సంత మాగులూరు, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలే కారణమని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీలను ప్రజలు తరిమికొట్టాలని సినీ నటుడు గిరిబాబు పిలుపునిచ్చారు. వైఎస్సా సీపీ అద్దంకి అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్‌ను గిరిబాబు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పాతమగులూరు గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ లో సువర్ణ పాలన సాగించిన ఏకైక నాయకుడు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి అని కొనియాడారు.
వైఎస్సార్ వారసత్వం పుణికిపుచ్చుకున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మాటతప్పని, మడమ తిప్పని నేతగా ఎదిగారన్నాన్నారు. కుమ్మక్కు కుట్రలతో వైఎస్సార్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజాదరణ గల వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ఎదుర్కోలేని కాంగ్రెస్, టీడీపీ.. ఓట్లు, సీట్ల కోసం అన్నపూర్ణ లాంటి తెలుగు గడ్డను రెండు ముక్కలుగా చేశాయని నిప్పులు చెరిగారు. సీమాంధ్ర సమగ్రాభివృద్ధి జగన్‌తోనే సాధ్యమన్నారు. చేయగలిగిన హామీలను మాత్రమే ఆయన ప్రకటించారని తెలిపారు. వైఎస్సార్ సీపీ మేనిఫెస్టో పేదల జీవితాల్లో వెలుగులు నింపేదిగా ఉందని చెప్పారు.
జగన్‌ను సీఎం చేయడం కోసం ప్రతి కార్యకర్త, ప్రతి ఓటరు కృషి చేయాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. అద్దంకి నియోజ వర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న గొట్టిపాటి రవికుమార్‌ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాలను అశాంతికి నిలయాలుగా మార్చే కొందరు నేతలు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, అటువంటి వారి విషయంలో ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గిరిబాబు రాకతో పార్టీ కేడర్‌లో నూతనోత్సాహం నెలకొంది. ఆయన సమక్షంలో మిన్నెకల్లు, పాతమాగులూరు కార్యకర్తలు వైఎస్సార్ సీపీలో చేరారు.
సీమాంధ్ర అభివృద్ధి జగన్ కే సాధ్యం
Published Thu, May 1 2014 2:50 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement