస్యం... ఇంతలోనో ఏదో అయింది.. వచ్చిన ఛాన్స్‌ చేజారింది.. ఒకరికి ‘మిస్‌’ అయిన ఛాన్స్‌ ఇంకొకరికి వెళితే.. ‘యస్‌’ చెప్పకుండా ఉంటారా? చెప్పినవాళ్లు సెట్లోకి.. మిస్సయిన వాళ్లు వేరే సెట్లోకి.. ఇంతకీ ఎవరు ‘మిస్‌’ చేసుకున్నారు? ఎవరు ‘యస్‌’ చెప్పారు? రండి... తెలుసుకుందాం.

జస్ట్‌ మిస్‌!
అనూహ్యంగా తుపాన్‌ వస్తే ఢిల్లీ–హైదరాబాద్‌ ఫ్లైట్‌ మధ్యలో గోవాలోనే ల్యాండ్‌ అయినట్టు, అనుపమా పరమేశ్వన్‌ ముహూర్తం కూడా జరగక ముందు చరణ్‌–సుక్కు ఫ్లైట్‌ నుంచి కిందకు దిగారు. ఇప్పుడిప్పుడే తెలుగు తెరపై మెల్లగా అడుగులు వేయడం ప్రారంభించారు అనుపమ. ‘అ ఆ’, ‘ప్రేమమ్‌’, ‘శతమానం భవతి’... ఈ మలయాళ ముద్దుగుమ్మ ఇప్పటివరకూ తెలుగులో మూడు సినిమాలే చేసినా నటిగా మంచి గుర్తింపే వచ్చింది. అదే రామ్‌చరణ్‌ సినిమాలో ఛాన్స్‌ తెచ్చిపెట్టింది. సుకుమార్‌ దర్శకత్వంలో చరణ్‌ హీరోగా మైత్రీ మూవీస్‌ సంస్థ నిర్మించే సినిమాలో మొదట అనుపమను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇంకేముంది... అమ్మాయి ఎగిరి గంతేసింది.

అంతలోనే పెద్ద కుదుపు. ఆమెను తప్పించి, కథానాయికగా సమంతను తీసుకున్నారు. పారితోషకం విషయంలో బెట్టు చేయడంతోనే అనుపమను సినిమా నుంచి తొలగించారనే వార్తలొచ్చాయి. వాటిని నిర్మాణ సంస్థ ఖండించింది. కారణాలు ఏవైనా అనుపమకు ఓ స్టార్‌ పక్కన నటించే ఛాన్స్‌ దూరమైంది. ఆమె స్థానంలో చరణ్‌–సుక్కు ఫ్లైట్‌ ఎక్కిన సమంతకు హీరో, దర్శకుడు ఇద్దరితోనూ ఇదే మొదటి సినిమా. ఈ సినిమా మిస్సయిన అనుపమ ఫీలింగ్‌ ఎలా ఉందంటే, ‘అవకాశం చేజారవచ్చు.. బయటవాళ్లు అనుకుంటున్నట్లుగా యూనిట్‌ సభ్యులతో నాకేం పొరపొచ్ఛాలు లేవు. మేం ఫ్రెండ్లీగానే ఉన్నాం’’ అని క్లారిఫై చేశారామె.

జ్యోతిక తప్పుకుంటే నిత్యా ఒప్పుకున్నారు
నిత్యా మీనన్‌ ఓ చిత్రానికి సంతకం చేసారంటే... అందులో కచ్చితంగా కొత్తదనం ఉంటుందని ప్రేక్షకులు ఫిక్సవుతారు. లేదంటే కనీసం కుటుంబంతో కలసి చూసేలా ఉంటుందనుకుంటారు. రీ–ఎంట్రీ తర్వాత జ్యోతిక కూడా అచ్చంగా అటువంటి పేరే తెచ్చుకున్నారు. పెళ్లి తర్వాత నటనకు ఓ కామా పెట్టిన జ్యోతిక.. తన పిల్లలు కాస్త పెద్దవాళ్లయిన తర్వాత మళ్లీ సినిమాలు చేయాలనుకున్నప్పుడు... బోలెడంతమంది దర్శక, నిర్మాతలు ఆమెకు కథలు వినిపించారు.

తొందరపడి ఏదొకటి చేయకుండా ‘36 వయదినిలే’, ‘మగళిర్‌ మట్టుమ్‌’ వంటి లేడీ ఓరియెంటెడ్‌ సినిమాలతో విషయమున్న కథలకు ఓటేశారు జ్యోతిక. ఈ టైమ్‌లోనే అట్లీ దర్శకత్వంలో తమిళ హీరో విజయ్‌ చేస్తున్న సినిమాలో ముగ్గురు కథానాయికల్లో ఒకరిగా నటించమని జ్యోతికను సంప్రదించారు. అంతే కాదు... ఆమె నటిస్తున్నట్టు ప్రకటించారు. విజయ్‌–జ్యోతికలది హిట్‌ కాంబినేషన్‌. తమిళ ‘ఖుషి’తో పాటు ఈ ఇద్దరూ మరో సినిమా చేశారు. కట్‌ చేస్తే... వారంలోపే జ్యోతిక నటించడం లేదనే వార్త బయటకొచ్చింది. ఆ వెంటనే నిత్యా మీనన్‌కి పిలుపొచ్చింది. విజయ్‌ సినిమా కావడంతో నిత్యా మీనన్‌ కూడా చకచకా సంతకం చేశారు. జ్యోతిక ఎందుకు నటించనన్నారో.. నిత్యా ఎందుకు అంగీకరించారో... ఆ పాత్ర ప్రాముఖ్యత ఏంటో... సినిమా విడుదల తర్వాత తెలుస్తుంది.

క్లాష్‌.. క్లాష్‌...!
మామూలుగా దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ సినిమాలంటే హీరోయిన్లకు మంచి ప్రాముఖ్యం ఉంటుంది. అందుకే ఆయనతో సినిమా చేసే ఛాన్స్‌ ఎప్పుడొస్తుందా? అని కొంతమంది ఎదురు చూస్తారు. ఇక విలక్షణ నటుడు విక్రమ్‌ హీరోగా గౌతమ్‌ మీనన్‌ దర్శకత్వంలో సినిమా ఛాన్స్‌ అంటే.. డబుల్‌ ధమాకానే. ‘ధృవ నక్షత్రం’తో అనూ ఇమ్మాన్యుయేల్‌కి ఆ డబుల్‌ ధమాకా వచ్చింది. విక్రమ్‌తో ఆమె ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల చేశారు.

కానీ, అప్పటికే అంగీకరించిన సినిమాలతో ‘ధృవ నక్షత్రం’ షెడ్యూల్స్‌ క్లాష్‌ కావడంతో డేట్స్‌ అడ్జస్ట్‌ చేయలేక సినిమా నుంచి తప్పుకున్నారామె. అదే టైమ్‌లో ‘పెళ్లి చూపులు’లో నటించిన తెలుగమ్మాయి రీతూ వర్మ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ చూపుల్లో పడడం.. ఆమెను హీరోయిన్‌గా ఎంపిక చేయడం జరిగాయి. ఇందులో విక్రమ్, రీతూ వర్మలవి టిపికల్‌ హీరో హీరోయిన్‌ పాత్రలు కాదట. హాలీవుడ్‌ సై్టల్‌లో వాళ్ల క్యారెక్టర్‌లు డిఫరెంట్‌గా డిజైన్‌ చేశారట గౌతమ్‌ మీనన్‌. రీతూ వర్మకు తొలి భారీ చిత్రమిదే.

సెట్స్‌ని టచ్‌ చేయకుండానే...
ఓ అడుగు ముందుకు... మరో అడుగు వెనక్కి... కథానాయిక లావణ్యా త్రిపాఠి తీరిది. తెలుగులో తొలి సినిమా ‘అందాల రాక్షసి’తోనే ఈ ఉత్తరాది బ్యూటీ ప్రేక్షకుల మనసు దోచేశారు. ఆ తర్వాత కెరీర్‌లో కంటిన్యూ స్‌గా హిట్స్‌ పడ్డాయి. కానీ, ఎక్కువ సినిమాలు చేయడంలో ఇతర హీరోయిన్లతో పోలిస్తే... లావణ్యా త్రిపాఠి ఓ అడుగు వెనకే ఉన్నారు. తాజాగా రవితేజ ‘టచ్‌ చేసి చూడు’ ఛాన్స్‌ లావణ్య చేజారిందని ఫిల్మ్‌నగర్‌లో ఓ వార్త వినిపిస్తోంది.

విక్రమ్‌ సిరిని దర్శకునిగా పరిచయం చేస్తూ, నల్లమలుపు శ్రీనివాస్‌ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మిస్తున్న ‘టచ్‌ చేసి చూడు’లో రాశీఖన్నా, లావణ్యా త్రిపాఠిలను హీరోయిన్లుగా ఎంపిక చేశారు. ప్రస్తుతం రాశీఖన్నాతో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. షెడ్యూల్‌ ప్రకారం మరో కథానాయిక లావణ్యా త్రిపాఠి సీన్స్‌ ఏప్రిల్‌లో చిత్రీకరించడా నికి ప్లాన్‌ చేశారు. అప్పుడు లావణ్య చిత్రీకరణలో పాల్గొంటే  ఫిల్మ్‌నగర్‌ టాక్‌ నిజం కాదని అర్థం.

ఓ కథానాయిక స్థానంలో మరొకర్ని ఎంపిక చేయడం కొత్తేమీ కాదు. ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయి. రామ్‌చరణ్‌  ‘ఎవడు’లో ముందు సమంతను తీసుకుని, కొన్ని సీన్లు చిత్రీకరించారు. ఏమైందో ఏమో.. చివరకు, ఆమె స్థానంలో శ్రుతీహాసన్‌ నటించారు. ఇలా శ్రుతి ఖాతాలో ఓ సినిమా చేరితే.. మరో సినిమా చేజారింది. అదే ‘ఊపిరి’.

నాగార్జున, కార్తీ చేసిన ఈ చిత్రంలో ముందు శ్రుతీనే తీసుకున్నారు. నిర్మాతలతో ఏవో సమస్యలు రావడంతో శ్రుతీహాసన్‌ తప్పుకున్నారు. అప్పుడు తమన్నా ఆ సినిమాలో నటించారు. తమన్నా ఈ విధంగానే మరో తమిళ చిత్రంలో అవకాశం దక్కించుకున్నారు. అదే ‘పెళ్లి చూపులు’ రీమేక్‌. ఈ చిత్రానికి గౌతమ్‌ మీనన్‌ నిర్మాత. ముందు తెలుగులో నటించిన రీతూ వర్మనే తమిళ రీమేక్‌లోనూ తీసుకోవాలనుకున్నారు. చివరకు తమన్నాను ఎంపిక చేశారు. ఈ నిర్ణయం రీతూకి మంచి చేసింది. ఎలాగంటే.. ఈ సినిమాకి కేటాయించాలనుకున్న డేట్స్‌ను ఓ పెద్ద సినిమాకి ఇచ్చారు. అదే విక్రమ్‌–గౌతమ్‌ల  ‘ధృవ నక్షత్రం’.

కథానాయికలే కాదు... దర్శకులు, వాళ్ల కథలు కూడా ఓ హీరో నుంచి మరో హీరో దగ్గరికి వెళ్తుంటాయి. ఇదీ కొత్త విషయమేమీ కాదు. ప్రస్తుతం హీరోలు చేస్తున్న సినిమాలు కొన్నిటిని ఓ లుక్కేస్తే... ఎన్టీఆర్‌ 27వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టకముందు రవితేజ కోసం దర్శకుడు కె.ఎస్‌. రవీంద్ర (బాబీ) ఓ కథ సిద్ధం చేశారు. ఆ కథతోనే ఇప్పుడు ఎన్టీఆర్‌ సినిమా చేస్తున్నారా? లేక వేరే కథతోనా? అన్నది దర్శకుడే చెప్పాలి. రవితేజ నుంచి బాబీ.. ఎన్టీఆర్‌ దగ్గరికి వస్తే.. ఎన్టీఆర్‌ నుంచి దర్శకుడు అనిల్‌ రావిపూడి.. రవితేజ దగ్గరికి వెళ్లారు.

రవితేజ హీరోగా అనిల్‌ రావిపూడి తీస్తున్న ‘రాజా.. ద గ్రేట్‌’ కథ రామ్‌ నుంచి ఎన్టీఆర్, అక్కణ్ణుంచి రవితేజ దగ్గరకి వెళ్లింది. ఎన్టీఆర్‌ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకునిగా పరిచయం కావాలనుకున్నారు. ఆయన రెడీ చేసిన కథ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌లకు అంతగా నచ్చకపోవడంతో అల్లు అర్జున్‌ దగ్గరికి వెళ్లారు. ఇక, గౌతమ్‌ మీనన్‌ ‘ధృవ నక్షత్రం’లోనూ ముందు అనుకున్న హీరో విక్రమ్‌ కాదు.. సూర్య. కథలో సూర్య చాలా మార్పులు చెప్పడంతో గౌతమ్‌ చేయనని చెప్పేశారట. రెండేళ్ల తర్వాత విక్రమ్‌తో అదే కథతో సినిమా తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement