పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ పెట్టాలి: రాంగోపాల్ వర్మ
కాటం రాయుడా కదిరి నరసింహుడా అంటూ సోషల్ మీడియాలో కిర్రాక్ పుట్టిస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ప్రముఖ దర్శకుడు రాం గోపాల్ వర్మ క్రేజి వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ సొంతంగా ఓ రాజకీయ పార్టీ ప్రారంభించవచ్చని రాంగోపాల్ వర్మ సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో ట్వీట్ చేశాడు. అంతేకాక మాటల జోరు పెంచి ఇప్పటి వరకు రాజకీయ నేతలుగా మారిన నటులు ఎంజీఆర్ నుంచి చిరంజీవిలలో పవన్ కళ్యాణ్ డైనమిక్ లీడర్ అని ప్రశంసలతో ముంచెత్తారు.
'ఇప్పటి వరకు తాను నా జీవితంలో ఎప్పుడు ఓటు వెయ్యలేదని.. పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని ప్రారంభిస్తే ఓటు వేస్తాను అనే మాటకు కట్టుబడి ఉంటాను. పవన్ కళ్యాణ్ కు తన ఓటు అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం పవర్ స్టార్ కు ఓటు వేసేందుకు చాలా మంది ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ లో ఆలోచనల్లో నిజాయితీ, కళ్లలో పట్టుదల. చరిష్మా, ఇంటెన్సిటిలను బాల్ థాకరేలో కూడా చూడలేదు. ప్రజారాజ్యం పార్టీకి పవన్ కళ్యాణ్ సారథ్యం వహించి ఉంటే అఖండ మెజారిటీని సాధించి ఉండేదని తన ప్రగాఢ విశ్వాసం' అని రాంగోపాల్ వర్మ వ్యాఖ్యలు చేశారు. ఇంకా తాను పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి చేసిన వ్యాఖ్యలు కాదని.. తాను పవన్ ను కలిసి ఐదు సంవత్సరాలైందన్నాడు. ఓ డైరెక్టర్ గా కాకుండా ఓ ఆంధ్ర ప్రదేశ్ పౌరుడిగా స్పందించానని వర్మ తెలిపాడు. అంతేకాక చిరంజీవికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు కాదని.. పవన్ కళ్యాణ్ కు అనుకూలంగా చేసినవేనని వివరణ ఇచ్చాడు.
ఈ రేంజ్ లో పవన్ కళ్యాణ్ ఎత్తుకోవడం వెనుక కారణాలేమై ఉంటాయని పవర్ స్టార్ అభిమానులు, సినీ అభిమానులు ఆలోచనల్లో పడ్డారు. ఏమైనా రాంగోపాల్ తన వ్యాఖ్యలతో మీడియాలో కాక పుట్టించడం ఖాయం.