వినోదం గ్యారెంటీ
‘హోప్’, ‘చంద్రహాస్’, ‘వెన్నెల’ వంటి చిత్రాలను నిర్మించి, నటించిన పొలిచర్ల హరనాథ్ కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఓ సినిమాలో నటిస్తున్నారు. ‘టిక్ టాక్’ పేరుతో ఈ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్నారాయన. ఈ సినిమా డిజిటల్ పోస్టర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ విడుదల చేశారు.
హరనాథ్ మాట్లాడుతూ– ‘‘నేనిప్పటివరకు తీసిన సినిమాలకు భిన్నంగా ఉండాలని కామెడీ హారర్ నేపథ్యంలో ‘టిక్ టాక్’ తీస్తున్నా. ఇదొక పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం. అశ్లీలం ఉండదు, చిన్నపిల్లలను భయపెట్టే హారర్ కాదు. నాకు సినిమాలు ఆత్మతో సమానం. అందుకు తగ్గట్లుగానే జీవిస్తున్నాను. ఈ సినిమా కోసం డ్యాన్సులు, ఫైట్లు నేర్చుకున్నా. ఈ చిత్రం తర్వాత వచ్చే రెండేళ్లలో ఐదు సినిమాలు నిర్మించాలనుకుంటున్నా. ఆస్కార్ స్థాయి సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అన్నారు. నిషిగంధ, మౌనిక కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి.వంశీకృష్ణ, సంగీతం: ఎస్‌ఆండ్‌బీ మ్యూజిక్ మిల్.