మా ఊరే బృందావనం | Personal touch interview with Giribabu | Sakshi
Sakshi News home page

అక్కడన్నీ నాటకాలే.. అందుకే ఊరికొస్తా

Published Sun, Aug 13 2017 6:55 AM | Last Updated on Mon, Aug 20 2018 6:18 PM

మా ఊరే బృందావనం - Sakshi

మా ఊరే బృందావనం

ఆకు రౌడీగా.. విలన్‌గా.. గూండాగా.. తండ్రిగా.. స్నేహితుడిగా.. ఇలా వెండితెరపై విలక్షణ పాత్రలు పోషించి సినీ అభిమానులను మెప్పించారు ప్రముఖ నటుడు గిరిబాబు. మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన.. మెగాఫోన్‌ చేతపట్టి మరో మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. వందల సినిమాల్లో తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించిన గిరిబాబు సొంతూరు కొరిశపాడు మండలం రావినూతల. అసలు పేరు యర్రా శేషగిరిరావు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన గిరిబాబు.. ‘మా ఊరే నాకు బృందావనం’ అంటున్నారు. తన చిన్ననాటి సంగతులు, మధుర స్మృతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. – అద్దంకి

- పల్లెటూరిలో పుట్టడం నా అదృష్టం
- ఇప్పటికీ జొన్న సంగటి, చింతకాయ పచ్చడి తింటా
- కోతికొమ్మచ్చి, బెచ్చాలాట ఆడే ఆ రోజులే వేరు
- ‘సాక్షి’తో సినీ నటుడు గిరిబాబు


మా ఊరు రావినూతల జిల్లాలో ఒక ఆదర్శ గ్రామంగా పేరుగాంచింది. నా బాల్యం నుంచి 29వ ఏట వరకు ఊర్లోనే ఉన్నా. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం రావడంతో మద్రాసు వెళ్లా. ఎందరో గొప్ప గొప్ప నటులతో నటించా. అదంతా మీకు తెలిసిందే. ఎంత పెద్ద నగరాల్లో ఉన్నా.. నాకు, నా కుటుంబ సభ్యులకు స్వగ్రామంపై మమకారం ఎక్కువ. వీలుదొరికినప్పుడల్లా ఊరికి వచ్చి స్నేహితులతో, బంధువులతో గడుపుతా. రాజకీయం, సినీ రంగం ఒక తాను ముక్కలే. ఈ రెండు రంగాల్లో ఎప్పుడూ స్వార్థంతో పరుగులు తీయడమే సరిపోతుంది. నిజమైన బంధాలు అక్కడ ఉండవు. అక్కడన్నీ నాటకాలే.


నిజమైన బంధాన్ని పంచే స్నేహితులు, ఆత్మీయుల కోసం సొంత ఊరు వచ్చి అనుభూతులు మూటగట్టుకుని వెళ్తుంటా. గ్రామంలో ఎవరింట శుభకార్యం జరిగినా పిలుస్తారు, అందరిళ్లకూ వెళ్తా. అదే వారికీ నాకు ఉన్న అనుబంధం. నాకు జన్మనిచ్చిన భూమి మీద ప్రేమ ఎక్కువ. గ్రామస్తులందరి సహకారంతో మౌలిక వసతులు ఏర్పాటు చేసుకున్నాం.

అందరూ వేసవి సెలవులుకు బృందావనం, ఊటీ, కొడైకెనాల్‌ వెళ్తుంటారు. మాకు మాత్రం మా సొంతూరే బృందావనం, ఊటీ, కొడైకెనాల్‌. ఏటా 20 రోజులపాటు కుటుంబ సమేతంగా ఊరికి వచ్చి ఉంటా. గతంలో అయితే మే నెల నుంచి జూన్‌ 10వ తేదీ వరకు ఇక్కడే ఉండేవాణ్ని. నా జీవితంలో సినిమా ఆవకాశం దక్కడం, చిత్ర పరిశ్రమలో నిరంతరం అవకాశాలు రావడం ఎప్పటికీ మరిచిపోలేను. మా అమ్మ, నా భార్య మరణం నా జీవితంలో విషాధకర సంఘటనలు.

సంగటి, చింతకాయ పచ్చడి.. ఆ రుచే వేరు
అప్పట్లో వరి అన్నం లేదు. రాత్రి సమయంలో వరిగ అన్నం, పప్పుచారు, ఉదయం జొన్న సంగటి, సజ్జ సంగటి తినేవాళ్లం. సంగటి, చింతకాయ పచ్చడి తింటే ఆ రుచే వేరు. పండుగలకు సోమి బువ్వ, ఆబువ్వ(వరి అన్నం) వండేవాళ్లు. నేను ఇప్పటికీ మా ఇంట్లో జొన్న సంగటి, చింతకాయ పచ్చడి తింటాం. మా ఊరిలో వండే పకోడీలు, అరిసెలు, గారెలు, పులి బొంగరాలు అంటే ఎంతో ఇష్టం. ఏటా 40 కేజీల చింత తొక్కు పెట్టించి హైదరాబాద్‌ తీసుకెళ్తా. చింతకాయ తొక్కు కోసం నా సహ నటులు ఎçప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. అందరికీ పెడతాం.

అప్పుడీ హోటళ్లు, టిఫిన్లు లేవు
మా ఊరికి వస్తే చాలు.. బాల్యం, అప్పుడు ఆడుకున్న ఆటలు, స్నేహితులతో చేసిన అల్లరి అన్నీ గుర్తొస్తాయి. పల్లెటూరులో పుట్టడం నా అదృష్టం. పల్టెటూరి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మిత్రులతో కలిసి కోతికొమ్మచ్చి, బెచ్చాల ఆట, బొంగరాలాట ఆడుకునేవాణ్ని. నాటి సంగతులను ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటా. పట్టణంలో పెరిగిన వారికన్నా గ్రామాల్లో పెరిగిన వారు చాలా అదృష్ణవంతులు. దాదాపు ఏ వస్తువూ కొనుక్కునే పనిలేదు.

బడి సెలవు రోజుల్లో పొలాలకు వెళ్లి తాటిచెట్లు ఎక్కి కాయలు కోసి తినేవాళ్లం. జెముడు కాయలు(నాగజెముడు కాయలు) భలే ఉండేవి. బాల్యం అంతా సరదా సరదాగా ఉండేది. అప్పుడీ హోటళ్లు, టిఫిన్లు లేవు. కలుషితం కాని, ప్రకృతి ప్రసాదించిన రకరకాల పళ్లను హాయిగా తినేవాళ్లం. నా చిన్న తనంలో పెళ్లిళ్లు ఐదు రోజులు జరిగేవి. పెళ్లి రోజుల్లో చేసే పనులకు ఒక అర్థం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది.

డిటెక్టివ్‌ నవలలు చదివేవాడిని..
ఖాళీ సమయాల్లో టీవీలో పాత సినిమాలు చూస్తుంటా. పుస్తకాలు, పేపర్లు చదువుతా. విశ్వనాథ సత్యనారాయణ అంటే చాలా ఇష్టం. ఆయన రాసిన సాహిత్యం నవలలు ఇష్టంగా చదువుతా. అప్పట్లో డిటెక్టివ్‌ నవలలు బాగా చదివేవాడిని. రామాయణ, మహాభారత, భాగవతాలు, చరిత్ర, పురాణాలు అంటే ఇష్టం. బీరువా నిండా పుస్తకాలున్నాయి. వెండి తెరపై దాదాపు అన్ని పాత్రల్లో నటించా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement