
పూజా భట్ (ఫైల్ ఫోటో)
తనుశ్రీ దత్తా - నానా పటేకర్ వివాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చానీయాంశం అయ్యింది. 2008లో ‘హార్న ఓకే ప్లీజ్’ సినిమా షూటింగ్ సందర్భంగా నానా పటేకర్ తనను వేధించాడంటూ తనుశ్రీ చేసిన ఆరోపణలు మన దేశంలో కూడా ‘మీటూ’ ఉద్యమానికి ఆరంభంగా నిలిచాయంటున్నారు ప్రముఖులు. కానీ ఈ ప్రారంభం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు అంటూ పెదవి విరుస్తున్నారు. కారణం ఇండస్ట్రీలో జరుగుతున్న ఇలాంటి అన్యాయాల గురించి పెద్ద హీరోలు మాట్లాడకపోవడం. తనుశ్రీ వివాదం గురించి ఇంతవరకూ బాలీవుడ్ స్టార్ హీరోలైనా అమితాబ్ బచ్చన్ కానీ, ఖాన్ హీరోల త్రయం కానీ స్పందించలేదు.
అయితే తనుశ్రీ - నానా వివాదంలో స్వరా భాస్కర్, ప్రియాంక చోప్రా, ట్వింకిల్ ఖన్నా, అనుష్క శర్మ, వరుణ్ ధావన్‌లు తనుశ్రీకి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరి వరుసలోకి మహేష్ భట్ తనయ పూజా భట్ చేరారు. ఈ విషయం గురించి ఆమె మాట్లాడుతూ.. ‘తనుశ్రీ, నానా పటేకర్ తనను లైంగింకంగా వేధించాడని చెప్పినప్పుడు చాలా మంది ‘ఇమె పదేళ్లు నోర్ముసుకుని ఉండి ఇప్పుడు ఎందుకు మాట్లాడుతుంది’ అనడం నేను స్వయంగా విన్నాను. అంతేకాక కొంత మంది ‘నానా చాలా మంచి వ్యక్తి’ అంటూ అతనికి కితాబు ఇస్తున్నారు.. కానీ కొందరు అతన్ని రౌడీ అని పిలవడం కూడా నేను విన్నాను. ఈ విషయంలో తనుశ్రీ ఇంకా మౌనంగా ఉండాల్సిన అవసరం లేదు. తాను ఈ విషయాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేయించాలి’ అని తెలిపారు.
ఈ సందర్భంగా పూజా తన గతాన్ని గుర్త చేసుకుంటూ ‘ఒకప్పుడు నేను ఒక వ్యక్తితో బంధాన్ని కలిగి ఉండేదాన్ని. అతను చాలా ఆల్కాహాలిక్.. నన్ను కొట్టేవాడు. అతని గురించి నేను మాట్లాడినప్పుడు ఇండస్ట్రీ.. ‘ఎందుకు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నావ్.. ఇలాంటి చెత్త గురించి బహిరంగాగా చర్చించడం వల్ల లాభం ఏంటి’ అని ప్రశ్నించింది. కానీ హింసను ఎదుర్కొన్నది నేను. మహేష్ భట్ కూతుర్ని అయినంత మాత్రాన నాకు తక్కువ బాధ కలగదు కదా’ అంటూ ప్రశ్నించారు.
అంతేకాక ‘నన్ను కిందకు లాగిన వారికి.. నా మంచితనాన్ని చెరపేసిన వారికి.. నన్ను నాశనం చేయాలని చూసిన వారికి నా ధన్యవాదాలు. ఎందుకంటే వీటన్నింటి వల్ల నాకు నా బలం ఏంటో తెలిసింది. సమాజం ఎలా ఉంటుందో తెలిసిందో. సమస్యలతో ఎలా పోరాడాలో తెలిసింది. అన్నింటికి మించి నా కాళ్ల మీద నేను నిలబడేందుకు.. నా సమస్యలతో నేనే పోరాటం చేసేందుకు కావాల్సిన ధైర్యాన్ని నేను కూడగట్టుకున్నాను. నేను బాధితురాలిని.. నా సమస్యలతో నేనే పోరాడుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు.