
భరత్ అనే నేను సినిమాతో మరో ఘనవిజయం సాధించిన కొరటాల శివ తన తదుపరి ప్రాజెక్ట్ ను ఇంకా ప్రకటించలేదు. అయితే మీడియాలో మాత్రం రకరకాల వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ఫిలిం నగర్‌లో వినిపిస్తోంది. తన తొలి చిత్ర హీరోతో మరోసారి కలిసి పనిచేసేందుకు కొరటాల రెడీ అవుతున్నారట. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన మిర్చి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన కొరటాల శివ తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించారు.
తరువాత వరుసగా శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ లాంటి హిట్స్ సాధించి తాజాగా భరత్ అనే నేనుతో మరో ఘనవిజయాన్ని అందుకున్నారు. ఈ దర్శక రచయిత ప్రభాస్ తో మరో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నారట. అయితే ఈ కాంబినేషన్ ఇప్పట్లో తెరమీదకు వచ్చే అవకాశం కనిపించటం లేదు. ప్రస్తుతం సాహో షూటింగ్‌లో బిజీగా ఉన్న ప్రభాస్ తరువాత జిల్ ఫేం రాధకృష్ణ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. బాలీవుడ్‌లోనూ త్వరలో ఓ సినిమా ఉంటుందని ఇప్పటికే ప్రకటించేశాడు. ఈ సినిమాలన్ని పూర్తయితే గాని ప్రభాస్, కొరటాల కాంబినేషన్ తెర మీదకు వచ్చే అవకాశం లేదు.