
తమిళసినిమా: ఎవరు? ఎప్పుడు? ఎక్కడ? ఎలా? సక్సెస్ అవుతారో తెలియదు. అదే జీవితం అంటే. తారల విషయానికి వస్తే, ఒక భాషలో నిరాకరింపబడిన వారు మరో భాషలో ఆదరింపబడవచ్చు. ప్రస్తుతం అగ్రనటిగా రాణిస్తున్న అనుష్క, ఇలియానా, రకుల్‌ప్రీత్‌సింగ్, పూజాహెగ్డే ఇలా చాలా మంది ఆదిలో కోలీవుడ్‌లో తిరస్కరించబడ్డవాళ్లే. అలాగని నిరాశ పడకుండా ప్రయత్నించి చూద్దాం అన్నట్లుగా టాలీవుడ్‌లో అవకాశాలను అందుకుని అక్కడ సక్సెస్ అయ్యి ఆ తరువాత కోలీవుడ్‌లో క్రేజీ నటిమణులుగా రీఎంట్రీ ఇచ్చారు. నటి పూజాహెగ్డే విషయానికి వస్తే ఈ ఉత్తరాది బ్యూటీని దర్శకుడు మిష్కిన్ కోలీవుడ్‌కు పరిచయం చేశారు. జీవాకు జంటగా ముఖముడి చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడికి దాదాపు ఏడేళ్ల అయినా ఇప్పటివరకూ అదే చివరి చిత్రం అయ్యింది.
అయితే టాలీవుడ్‌లో అల్లుఅర్జున్, మహేశ్‌బాబు వంటి టాప్ స్టార్స్‌తో నటిస్తూ క్రేజీ కథానాయకిగా వెలుగొందుతోంది. అలాంటిది తాజాగా మరో లక్కీఛాన్స్ పూజాహెగ్డే ఇంటి తలపులు తట్టినట్లు సమాచారం. నటుడు సూర్యతో రొమాన్స్ చేయనున్నట్లు ఒక టాక్ స్ప్రెడ్ అయ్యింది. సూర్య నటించిన తాజా చిత్రం ఎన్‌జీకే ఇటీవల తెరపైకి వచ్చి మిశ్రమ స్పందననే తెచ్చుకుంది. ప్రస్తుతం ఆయన కేవీ.ఆనంద్ దర్శకత్వలో కాప్పాన్ చిత్రాన్ని పూర్తి చేసి ఇరుదుచుట్రు చిత్రం ఫేమ్ సుధ కొంగర దర్శకత్వంలో సూరరై పోట్టు చిత్రంలో నటిస్తున్నారు. తొలి షెడ్యూల్ షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం రెండో షెడ్యూల్‌ను చత్తీస్‌ఘడ్‌లో జరుపుకుంటోంది. ఇందులో మలయాళ నటి అపర్ణ బాలమురళిని హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇప్పటివరకూ చిన్న హీరోలతో నటిస్తున్న ఈ అమ్మడికి సూర్య వంటి స్టార్ హీరోతో నటించడం ఇదే ప్రథమం. అయితే చిత్ర కథ పాత్రను బట్టి ఆమెను ఎంపిక చేసినట్లు చిత్ర వర్గాలు పేర్కొన్నాయి. తాజా సమాచారం ఏమిటంటే ఇందులో మరో ముఖ్య పాత్ర ఉంటుందని, ఆ పాత్రకు సంబంధించిన సన్నివేశాలను మూడో షెడ్యూల్ నుంచే చిత్రీకరించనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం. ఆ పాత్రలో నటి పూజాహెగ్డే నటించనుందని తాజా సమాచారం. ఇదే నిజం అయితే సూరరై పోట్టు చిత్రం తరువాత పూజాహెగ్డే ఇక్కడ తన మార్కెట్‌ను విస్తరించుకుంటుందని భావించవచ్చు.