ఉగ్రదాడులతో మాకు లింకేంటి: నటి
దాయాది దేశాల మధ్య జరుగుతున్న ఉగ్రవాద పోరు వల్ల పాకిస్తాన్ ఆర్టిస్టులు తీవ్రంగా నష్టపోతున్నారని బాలీవుడ్ నటి స్వర భాస్కర్ అంటోంది. భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో అల్లకల్లోల పరిస్థితులు కుదుటపడే వరకూ పాక్ ఆర్టిస్టులపై భారత్ లో తాత్కాలికంగా నిషేధం విధించగా.. బాలీవుడ్ కు చెందిన కొందరు ఈ విషయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాగ్రాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తాను నటించిన 'నిల్ బట్టే సన్నాటా' మూవీకిగానూ ఉత్తమనటిగా అవార్డు అందుకుంది. ఈ సందర్భంగా పాక్ ఆర్టిస్టుల ప్రస్తుత పరిస్థితిపై నోరువిప్పింది. మా నటీనటులకు రాజకీయాలతోగానీ, ఉగ్రదాడులతోగానీ ఎలాంటి సంబంధం లేదని, అయినా వారిని ఇందులోకి లాగుతున్నారని ఆమె పేర్కొంది.
నిజం చెప్పాలంటే.. పాక్ కు చెందిన ఆర్టిస్టుల పరిస్థితి దారుణమని అభిప్రాయపడింది. కొన్ని నెలల కిందట పాక్ బెస్ట్ సింగర్లలో ఒకరైన అంజాద్ సాబ్రిని ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసింది. పాకిస్తాన్ ప్రజలు కూడా ఉగ్రవాదం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గతంలో రెండుసార్లు దాయాది దేశంలో పర్యటించిన స్వర భాస్కర్ తెలిపింది. పాక్ నటుడు ఫవాద్ ఖాన్ ఎక్కువగా విమర్శలపాలయ్యాడని చెప్పింది. ఇటీవల ఉడీలో ఉగ్రదాడి చేసి 19 మంది భారతీయ జవాన్లను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారని ఈ ఘటనను ఆమె తీవ్రంగా ఖండించింది. పీఓకేలో భారత ఆర్మీ పటిష్టమైన సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి 38 మంది ఉగ్రవాదులను హతం చేశారు. ఈ నేపథ్యంలో పాక్ నటులకు ఎలాంటి హానీ జరగకూడదని భావించిన భారతీయ సినీ ఇండస్ట్రీ పెద్దలు వారిపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.