డ్రగ్స్‌కు బానిసై దెబ్బతిన్నా: భానుచందర్
హైదరాబాద్: చిత్ర పరిశ్రమలోని సాంకేతిక నిపుణులు, నటుటు డ్రగ్స్ బానిసలుగా మారుతుంటే తనకు బాధగా అనిపిస్తోందని ప్రముఖ సీనియర్ నటుడు భాను చందర్ అన్నారు. అసలు ఈ విషయమే తనకు నచ్చడం లేదని చెప్పారు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పలువురు డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నేపథ్యంలో స్పందించిన ఆయన దయచేసి యువత, ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఉన్నవారు మత్తుపదార్థాలకు బానిసగా మారొద్దని కోరారు. గతంలో డ్రగ్స్‌కు బానిసగా మారిన తాను చాలా దెబ్బతిన్నానని గుర్తుచేసుకున్నారు. వివాహం కాకముందే తాను మత్తుమందులకు బానిసగా మారానని చెప్పారు.
అయితే అందులో నుంచి బయటపడేందుకే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నానని, ఈ విషయంలో తన అన్నయ్య స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. మార్షల్ ఆర్ట్స్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించి, కెరీర్‌పై దృష్టి పెట్టడంతో సినీ పరిశ్రమలో పేరు సంపాదించుకున్నానని తెలిపారు. 'యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. డ్రగ్స్ జోలికి వెళ్లకండి. క్రమశిక్షణతో ఉంటే మనకు అవసరమైనవి మన దగ్గరకే వస్తాయి. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం ద్వారా క్రమశిక్షణ వస్తుంది. దీనికి వయసుతో పనిలేదు. ఎవరైనా నేర్చుకోవచ్చు. మార్షల్ ఆర్ట్స్ ద్వారా జీవితంలో మంచి మార్పు రావడం ఖాయం' అని భాను చందర్ చెప్పారు.