తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కుమార్తె సౌందర్య, విశాగన్ వనంగముడిల వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన విషయం తెలిసిందే. 2010లో అశ్విన్ అనే వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న సౌందర్య ఆ తర్వాత నాలుగేళ్లకు విడాకులు తీసుకోవడం, వీరికి వేద్ అనే ఓ కుమారుడు ఉన్న విషయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తన రెండో వివాహ సమయంలో జరిగిన ఆసక్తికర సంఘటనలను ఓ తమిళ మ్యాగజీన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పంచుకున్నారు సౌందర్య. ‘‘నా కుమారుడు వేద్‌కి ముందు విశాగన్ ఫొటో చూపించి.. ‘ఇదిగో మీ డాడీ’ అని చెప్పగానే సంబరపడిపోయాడు.
తొలిసారే వేద్‌కి విశాగన్ నచ్చేశారు. వేద్ విషయంలో విశాగన్‌కి ఓపిక ఎక్కువ. పెళ్లి మండపంలో కూర్చున్నపుడు ముహూర్తం టైమ్‌కి వేద్ మండపానికి రాకపోవడంతో టెన్షన్ పడ్డాను. వేద్ వచ్చేవరకూ నేను తాళి కట్టనని విశాగన్ అన్నారు. అంతేకాదు.. పెళ్లికి ముందు ‘మీ అమ్మను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా?’ అని వేద్ దగ్గర విశాగన్ అనుమతి కూడా తీసుకున్నారు. దాని తాలూకు వీడియో కూడా నా వద్ద ఉంది. కానీ, అది వేద్‌కి 18 ఏళ్లు వచ్చేవరకూ ఎవరికీ చూపించను. విశాగన్ వద్ద ఉంటే వేద్ సురక్షితంగా ఉంటాడనే నమ్మకం నాకుంది. నాక్కావాల్సింది కూడా అదే’’ అని పేర్కొన్నారు సౌందర్యా రజనీకాంత్.
Comments
Please login to add a commentAdd a comment