
ప్రముఖ నటుడు పవన్ కల్యాణ్ అభిమానులు, ప్రముఖ సినీ విమర్శకుడు, బిగ్‌బాస్ కంటెస్టెంట్ మహేశ్ కత్తి మధ్య తలెత్తిన వివాదం ఇంకా సద్దుమణిగినట్టు కనిపించడం లేదు. ఇప్పటికీ పవన్ కల్యాణ్ అభిమానులు తనను వేధిస్తున్నారని, అసభ్యంగా కామెంట్లు, మెసేజ్‌లు పెట్టడమే కాకుండా.. బెదిరింపులకు దిగుతూ ఫోన్‌కాల్స్ చేస్తున్నారని తాజాగా మహేశ్ కత్తి ఫేస్‌బుక్‌లో వెల్లడించారు. తనను బెదిరించిన పీకే అభిమానుల ఫోన్‌నంబర్లను, అసభ్యమైన కామెంట్లను ఆయన ఫేస్‌బుక్‌లో పోస్టుచేశారు. పవన్ అభిమానుల పేరిట ఎవరైనా తనకు కాల్ చేసి బెదిరించినా.. దూషించినా.. వారి వివరాలు, ఫోన్‌నెంబర్, వాయిస్ రికార్డింగ్‌తో సహా సోషల్ మీడియాలో వెల్లడిస్తానని, ఇది హెచ్చరిక అని ఆయన స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ నటన, సినిమాల గురించి క్రిటిక్ మహేశ్ కత్తి కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేయడంతో.. ఆయన అభిమానులు మహేశ్ కత్తిపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మహేశ్ కత్తిని విమర్శిస్తూ, దూషిస్తూ, బెదిరిస్తూ మెసేజ్‌లు పెట్టడం, ఫోన్‌కాల్స్ చేయడం వంటి దుందుడుకు చర్యలకు దిగారు. దీనికి మహేశ్ కత్తి దీటుగా స్పందించారు. తనకు వచ్చిన బెదిరింపులపై ప్రజాస్వామిక పంథాలో ఆయన ఘాటుగా బదులిచ్చారు. దీంతో పవన్ అభిమాన సంఘాల నేతలు, మహేశ్ కత్తితో మాట్లాడి ఈ వివాదాన్ని సద్దుమణిగేలా చూసేందుకు ప్రయత్నించారు. అయినప్పటికీ పవన్ అభిమానుల ఆగడాలు ఆగడం లేదని, తాజాగా ఇప్పుడు కూడా తనకు బెదిరింపులు వస్తున్నాయని మహేశ్ కత్తి తాజాగా వెల్లడించారు.
ఫొటో: మహేశ్ కత్తి (ఫేస్‌బుక్)