Giri Babu
-
గిరి గీసుకోలేదు
అవును... గిరి బాబు దేనికీ గిరి గీసుకోలేదు. ఆయన పేరు గిరి బాబు అయినా...ఫలానా పాత్రలే చేయాలని ఎప్పుడూ గిరి గీసుకుని కూర్చోలేదు. గిరిలోనే ఉండిపోలేదు. ఏ పాత్ర చేసినా న్యాయం చేశాడు. ఇన్నేళ్లు వచ్చినా... ఇంకా మనమడిని హీరోగా పెట్టి సినిమా తీస్తా అంటున్నాడు. సంతోషంగా ఉన్నాను... అందరినీ సంతోషంగా ఉంచుతాను... అంటున్న ఈ అజాత శత్రువుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. ► 76 ఏళ్ల జీవితంలో నటుడిగా దాదాపు అర్ధశతాబ్దం పూర్తి చేసుకున్నారు. మీ తొలి అవకాశాన్ని గుర్తు చేసుకుంటారా? మేం నాటకాలు వేస్తున్న సమయంలో ‘ఫలానా సినిమాకి కొత్తవాళ్లు కావాలి’ అనే ప్రకటన చూసి, నా ఫోటోలు పంపించాను. అదృష్టం తలుపు తట్టిన రోజు అదే అని ఇప్పటికీ అనుకుంటాను. ఇండస్ట్రీలో నాకు గాడ్ ఫాదర్లేరు, ఎవరితోనూ పరిచయాలు లేవు. కాస్తో కూస్తో అందంగా ఉంటాను. కొంచెం నటన మీద అవగాహన ఉంది. ఆ నమ్మకంతో ఫొటోలు పంపించాను. కబురు పంపితే ఏదో మొండి ధైర్యంతో మద్రాసు వెళ్లాను. వాళ్లు స్క్రీన్ టెస్ట్ చేసి ‘మా సినిమాలో నువ్వే హీరో’ అన్నారు. ► హీరోగా చేయాలనే ఇండస్ట్రీలోకి వచ్చారా? నేనే కాదు, ఇండస్ట్రీలోకి రావాలనుకునేవారందరూ హీరోగానే చేయాలనుకుంటారు. నేను నాటకాలన్నీ హీరోగానే చేశాను. మద్రాసులో స్క్రీన్ టెస్ట్ చేసి, నువ్వే హీరో అన్నారు. అయితే నా మొదటి సినిమా ‘ధైర్యే సాహసే లక్ష్మీ’ పూర్తి కాలేదు. ఆ తర్వాత ‘తప్పటడుగులు’ కమిట్ అయ్యాను. అదీ ఆగిపోయింది. మూడో సినిమా ‘స్వర్గానికి నిచ్చెనలు’ ఆరు రీళ్లు తీశాక ఆపేశారు. ఫైనల్లీ 1973లో ‘జగమే మాయ’ సినిమా ద్వారా హీరోగా ఫస్ట్ టైమ్ స్క్రీన్ మీద కనిపించాను. ► మూడు సినిమాలు ఆగిపోతే ఎలా తట్టుకున్నారు? తిరిగి ఇంటికి వెళ్లలేను. ఎందుకంటే అప్పటికే ఆ మూడు సినిమాల గురించి పేపర్లో ప్రకటన వచ్చింది. మా ఊళ్లో (రావినూతల) అందరికీ తెలిసిపోయింది. ఏమీ సాధించకుండా వెనక్కి తిరిగి వెళితే అవమానం. దాంతో మద్రాసులోనే ఆగిపోయాను. అప్పటికి నాకు పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. అమ్మానాన్న, భార్యాపిల్లలను ఊళ్లో వదిలిపెట్టి నేనొక్కడినే వెళ్లాను. చిన్న చిన్న పిల్లల్ని వదిలి ఉండటం అంటే చాలా బాధ అనిపించేది. అలాగని ఖాళీగా కూర్చోలేదు. నాటకాలు వేసేవాడిని. ఏంటిది? అంటూ చాలా వర్రీ అయ్యాను. అయితే 1973లో బ్రేక్ వచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసే పని లేకుండా అయిపోయింది. ► మూడు సినిమాలు ఆగినా ధైర్యం కూడదీసుకున్నారు. ప్రస్తుతం యువతకు అంత ఓపిక, ధైర్యం ఉండటం లేదు... ‘ఇది నా (వి)చిత్ర కథ’ అనే పుస్తకం’లో దీని గురించి మొత్తం రాశాను. ప్రయత్నించకుండా మానేయడం తప్పు. నిరాశతో జీవితాన్నే ముగించేయడం తప్పు. మనకెదురైన చేదు అనుభవాలు, గడ్డు పరిస్థితులను దాటాలి. సినిమాల్లో నిలదొక్కుకున్నాక ఎలా ఉండాలి?.. ఇలా ఆ పుస్తకంలో చాలా విషయాలు ప్రస్తావించాను. విజయానికి కావల్సిందే ఓపిక. నేను ఓపిక పట్టకుండా వెనక్కి వెళ్లిపోయి ఉంటే 600 సినిమాలు చేసి ఉండేవాడిని కాదు. నా ఫస్ట్ సినిమా ‘జగమే మాయ’ షూటింగ్ పూర్తికాక ముందే 7 సినిమాలు వచ్చాయి. ► 7 సినిమాల్లోనూ హీరోగానే చేశారా? కాదు. ఒక రెండింట్లో హీరోగా చేశాను. మరో దాంట్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, ఇంకో సినిమాలో విలన్‌గా చేశాను. ► హీరో అవాలని వచ్చారు. విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా చేశారు. మరి.. లైఫ్‌లో విజయం సాధించాననే అనుకుంటున్నారా? డెఫినెట్‌గా సక్సెస్ అయ్యాను. హీరోగా చేశాను. కామెడీ, సీరియస్, జానపదాలు, విలన్‌గా అన్నీ చేశాను. ఇప్పటికీ తాత, తండ్రి వేషాలు వేస్తున్నాను. అన్ని రకాల జానర్లు, అన్ని రకాల పాత్రలు చేశాను. నేను నిర్మాతగా, దర్శకుడిగా చేసిన సినిమాలు కూడా సక్సెస్ అయ్యాయి. నటుడిగా నవరసాలు పోషించే అవకాశం వచ్చింది. హీరోగా చేసుంటే కొన్ని పాత్రలకే పరిమితం అయ్యుండేవాడినేమో. అన్ని రకాల పాత్రలు చేయగలగడం వల్ల పరిపూర్ణమైన నటుడు అనే సంతృప్తి ఉంది. ► 600 సినిమాలు.. 46 ఏళ్లుగా నటిస్తున్నారు. రెస్ట్ తీసుకోవాలని అనిపించడం లేదా? మా వృత్తే అది. ఇక వేరే పని తెలియుదు. సినిమాల్లో యాక్ట్ చేయడం, సినిమాలు తీయడమే పని. నేను రైతు బిడ్డని. వ్యవసాయం మీద మోజు ఉన్నా సరే ఈ వయసులో చేయలేను. ఇప్పుడు మళ్లీ స్వగ్రామంలో వ్యవసాయం అంటే సాధ్యమయ్యే పని కూడా కాదు. వేరే వ్యాపారం చేయలేం. ఓపిక ఉన్నంత కాలం సినిమాలే. 46 ఏళ్లుగా సినిమాలకు అంకితమైపోయాను. రోజూ సెట్లో కూర్చుని అందరితో సరదాగా మాట్లాడటం, నటించడం చాలా సంతృప్తిగా ఉంటుంది. సడన్‌గా వేషాలు లేవంటే ఇంట్లో కూర్చుని టీవీలు చూసుకోవడం, పేపర్లు చదువుకోవడమే. సినిమాల్లో ఇంత కాలం నటించిన తర్వాత కచ్చితంగా కీర్తి కండూతి ఉంటుంది. ఒకవేళ సినిమాలు మానేస్తే ప్రజలు మరచిపోతారేమో అని భయం. ఎక్కడికెళ్లినా గుర్తు పట్టి ఆప్యాయమైన పలకరింపులు, ఫొటోలు అడగడాలు, చేసిన సినిమాల గురించి మాట్లాడడాలు... వీటికి అలవాటు పడిపోయి ఒక్కసారిగా ఇవన్నీ లేకపోతే? ఒక్క ఏడాది సినిమాలు చేయకపోయినా మరచిపోతారు. ఆ భయంతో ఇంకా సినిమాలు చేస్తున్నాను.(నవ్వు) ► చాలా ఫ్రాంక్‌గా చెప్పారు. అయితే ఈ వయసులో అంత టెన్షన్ అవసరమంటారా? నాకు తెలిసి ఏ కళాకారుడూ మరుగున పడాలనుకోడు. అలవాటు పడిన తర్వాత అది లేకపోతే బతకలేరు. అది వాస్తవం. అందుకే టెన్షన్ తప్పదు. ► ఈ పాత్ర బాగా చేయలేదు అనుకున్న సందర్భాలు ఏమైనా? ఒకదశలో విలన్‌గా ఒకేరకమైన పాత్రలు చేశారు. మూసలో పడిపోయామనుకోలేదా? బాగా చేయలేదని అనిపించలేదు. గిరిబాబు ఏ పాత్ర చేసినా న్యాయం చేస్తాడు, అన్యాయం చేయడనే పేరుంది. నేను పనికొచ్చే ఆర్టిస్ట్‌ని. చెడగొట్టే నటుడిని కాదు. ఇక మూస గురించి చెప్పాలంటే.. ఆ ఆలోచనే రాలేదు. మనం సినిమాల్లో యాక్ట్ చేయాలి, డబ్బులు కావాలి, పేరు కావాలి. మనం చేయనంటే ఇంకొకరు చేస్తారు. గ్యాప్ ఇస్తే ఇంకొకరు దూరతారు. అప్పుడు మనకు విశ్రాంతి తప్పదు (నవ్వుతూ). ► మీ జీవిత భాగస్వామి శ్రీదేవిగారు మూడేళ్ల క్రితం వరకూ తోడూ నీడలా ఉన్నారు. ఆవిడ దూరమయ్యాక మీ జీవితంలో వచ్చిన మార్పు? (చెమర్చిన కళ్లతో).. ఆ బాధ మాటలతో వర్ణించేది కాదు. సతీవియోగం అనేది, అందులో ఈ వయసులో ఈ ఎడబాటు గురించి చెప్పలేం. ఇది ఒకటీ రెండు రోజుల్లో తీరే బాధ కాదు. చెప్పుకుంటే తగ్గేది కాదు. నేను పోయేవరకూ ఆ బాధ వెంటాడుతూనే ఉంది. ► భర్త లేకపోయినా భార్య ఉండగలదని, భార్య లేని భర్త జీవితం దుర్భరమని అంటారు. నిజమేనా? నిజమే. అయితే, భర్త పోయినా భార్య బాధపడదని కాదు. కాకపోతే తను ఉండగలదు. కానీ మగవాడి పరిస్థితి అలా కాదు. అతను భార్య మీద పూర్తిగా ఆధారపడిపోతాడు. మరి భార్య పోయాక ఎవరి మీద ఆధారపడాలి? కూతురి దగ్గర ఉండలేడు. కూతురు పరాయి అయిపోతుంది. కొడుకు దగ్గర అంటే కోడలు పిల్ల బాగా చూస్తే ఫర్వాలేదు. ఎవరో ఒకరి దగ్గర ఉండాలి. ఎందుకంటే ఒంటరిగా బతకలేడు. మామూలు టార్చర్ కాదది. ► మీ భార్య పోయాక మీ నాన్నగారు కూడా చనిపోయారు. మామగారిని ఆవిడ బాగా చూసుకున్నారట. ఆ తర్వాత? నాన్న చనిపోయి ఆర్నెల్లు అవుతోంది. నా భార్య మా నాన్నను బాగా చూసుకుంది. ఆవిడ తర్వాత మా రెండో అబ్బాయి బోస్ వాళ్ల భార్య అంతే బాగా చూసుకుంది. అది నాకు సంతోషం. ► మీ నాన్నగారినే బాగా చూసుకున్నారంటే మిమ్మల్ని కూడా మీ కోడళ్లు బాగానే చూసుకుంటారని ఊహించవచ్చు? నిజమే. రఘుబాబు, బోస్‌బాబుకి మంచి సంబంధాలు చూసి చేశాను. కోడళ్లిద్దరూ చాలా మంచివాళ్లు. మా అమ్మాయి మాధవిది కూడా మంచి సంబంధమే. అల్లుడు మంచివాడు. మా ఇంటి పక్కనే వాళ్ల ఇల్లు. కుటుంబం పెద్దదయ్యాక ఇల్లు చాలడంలేదని రఘుబాబు మాదాపూర్‌లో కాపురం పెట్టాడు. ఇప్పుడు ఈ ఇంట్లో నేను, బోస్‌బాబు ఫ్యామిలీ ఉంటున్నాం. ► అప్పట్లో బోస్బాబుగారిని హీరోగా పెట్టి సినిమా చేశారు. ఆ తర్వాత ఎందుకు కంటిన్యూ కాలేదు? ‘ఇంద్రజిత్’ అనే సినిమాతో బోస్‌ని హీరోని చేశాను. నేను డైరెక్టర్ని. ఆ సినిమా బాగుందనిపించుకుంది. అయితే ఇండస్ట్రీలో కొందరు కావాలనే అన్ పాపులర్ చేశారు. హిట్ అయినా కాలేదని నెగటివ్ ప్రచారం చేశారు. అన్‌పాపులర్ చేయకపోయి ఉంటే వేరేలా ఉండేదేమో. కాంపిటీషన్ అనేది ఉంటుంది కదా. ఇలా చేయడం కామన్. ఏదైతేనేం బోస్ సినిమా కెరీర్ సాగలేదు. ప్రస్తుతం టీవీ సీరియల్స్ చేస్తున్నాడు. హ్యాపీగా ఉన్నాం. ► ఇప్పుడు మీ దినచర్య ఎలా ఉంది? మార్నింగ్ 6.30కి లేస్తాను. బ్రష్ చేసి కాఫీ తాగుతూ పేపర్లన్నీ తిరగేస్తాను. తర్వాత స్నానం, టిఫిన్. పని ఉంటే బయటకు వెళ్తా. ఒంటిగంటకు భోజనం. తర్వాత కునుకు. సాయంత్రం వాకింగ్. 7 నుంచి 10 గంటల వరకూ టీవీ చూస్తాను. స్కూల్ డేస్‌లో నేను స్పోర్ట్స్ పర్సన్‌ని. క్రికెట్, కబడ్డీ అంటే ఇష్టం. ఆ మ్యాచ్‌లు చూస్తా. 15–20 రోజులు ఖాళీ ఉంటే ఊరెళ్లిపోతా. పాత స్నేహితులంతా కలసి ఎంజాయ్ చేస్తాం. మా ఇల్లు అలానే ఉంది. దానిపక్కనే ఇంకో బిల్డింగ్ కట్టాం. పండగకి వెళ్తే 20 రోజులు ఉండాల్సిందే. ఇంతకు ముందు మే 1 నుంచి జూన్ 15 వరకూ ఫ్యామిలీ అంతా అక్కడే ఉండేవాళ్లం. అదే మా కొడైకెనాల్. ► డబ్బు విషయంలో ఎలా ఉంటారు? పెద్ద చేయే. నా కొడుకుది, కూతురిది, ఆఖరికి మా కోడళ్లది కూడా పెద్దచెయ్యే. ఏ ఫంక్షన్ అయినా విపరీతంగా ఖర్చు పెడతాం. మితిమీరి ఎప్పుడూ చేయలేదు. మా అమ్మాయికి ఒక కొడుకు, కూతురు. మనవడి పెళ్లయింది. అమెరికాలో ఉంటాడు. మనవరాలి పెళ్లి కూడా చేసేశాం. రఘుకి అమ్మాయి. బోస్కి అబ్బాయి. ఇంజనీరింగ్ చేశాడు. బోస్ కొడుకు నాగరత్న బాబు హీరోగా నా దర్శకత్వంలో వచ్చే ఏడాది ఓ సినిమా ప్లాన్ చేశాం. ► ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు సినిమా తీయగలను అనుకుంటున్నారా? సినిమా అంటే... మంచి కథ ఉండాలి. యాక్షన్ ఉండాలి. అలాగే సెంటిమెంట్ కూడా ఉండాలి. ఈ రెండూ సరిగ్గా కలిస్తే ఎప్పుడూ హిట్టే. డెఫినెట్‌గా హిట్ చేస్తాను. ► స్పోర్ట్స్ ఇష్టమన్నారు. వరల్డ్ కప్ ఫాలో అవుతున్నారా? మొన్న గెలిచాం కదా... ఫైనల్ వరకూ వెళ్లాలని కోరుకుందాం. ► మీకు తీరని కోరికలు ఏమైనా? అలాంటివేం లేవు. అన్నీ సక్రమంగా జరిగాయి. ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉన్నాం. ► బర్త్‌డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? ప్రతి సంవత్సరం ఊర్లోనే. ఊర్లో 500 మంది వరకూ భోజనం ఏర్పాటు చేస్తాను. అందరికీ అక్కడే సినిమాలు వేసి చూపిస్తుంటాను. ఆ సందడే వేరు. ఈసారి షూటింగ్ ఉంది. ‘డిస్కో రాజా’లో యాక్ట్ చేస్తున్నాను. అందుకని ఊరెళ్లలేదు. తర్వాత వీలు చూసుకుని వెళతాను. ► గతంలో ఎన్నికలప్పుడు చురుగ్గా పాల్గొన్నారు. మీకు రాజకీయాలంటే ఆసక్తి ఉందేమో? అప్పట్లో ప్రజాసేవ కోసం ఎన్టీఆర్‌గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు. మేం అందులో చేరి ప్రచారం చేశాం. ఆయన బంపర్ మెజారిటీతో గెలిచారు. తర్వాత కొన్ని కారణాల వల్ల మేం పార్టీ నుంచి బయటకు వచ్చేశాం. 2004లో అంతటి గొప్ప సంస్కర్త, ప్రజలకు మంచి చేస్తాడని నమ్మకం కలిగించిన నేత వై.ఎస్. రాజశేఖరరెడ్డిగారు. ఆయన్ని కలిశాను. 2009లో ఆయన కోసం ప్రచారం చేశాను. బంపర్ మెజార్టీతో గెలిచారు. ఆయన గతించిన తర్వాత ఆయన తనయుడు జగన్ పార్టీ స్థాపించాడు. ఆ పార్టీకి ప్రచారం చేశాను. దురదృష్టవశాత్తూ చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. ఆ ఐదేళ్లు ప్రజలను ఇబ్బందులు పెట్టాడు. జగన్ పాదయాత్ర చేసి, జనాల కష్టాలను తెలుసుకున్నాడు. రెండేళ్ల క్రితమే డిసైడ్ అయిపోయింది జగన్ సీఎం అవుతాడని. చెప్పినవన్నీ అద్భుతంగా నెరవేరుస్తాడు. ఎన్నికల ముందే టీడీపీకి 20 సీట్లకి మించి రావని చెప్పా. జగన్ పరిపాలన దేవుడి పరిపాలనలా ఉంటుంది. సీఎం అయి పది రోజులు కూడా కాకముందే హృదయాల్ని దోచుకుంటున్నాడు. అభివృద్ధి సాధిస్తాడు. కేంద్రంతోనూ సామరస్యంగా ఉండి, నిధులు తెస్తాడు. తెలంగాణతోనూ మంచి సంబంధాలున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు గొడవలు లేకుండా నడిపిస్తారు. కుమారులు రఘుబాబు, బోసుబాబులతో... – డి.జి.భవాని -
మా ఊరే బృందావనం
ఆకు రౌడీగా.. విలన్‌గా.. గూండాగా.. తండ్రిగా.. స్నేహితుడిగా.. ఇలా వెండితెరపై విలక్షణ పాత్రలు పోషించి సినీ అభిమానులను మెప్పించారు ప్రముఖ నటుడు గిరిబాబు. మూడు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన ఆయన.. మెగాఫోన్ చేతపట్టి మరో మూడు సినిమాలకు దర్శకత్వం వహించారు. వందల సినిమాల్లో తన నటనా ప్రతిభతో ప్రేక్షకులను అలరించిన గిరిబాబు సొంతూరు కొరిశపాడు మండలం రావినూతల. అసలు పేరు యర్రా శేషగిరిరావు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన గిరిబాబు.. ‘మా ఊరే నాకు బృందావనం’ అంటున్నారు. తన చిన్ననాటి సంగతులు, మధుర స్మృతులను ‘సాక్షి’తో పంచుకున్నారు. – అద్దంకి - పల్లెటూరిలో పుట్టడం నా అదృష్టం - ఇప్పటికీ జొన్న సంగటి, చింతకాయ పచ్చడి తింటా - కోతికొమ్మచ్చి, బెచ్చాలాట ఆడే ఆ రోజులే వేరు - ‘సాక్షి’తో సినీ నటుడు గిరిబాబు మా ఊరు రావినూతల జిల్లాలో ఒక ఆదర్శ గ్రామంగా పేరుగాంచింది. నా బాల్యం నుంచి 29వ ఏట వరకు ఊర్లోనే ఉన్నా. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం రావడంతో మద్రాసు వెళ్లా. ఎందరో గొప్ప గొప్ప నటులతో నటించా. అదంతా మీకు తెలిసిందే. ఎంత పెద్ద నగరాల్లో ఉన్నా.. నాకు, నా కుటుంబ సభ్యులకు స్వగ్రామంపై మమకారం ఎక్కువ. వీలుదొరికినప్పుడల్లా ఊరికి వచ్చి స్నేహితులతో, బంధువులతో గడుపుతా. రాజకీయం, సినీ రంగం ఒక తాను ముక్కలే. ఈ రెండు రంగాల్లో ఎప్పుడూ స్వార్థంతో పరుగులు తీయడమే సరిపోతుంది. నిజమైన బంధాలు అక్కడ ఉండవు. అక్కడన్నీ నాటకాలే. నిజమైన బంధాన్ని పంచే స్నేహితులు, ఆత్మీయుల కోసం సొంత ఊరు వచ్చి అనుభూతులు మూటగట్టుకుని వెళ్తుంటా. గ్రామంలో ఎవరింట శుభకార్యం జరిగినా పిలుస్తారు, అందరిళ్లకూ వెళ్తా. అదే వారికీ నాకు ఉన్న అనుబంధం. నాకు జన్మనిచ్చిన భూమి మీద ప్రేమ ఎక్కువ. గ్రామస్తులందరి సహకారంతో మౌలిక వసతులు ఏర్పాటు చేసుకున్నాం. అందరూ వేసవి సెలవులుకు బృందావనం, ఊటీ, కొడైకెనాల్ వెళ్తుంటారు. మాకు మాత్రం మా సొంతూరే బృందావనం, ఊటీ, కొడైకెనాల్. ఏటా 20 రోజులపాటు కుటుంబ సమేతంగా ఊరికి వచ్చి ఉంటా. గతంలో అయితే మే నెల నుంచి జూన్ 10వ తేదీ వరకు ఇక్కడే ఉండేవాణ్ని. నా జీవితంలో సినిమా ఆవకాశం దక్కడం, చిత్ర పరిశ్రమలో నిరంతరం అవకాశాలు రావడం ఎప్పటికీ మరిచిపోలేను. మా అమ్మ, నా భార్య మరణం నా జీవితంలో విషాధకర సంఘటనలు. సంగటి, చింతకాయ పచ్చడి.. ఆ రుచే వేరు అప్పట్లో వరి అన్నం లేదు. రాత్రి సమయంలో వరిగ అన్నం, పప్పుచారు, ఉదయం జొన్న సంగటి, సజ్జ సంగటి తినేవాళ్లం. సంగటి, చింతకాయ పచ్చడి తింటే ఆ రుచే వేరు. పండుగలకు సోమి బువ్వ, ఆబువ్వ(వరి అన్నం) వండేవాళ్లు. నేను ఇప్పటికీ మా ఇంట్లో జొన్న సంగటి, చింతకాయ పచ్చడి తింటాం. మా ఊరిలో వండే పకోడీలు, అరిసెలు, గారెలు, పులి బొంగరాలు అంటే ఎంతో ఇష్టం. ఏటా 40 కేజీల చింత తొక్కు పెట్టించి హైదరాబాద్ తీసుకెళ్తా. చింతకాయ తొక్కు కోసం నా సహ నటులు ఎçప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. అందరికీ పెడతాం. అప్పుడీ హోటళ్లు, టిఫిన్లు లేవు మా ఊరికి వస్తే చాలు.. బాల్యం, అప్పుడు ఆడుకున్న ఆటలు, స్నేహితులతో చేసిన అల్లరి అన్నీ గుర్తొస్తాయి. పల్లెటూరులో పుట్టడం నా అదృష్టం. పల్టెటూరి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మిత్రులతో కలిసి కోతికొమ్మచ్చి, బెచ్చాల ఆట, బొంగరాలాట ఆడుకునేవాణ్ని. నాటి సంగతులను ఇప్పటికీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటా. పట్టణంలో పెరిగిన వారికన్నా గ్రామాల్లో పెరిగిన వారు చాలా అదృష్ణవంతులు. దాదాపు ఏ వస్తువూ కొనుక్కునే పనిలేదు. బడి సెలవు రోజుల్లో పొలాలకు వెళ్లి తాటిచెట్లు ఎక్కి కాయలు కోసి తినేవాళ్లం. జెముడు కాయలు(నాగజెముడు కాయలు) భలే ఉండేవి. బాల్యం అంతా సరదా సరదాగా ఉండేది. అప్పుడీ హోటళ్లు, టిఫిన్లు లేవు. కలుషితం కాని, ప్రకృతి ప్రసాదించిన రకరకాల పళ్లను హాయిగా తినేవాళ్లం. నా చిన్న తనంలో పెళ్లిళ్లు ఐదు రోజులు జరిగేవి. పెళ్లి రోజుల్లో చేసే పనులకు ఒక అర్థం ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. డిటెక్టివ్ నవలలు చదివేవాడిని.. ఖాళీ సమయాల్లో టీవీలో పాత సినిమాలు చూస్తుంటా. పుస్తకాలు, పేపర్లు చదువుతా. విశ్వనాథ సత్యనారాయణ అంటే చాలా ఇష్టం. ఆయన రాసిన సాహిత్యం నవలలు ఇష్టంగా చదువుతా. అప్పట్లో డిటెక్టివ్ నవలలు బాగా చదివేవాడిని. రామాయణ, మహాభారత, భాగవతాలు, చరిత్ర, పురాణాలు అంటే ఇష్టం. బీరువా నిండా పుస్తకాలున్నాయి. వెండి తెరపై దాదాపు అన్ని పాత్రల్లో నటించా. -
నాకు, జనానికి నచ్చింది.. కానీ ఆడలేదు
నటుడు గిరిబాబు విజయవాడ కల్చరల్ : మంచినటుడిగా, ఉత్తమ అభిరుచిగల సినీ నిర్మాతగా గిరి బాబుకు పేరు ఉంది. ఆయన స్వస్థలం ప్రకాశం జిల్లా అద్దంకి తాలూకా రావినూతల. అసలు పేరు యర్రా శేషగిరిరావు. ఆయన గురువారం విజయవాడలో ఎస్.వి.రంగారావు స్మారక పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ‘సాక్షి కల్చరల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు... ప్రశ్న : మీ సుదీర్ఘ సినీ జీవితం తృప్తినిచ్చిందా? జవాబు : నేను సినిమాల్లోకి వచ్చి 42 ఏళ్లు. నాటక రంగం నుంచి సినీ రంగానికి వచ్చాను. ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు సినిమాలు చూసి నటుడిని కావాలనుకున్నా. నటుడిగా నా మొదటి సినిమా జగమేమాయ. ఇప్పటి వరకూ 550 సినిమాల్లో నటించా. సినీ జీవితం చాలా తృప్తిగా ఉంది. ప్ర : రాష్ట్రం విడిపోయాక తెలుగు సినిమా భవిష్యత్ ? జ : తెలుగు సినిమాకు ఇప్పుడు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. రెండు ప్రభుత్వాల చొరవతో పరిశ్రమ ముందుకు సాగుతుందనే భావిస్తున్నా. ఎవరైనా ఇప్పటికిప్పుడు కొత్తగా పరిశ్రమను సృష్టించలేరుకదా. ప్ర : సినిమా పరిశ్రమను వారసత్వ నటులు శాసిస్తున్నారు కదా? ప్రతిభ గల నటులు రావటం లేదని వస్తున్న విమర్శపై మీ స్పందన? జ : వారసత్వం అనేది సినిమాల్లోనే కాదు, రాజకీయాల్లోనూ ఉంది. అన్ని భాషల సినిమాల్లో వారసత్వ నటులు వస్తూనే ఉన్నారు. తెలుగులో కాస్త ఎక్కువ. నటుడుగా నిలబడాలంటే వారసత్వం ఒక్కటే చాలదు. ప్రతిభ ఉంటేనే ఎవరైనా రాణిస్తారు. ప్ర : తెలుగు సినిమాల్లో విలన్ పాత్రలు పోషించే ప్రతిభగల నటులు రావటంలేదుకదా? జ : కరెక్టుకాదు. పొరుగింటి పుల్లకూర రుచి సామెత ఉంది కదా. అందుకే మనవారు పొరుగు భాషల నుంచి విలన్లను తెస్తున్నారు. అలాగని మన విలన్లు పరాయి భాషలో నటిం చిన సందర్భాలు చాలా తక్కువ. మనదే ఆ ప్రత్యేకత. ప్ర : గతంలో సినిమాలు నిర్మించిన మీరు ఇప్పుడు ఎందుకు నిర్మించడం లేదు? జ : ఇప్పటికి ఎనిమిది సినిమాలు నిర్మించాను. ఇప్పటి సినిమాలు కోట్లతో పని. ఈ పరిస్థితుల్లో సినిమాలు తీయడం నావల్ల కాదు. కుటుంబ సమేతంగా నిర్మించే సినిమాలే తీశాను. నా సినిమాలకు నేనే కథ, నేనే దర్శకత్వం వహించాను. ప్ర : నిర్మాతగా మీ తొలి చిత్రం? జ : దేవతలారా దీవించండి. ఆ తరువాత వరుసగా మెరుపుదాడి, సింహగర్జన, ముద్దుముచ్చట, సంధ్యారాగం మొదలైన సినిమాలు నిర్మించాను. ప్ర : ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డుల్లోనూ ప్రతిభకు అన్యాయం జరుగుతోందిగా? జ : నిజమే. 550 సినిమాల్లో నటించిన నాకు నంది అవార్డులు రాలేదు. కానీ న్యాయ నిర్ణేతగా ఉన్నందుకు మాత్రం నాలుగు నందులు వచ్చాయి. ప్ర : మీరు సినిమాల్లోకి వచ్చి 40 ఏళ్లు దాటుతోందికదా. మీ సినీ చరిత్ర దాని గురించి ఏమైనా రాస్తున్నారా జ : నా జీవిత చరిత్ర రాసే పనిలో ఉన్నా. అయితే కొంత సమయం తీసుకోవచ్చు. ప్ర : మీకు నచ్చిన మీ సినిమా? జ : నాకు నచ్చిన సినిమా ‘సంధ్యారాగం’. ఈ సినిమా జనానికీ నచ్చింది. కానీ ఆడలేదు. ప్ర : ఈనాటి నటులకు మీరిచ్చే సలహా? జ : అద్భుతమైన కృషిచేస్తే తప్ప నటుడుగా నిలబడే రోజులు కావు. వారసత్వ నటులతో ఇబ్బందే. ప్ర : ఒత్తిడికి గురైతే ఏమిచేస్తారు? జ : వృత్తిపరంగా ఒత్తిళ్లు ఉన్నపుడు స్వగ్రామం వెళ్లిపోతా. అక్కడే సేదతీరుతా. మా ఊరి కోసం జూనియర్ కాలేజీ, కల్యాణ మండపం నిర్మాణంలో నా వంతు సహాయం చేశా. -
సీమాంధ్ర అభివృద్ధి జగన్ కే సాధ్యం
సంత మాగులూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలే కారణమని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని సినీ నటుడు గిరిబాబు పిలుపునిచ్చారు. వైఎస్సా సీపీ అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ను గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పాతమగులూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో సువర్ణ పాలన సాగించిన ఏకైక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అని కొనియాడారు. వైఎస్సార్ వారసత్వం పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటతప్పని, మడమ తిప్పని నేతగా ఎదిగారన్నాన్నారు. కుమ్మక్కు కుట్రలతో వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజాదరణ గల వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోలేని కాంగ్రెస్, టీడీపీ.. ఓట్లు, సీట్ల కోసం అన్నపూర్ణ లాంటి తెలుగు గడ్డను రెండు ముక్కలుగా చేశాయని నిప్పులు చెరిగారు. సీమాంధ్ర సమగ్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. చేయగలిగిన హామీలను మాత్రమే ఆయన ప్రకటించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో పేదల జీవితాల్లో వెలుగులు నింపేదిగా ఉందని చెప్పారు. జగన్‌ను సీఎం చేయడం కోసం ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు కృషి చేయాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అద్దంకి నియోజ వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న గొట్టిపాటి రవికుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలను అశాంతికి నిలయాలుగా మార్చే కొందరు నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అటువంటి వారి విషయంలో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గిరిబాబు రాకతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నెలకొంది. ఆయన సమక్షంలో మిన్నెకల్లు, పాతమాగులూరు కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు. -
గిరిబాబుకు కన్నీటి వీడ్కోలు
పోచమ్మమైదాన్, న్యూస్‌లైన్ : ఆంక్షలు లేని సంపూర్ణ తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసిన పాలిటెక్నిక్ విద్యార్థి పిల్లి గిరిబాబు అంతిమయూత్ర నగ రంలో తెలంగాణ వాదుల అశ్రునయనాల మధ్య సాగింది. సంపూర్ణ తెలంగాణ కావాలంటూ వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో మెకానికల్ డిప్లొమా సెకండియర్ చదువుతున్న పిల్లి గిరిబాబు(18) బుధవారం సాయంత్రం పెట్రోల్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఆయన భౌతికకాయూనికి గురువారం ఉదయం ఎంజీఎం ఆస్పత్రి మార్చురీలో పోస్టుమార్టం నిర్వహిం చారు. అనంతరం ఎంజీఎం నుంచి గిరిబాబు అంతిమయాత్ర ప్రారంభమై పాలిటెక్నిక్ వరకు సాగింది. జై తెలంగాణ... జైజై తెలంగాణ ... అమర్ రహే.. గిరిబాబు.. నీ త్యాగం వృథా కాదు అనే నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. ఎంజీఎం జంక్షన్లో తెలంగాణవాదులు రాస్తారోకో నిర్వహించారు. అక్కడున్న టీడీపీ జెండా గద్దెను ధ్వంసం చేసేందుకు వారు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జెండా గద్దెకు ఉన్న టీడీపీ జెండాను ద హనం చేసి, ఆ పార్టీ అధినేత చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. గిరిబాబుకు నివాళులు అర్పించిన వారిలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు, టీఆర్ఎస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లలితా యూదవ్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎంఏ హకీం నవీద్, ప్రిన్సిపాల్ శంకర్, టీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి నీలం రాజ్‌కిషోర్, అధ్యాపకులు బూరం అభినవ్, వై. కృష్ణ, పాలిటెక్నిక్ విద్యార్థి జేఏసీ చైర్మన్ మేకల అక్షయ్ కుమార్, ముశం శ్రీనివాస్, ఏఐఎస్ఎఫ్, ఏబీవీపీ, టీ ఆర్ఎస్వీ, డీఎస్‌యూ నాయకులు ఉన్నారు. అంతిమయాత్రకు వందిలాదిగా విద్యార్థులు తరలివచ్చారు. దహన సంస్కారాలకు హాజరైన విద్యార్థులు.. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం ముకుందాపురంలో గిరిబాబు అంత్యక్రియల్లో అతడి సహచర విద్యార్థులు పాల్గొన్నారు. తమ స్నేహితుడు తమ నుంచి విడిపోతున్నాడని దుఃఖసాగరంలో మునిగిపోయారు. తెలంగాణ పాలిటెక్నిక్ జేఏసీ కన్వీనర్ మేకల అక్షయ్ కుమార్ బృందం హాజరయ్యారు. రూమ్‌లో సూసైడ్‌నోట్ గిరిబాబు ఉంటున్న రూమ్‌లో బుధవారం రాత్రి పోలీ సులు తనిఖీ చేయగా సూసైడ్‌నోట్ లభించిం ది. అరుుతే ఆ లేఖను గోప్యంగా ఉంచారు. అందులో ‘నా కోటి రత్నల వీణ నా తెలంగాణ. 60 యేళ్ల పోరాటంలో మిగిలింది ఏమిటి చావులు, ధర్నాలు, రాస్తారోకోలు.. ఓ తెలంగాణ యువకుడా ఇకనైనా ఏలుకో... నాకు ఎంతో బాధగా ఉంది. నేను పెద్దవాడిని అయ్యాక పోలీసునై అమ్మాయిల మీద అరాచాకాలను అపుదాం అనుకున్న.. నా చావుతో అయినా సంపూర్ణ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలి. అన్నయ్య, అమ్మా, నాన్న సారీ. అన్న య్యూ.. అమ్మ,నాన్నకు నేను లేని లోటు తీర్చు. పాలిటెక్నిక్ ఫ్రెండ్స్ సంపూర్ణ తెలంగాణ వచ్చే వరకు పోరాటం ఆపకండి. ప్రిన్సిపాల్ సార్ దయచేసి కోఆపరేట్ చేయండి.. ఇంక పదేళ్లు హైదరాబాద్ ఎందుకు కావాలి. ఇంక ఎంత దోచుకపోతారు’ అని లేఖలో పేర్కొన్నాడు.