బాలయ్య డబ్బులిచ్చి సినిమాలు ఆడించలేదు
– మోహన్‌బాబు
‘‘బాలయ్య ఒక చరిత్ర సృష్టించాడు. సిల్వర్‌జూబ్లీ, గోల్డెన్‌జూబ్లీ రికార్డులు క్రియేట్ చేశాడు. ఇది నిజం... డబ్బులు ఇచ్చి సినిమాలు ఆడించలేదు’’ అని మంచు మోహన్‌బాబు అన్నారు. బాలకృష్ణ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వి. ఆనందప్రసాద్ నిర్మించిన సినిమా ‘పైసా వసూల్’. అనూప్ రూబెన్స్ స్వరకర్త. ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఆడియో సెలబ్రేషన్స్ జరిగాయి.
మోహన్‌బాబు మాట్లాడుతూ– ‘‘ప్రపంచం గర్వించదగ్గ మహానటుడు మా అన్నయ్య ఎన్టీఆర్. ఆయన కుమారుడు బాలయ్య ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా నన్ను పిలవడంతో చెన్నై వెళ్లాల్సి ఉన్నా... ఇది నా ఇంటి ఫంక్షన్ కాబట్టి వచ్చా. ‘పైసా వసూల్’ 101కోట్ల కంటే ఎక్కువ వసూలు చేయాలి’’ అన్నారు. బాలకృష్ణ మాట్లాడుతూ– ‘‘నాకు మోహన్‌బాబుగారితో చనువు ఎక్కువ. ఆయన్ను తరచూ కలుస్తుంటా. నేనెక్కువగా కథలు, సినిమాల గురించి ఆలోచించను. నాకు, పూరీకి మధ్య ఈ కథ గురించి ఎక్కువ డిస్కషన్ జరగలేదు. చేసేద్దామనుకుని మొదలుపెట్టాం. మా ఇద్దరికీ పని తప్ప వేరే ఆలోచన లేదు.
నిర్మాత బాగుండాలన్నదే మా తపన. అభిమానులు, ప్రేక్షకులు నా నుంచి ఆశించే అన్ని హంగులూ ఉన్న చిత్రమిది’’ అన్నారు. ‘‘బాలయ్య బాబుతో సినిమా చేయాలనే కోరిక ఈ ‘పైసా వసూల్’తో తీరింది. ఆయనతో మరెన్నో సినిమాలు చేసే ఛాన్స్ ఇస్తారని ఆశిస్తున్నా. చెన్నైలో స్టంట్ మాస్టర్ అసోసియేషన్ 50 వసంతాల సభకు బాలయ్య బాబు, మంచు విష్ణుగారు హాజరయ్యారు. వాళ్ల నాన్నగారి బయోపిక్ గురించి అక్కడి వారితో కొంత డిస్కస్ చేశారు. బాలయ్యబాబు 101వ సినిమా సందర్భంగా ఆయన అభిమానుల్లో 101మంది మెరిట్ స్టూడెంట్స్‌కు రూ. పదివేల చొప్పున అందజేయాలని అనుకుంటున్నాం.
సెప్టెంబర్ 1న పూరీగారు పండగ తీసుకొస్తున్నారు’’ అన్నారు నిర్మాత. ‘‘నా లైఫ్‌లో... ‘లైట్ పోతుంది, త్వరగా షాట్ తీద్దాం రండి’ అని అందర్నీ పిలిచి కెమెరా ముందుకెళ్లి నిలబడిన ఏకైక హీరో బాలకృష్ణగారు.‘నిర్మాతల డబ్బు వృథా కాకూడదు’ అని ఫీలయ్యే వ్యక్తి. ఇలాంటి హీరోను నేనిప్పటివరకు చూడలేదు. ఆయన క్రమశిక్షణ, అంకితభావం అమేజింగ్. సేమ్ డెడికేషన్ ఇంతకు ముందు మోహన్‌బాబు గారిలో చూశా’’ అన్నారు పూరి. దర్శకుడు ఎ. కోదండరామిరెడ్డి, నాయికలు శ్రియ, కైరా దత్, ముస్కాన్, నటుడు అలీ, ఎగ్జిక్యూటివ్ నిర్మాత అన్నే రవి, లైన్ ప్రొడ్యూసర్ చార్మీ కౌర్, పాటల రచయితలు భాస్కరభట్ల, పులగం చిన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.