తండ్రీ కొడుకులుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం?
రాజమౌళికి ఎన్టీఆర్ ముద్దుగా పెట్టుకున్న పేరు ‘జక్కన్న’. దానికి తగ్గట్టే సినిమాని శిల్పంలా చెక్కుతారాయన. ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నారు రాజమౌళి. గ్రాండియర్‌గా... హాలీవుడ్ సినిమా ‘గ్లాడియేటర్’ రేంజ్‌లో ‘బాహుబలి’ని తెరకెక్కిస్తున్నారాయన.
రాచఠీవీకి దర్పణంలా భారీ రాజప్రాసాదాలు, అబ్బురపరిచే పాత్రధారుల ఆహార్యం, వీరత్వానికి ప్రతీకల్లా ఆయుధాల సొగసులు... మేలుజాతి గుర్రాల డెక్కల చప్పుళ్ళు, ప్రకృతి సైతం పరవశింపజేసే ఉద్యానవనాలు... ఇవన్నీ ‘బాహుబలి’కి కళాత్మకశోభను సంతరింపజేశాయని వినికిడి. ఆర్‌ఎఫ్‌సీలో జరుగుతున్న ఈ చిత్రం షూటింగ్ పరిసరాలను చూసి ప్రముఖులు, మేధావులు సైతం ఆశ్చర్యానికి లోనవుతున్నట్లు సమాచారం.
ఇందులో ప్రభాస్, రానా అన్నదమ్ములుగా నటిస్తున్న విషయం తెలిసిందే. తండ్రీ కొడుకులుగా ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. అలాగే... రానా కొడుకు పాత్రలో అడవి శేష్ నటిస్తున్నారని తెలిసింది. వీరిద్దరిదీ యాంటీషేడ్స్ ఉన్న పాత్రలే కావడం విశేషం.
ఇక అనుష్క కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో మరో కథానాయికగా ప్రముఖ బాలీవుడ్ నాయికను ఎంపిక చేసినట్లు తెలిసింది. 80 నుంచి 100 కోట్ల రూపాయల భారీ నిర్మాణ వ్యయంతో రూపొందుతోన్న ఈ చిత్రం పూర్తవడానికి సుమారు రెండేళ్లు పడుతుందని అంచనా. ‘బాహుబలి’తో రాజమౌళి విజయపరంపర దిగ్విజయంగా కొనసాగడం ఖాయమని యూనిట్ వర్గాల అభిప్రాయం.