‘పందెం కోడి 2‌’ మూవీ రివ్యూ | Pandem Kodi 2 Telugu Movie Review | Sakshi
Sakshi News home page

Published Thu, Oct 18 2018 4:16 PM | Last Updated on Thu, Oct 18 2018 4:30 PM

Pandem Kodi 2 Telugu Movie Review - Sakshi

టైటిల్ : పందెం కోడి 2‌
జానర్ : యాక్షన్ డ్రామా
తారాగణం : విశాల్‌, కీర్తి సురేష్‌, రాజ్‌ కిరణ్‌, వరలక్ష్మీ శరత్‌కుమార్‌
సంగీతం : యువన్‌ శంకర్‌ రాజా
దర్శకత్వం : లింగుసామి
నిర్మాత : విశాల్‌

కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్న విశాల్, ఈ సారి ఓ సీక్వెల్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 2005లో రిలీజ్‌ అయి తెలుగులో కూడా మంచి విజయం సాధించిన పందెంకోడి సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన పందెం కోడి 2తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. 13 ఏళ్ల తరువాత తెరకెక్కిన ఈ మాస్‌ యాక్షన్‌ సీక్వెల్‌ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంది..? విశాల్‌ నటిస్తూ నిర్మించిన పందెంకోడి 2తో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడా..?

కథ ;
రాజా రెడ్డి (రాజ్‌ కిరణ్‌) కడప జిల్లాలోని ఎన్నో గ్రామాలను తన కంటి చూపుతో శాసించే పెద్ద మనిషి. ఏడేళ్ల క్రితం వీరభద్ర స్వామి జాతరలో జరిగిన గొడవలో భవానీ(వరలక్ష్మీ శరత్‌ కుమార్‌) భర్త హత్యకు గురవుతాడు. తన భర్తను చంపిన వారి కుటుంబంలో అందరినీ చంపేసిన భవానీ మనుషులు రాజా రెడ్డి అడ్డుపడటంతో గోపి అనే కుర్రాన్ని మాత్రం చంపలేకపోతారు. అందుకే ఆ కుర్రాన్ని కూడా జాతరలోనే చంపి పగ తీర్చుకోవాలని ఎదురుచూస్తుంటుంది భవానీ.

ఏడేళ్లుగా జాతర చేయకపొవటంతో ఊళ్లల్లో కరువు తాండవిస్తుంది. దీంతో ఈ సారి ఎలాగైనా జాతర చేయాలని అన్ని ఊళ్ల పెద్దలను ఒప్పించి జాతర పనులు మొదలు పెడతాడు రాజా రెడ్డి. ఏడేళ్లుగా ఈ గొడవలకు దూరంగా ఉన్న రాజా రెడ్డి కొడుకు.. బాలు(విశాల్) కూడా జాతర కోసం ఊరికి వస్తాడు. జాతర మొదలైన నాలుగో రోజు గోపిని కాపాడే ప్రయత్నాల్లో రాజారెడ్డి గాయపడతాడు.



ఈ విషయం ఊరి ప్రజలకు తెలిస్తే ఒక్కరిని కూడా బతకనివ్వరని భయంతో ఊళ్లో జనాలకు రాజా రెడ్డి మీద దాడి జరిగిన విషయాన్ని చెప్పుకుండా దాచిపెట్టి జాతర ఆగకుండా జాగ్రత్త పడతాడు బాలు. జాతర పూర్తయ్యే వరకు బాలు అసలు విషయం ఊరి ప్రజలకు తెలియకుండా ఆపగలిగాడా..? రాజా రెడ్డి మాట ఇచ్చినట్టుగా బాలు, గోపి ప్రాణాన్ని కాపాడాడా..? అనుకున్నట్టుగా జాతర సజావుగా జరిగిందా..? చివరకు భవానీ కథ ఎలా ముగిసింది..? అన్నదే మిగతా కథ.

నటీనటులు ;
విశాల్‌ మరోసారి తనదైన మాస్‌ యాక్షన్‌తో మెప్పించాడు. పందెం కోడి తొలి భాగంతో పోలిస్తే ఈ సినిమాలో విశాల్ నటన, యాక్షన్‌ అన్ని సూపర్బ్‌ అనిపిస్తాయి. ముఖ్యంగా సెకండ్‌ హాఫ్‌లో వచ్చే ఎమోషనల్‌ సీన్స్‌లో విశాల్ నటన ఆకట్టుకుంది. హీరోయిన్‌గా కీర్తి సురేష్‌కు మరో మంచి పాత్ర దక్కింది. తను గతంలో చేయని డిఫరెంట్ క్యారెక్టర్‌లో కీర్తి ఆకట్టుకుంది. క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆడియన్స్‌ను అలరించింది.



రాజా రెడ్డి పాత్రలో రాజ్‌కిరణ్ ఒదిగిపోయారు. ఆయన లుక్‌, బాడీ లాంగ్వేజ్‌ ఆ పాత్రకు మరింత హుందాతనం తీసుకువచ్చాయి. నెగెటివ్‌ రోల్‌ వరలక్ష్మీ నటన సూపర్బ్‌. వరలక్ష్మీ లుక్‌, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ కూడా సినిమాకు ప్లస్‌ అయ్యాయి. ఇతర నటీనటులంతా తమిళ వారే కావటంతో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ కావటం కాస్త కష్టమే.

విశ్లేషణ :
2005లో పందెం కోడి సినిమాతో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్న లింగుస్వామి సీక్వెల్‌ లో కాస్త తడబడ్డాడు. మరీ అవుట్‌ డేటెడ్‌ కథా కథనాలతో ఆడియన్స్‌ ముందుకు వచ్చాడు. తెలుగులో ఈ తరహా ఫ్యాక్షన్‌ కథలు గతంలో చాలానే వచ్చాయి. అయితే విశాల్‌ ఇమేజ్‌, బాడీ లాంగ్వేజ్‌ సినిమాకు ప్లస్‌ అయ్యాయి. సినిమా అంతా కేవలం వారం రోజులు పాటు జరిగే ఓ జాతరకు సంబంధించిన కథ కావటంతో చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగిన ఫీలింగ్‌ కలుగుతుంది. విశాల్‌, కీర్తి సురేష్ మధ్య వచ్చే రొమాంటిక్‌ సీన్స్‌ అలరిస్తాయి.



యువన్‌ శంకర్‌ రాజా సంగీతం ఆశించిన స్థాయిలో లేకపోవటం నిరాశపరిచే అంశమే. కేఏ శక్తివేల్ సినిమాటోగ్రఫి సినిమాకు పెద్ద ఎసెట్. జాతర వాతావరణాన్ని, యాక్షన్‌ ఎపిసోడ్స్‌ను అద్భుతంగా తెరమీద చూపించారు. ఎడిటింగ్‌, ఆర్ట్‌ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. విశాల్‌ నిర్మాతగానూ మంచి మార్కులు సాధించాడు. సినిమా అంతా జాతర వాతావరణంలో చిత్రీకరించటం అంటే మామూలు విషయం కాదు. ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. విశాల్‌ ఏ మాత్రం ఖర్చుకు వెనకాడకుండా భారీ బడ్జెట్‌తో సినిమాను రూపొందించాడు.


  
ప్లస్‌ పాయింట్స్‌ ;
విశాల్ నటన
యాక్షన్‌ ఎపిసోడ్స్‌
నిర్మాణ విలువలు

మైనస్‌ పాయింట్స్‌ ;
రొటీన్‌ స్టోరి
నేటివిటి
సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సీన్స్‌
సం‍గీతం

సతీష్‌ రెడ్డి జడ్డా, ఇంటర్‌నెట్‌ డెస్క్‌.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement