సుల్తాన్ వసూళ్లను అధిగమించిన పద్మావత్
సాక్షి, న్యూఢిల్లీ : దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్‌ల అభినయంతో సంజయ్ లీలా భన్సాలీ చెక్కిన చారిత్రక దృశ్య కావ్యం పద్మావత్ వసూళ్ల పరంగానూ రికార్డులు సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద రూ 300 కోట్ల మార్క్ దాటిన పద్మావత్ అత్యధిక గ్రాస్ కలెక్ట్ చేసిన ఆరవ చిత్రంగా నిలిచింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ 301 కోట్లు కలెక్ట్ చేసిన పద్మావత్ సల్మాన్ ఖాన్ నటించిన సుల్తాన్ లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించిందని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ రమేష్ లాలా తెలిపారు. 52 రోజుల పద్మావత్ ఆలిండియా వసూళ్లు రూ 301 కోట్లతో సుల్తాన్ లైఫ్‌టైమ్ వసూళ్ల (రూ 300.45 కోట్లు)ను అధిగమించి దేశంలో ఆల్‌టైం టాప్ 6 హిందీ మూవీగా నిలిచిందని ఆయన ట్వీట్ చేశారు.
అత్యధిక గ్రాస్ వసూళ్లు రాబట్టిన చిత్రంగా బాహుబలి -2, దంగల్, సీక్రెట్ సూపర్‌స్టార్, పీకే, భజరంగి భాయ్‌జాన్ చిత్రాల తర్వాతి స్ధానాన్ని పద్మావత్ దక్కించుకుంది. దేశ చరిత్రకు సంబందించిన కథాంశానికి ఇంతటి ఆదరణ లభించడం పట్ల మూవీలో నటించిన రణ్‌వీర్‌సింగ్ హర్షం వ్యక్తం చేశారు. బాలీవుడ్‌లోనే కాక ప్రపంచవ్యాప్తంగా సినిమాకు దక్కిన ప్రశంసలు, వసూళ్లు ఎంతో సంతృప్తి కలిగించాయని ఇదే తన తొలి రూ 300 కోట్ల మూవీ అని పేర్కొన్నారు. పద్మావత్ మూవీ ఆ రకంగా తనకు ఎంతో ప్రత్యేకమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment